మట్టి కథల్లో మెరుస్తోన్న అందాల భామలు!
వెండి తెరపై గ్లామర్ ఒలికించడం, మోడ్రన్ దుస్తుల్లో మెరిసిపోవడం ఒకప్పటి హీరోయిన్ల ట్రెండ్.
By: Srikanth Kontham | 2 May 2026 6:00 AM ISTవెండి తెరపై గ్లామర్ ఒలికించడం, మోడ్రన్ దుస్తుల్లో మెరిసిపోవడం ఒకప్పటి హీరోయిన్ల ట్రెండ్. కానీ ప్రస్తుత తరం కథానాయికలు రూటు మార్చారు. అందాల ప్రదర్శనకే పరిమితం కాకుండా మట్టి వాసన కలిగిన కథల్లో, సహజ త్వానికి దగ్గరగా ఉండే పల్లెటూరి పాత్రల్లో నటించేందుకు అమితాసక్తి చూపిస్తున్నారు. పాత్రలో బలం ఉంటే మేకప్ లేకపోయినా? డీగ్లామరైజ్డ్ లుక్‌లో కనిపించినా? వెనకడుగు వేయడం లేదు. ఈ క్రమంలోనే పలువురు అందాల భామలు గ్రామీణ నేపథ్యం ఉన్న చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ రేసులో ముందుంది మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. ఇప్పటి వరకు క్యూట్ అండ్ బబ్లీ పాత్రలతో ఆకట్టుకున్న అమ్మడు రూటు మార్చి `భోగి` అనే సినిమాలో పూర్తి స్థాయి మాస్ విలేజ్ లుక్‌లో కనిపించబోతుంది. ఈ చిత్రం కోసం బాడీ లాంగ్వేజ్‌ను, ఆహార్యాన్ని పూర్తిగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. పల్లెటూరి అమ్మాయిలోని తెగింపును, మాస్ యాటిట్యూడ్‌ను పాత్ర ద్వారా అనుపమ వెండితెరపై ఆవిష్కరించబోతుంది. ఈ ప్రయోగం ఆమె కెరీర్‌కు మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
మరో ప్రతిభావంతమైన నటి ఐశ్వర్య లక్ష్మి కూడా మట్టి కథపైనే మక్కువ చూపిస్తోంది. అమ్మడు నటిస్తోన్న `సంబరాల ఏటిగట్టు` చిత్రం స్వచ్ఛమైన గ్రామీణ ప్రేమకథగా రూపొందుతోంది. ఇందులో ఐశ్వర్య పల్లెటూరి యువతిగా, కల్మషం లేని అభినయంతో అలరించనుంది. సహజమైన లొకేషన్లలో, సహజమైన వేషధారణతో ఐశ్వర్య పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది. గ్లామరస్ పాత్రల కంటే ఇలాంటి మట్టి కథల్లో నటించడమే నటిగా తనకు సంతృప్తినిస్తుందని రివీల్ చేయడం విశేషం.
బాలీవుడ్ భామ భాగ్యశ్రీ బోర్డ్సే కూడా సౌత్ సహజ కథల వైపు మొగ్గు చూపుతుంది. `లెనిన్` అనే మాస్ లవ్ స్టోరీలో అమ్మడు క్యూట్ విలేజ్ అమ్మాయిగా నటిస్తోంది. సాధారణంగా ఉత్తరాది భామలు గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ భాగ్యశ్రీ మాత్రం పక్కా లోకల్ కథను ఎంచుకుని ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాలో ఆమె లుక్ కొత్తగా ఉంటుందని, సాదాసీదా పల్లెటూరి అమ్మాయి ప్రేమ కోసం పడే తపనను అద్భుతంగా పండించిందని చిత్ర యూనిట్ చెబుతోంది.
డిఫరెంట్ లుక్స్‌తో ఆకట్టుకునే కయాదు లోహర్ సైతం వింటేజ్ గ్రామీణ నేపథ్యాన్ని ఎంచుకుంది. `ది పారడైస్` లో ఆమె 1980 - 90ల నాటి వింటేజ్ లుక్‌లో అలరించనుంది. ఆ కాలం నాటి పల్లెటూరి వాతావరణం, కట్టుబొట్టును ప్రతిబింబించేలా పాత్రను డిజైన్ చేశారు. గ్లామర్ హీరోయిన్‌గా గుర్తింపు ఉన్న కయాదు ఇలాంటి ప్రయోగాత్మక పాత్రను ఎంచుకోవడం ఆమెలోని నటిని కొత్తగా ఆవిష్కరించే అవకాశం ఉంది. ఈ వింటేజ్ డ్రామాలో కయాదు నటన సినిమాకే హైలైట్ అవుతుందని టాక్.
ప్రస్తుత కథానాయికలు ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోవడానికి ఇష్టపడటం లేదు. పల్లెటూరి పాత్రలు, సహజమైన కథలు నటిగా తమకు గుర్తింపుతో పాటు అవార్డులను కూడా తెచ్చిపెడతాయని బలంగా నమ్ముతున్నారు. అందుకే గ్లామర్‌ను పక్కన పెట్టి మట్టి కథల్లో మెరిసేందుకు పోటీ పడుతున్నారు. ఈ భామలు ఎంచుకున్న కొత్త దారి తెలుగు సినిమాను మరింత సహజత్వానికి దగ్గరగా తీసుకువెళ్తుందనడంలో సందేహం లేదు.
