ఫ్లాప్ డైరెక్టర్లలను పిలిచి అవకాశాలిస్తారు
కొందరు హీరోలు జయాపజయాలకు అతీతంగా వ్యవహరిస్తారు. ఒక ఫ్లాప్ డైరెక్టర్ కి అవకాశం ఇవ్వడానికి కూడా వెనకాడరు.
By: Sivaji Kontham | 30 Oct 2025 9:52 AM ISTకొందరు హీరోలు జయాపజయాలకు అతీతంగా వ్యవహరిస్తారు. ఒక ఫ్లాప్ డైరెక్టర్ కి అవకాశం ఇవ్వడానికి కూడా వెనకాడరు. ఇక్కడ కేవలం సత్సంబంధాలు మాత్రమే కథను నడిపిస్తాయి. ఒక డైరెక్టర్ లో విషయం ఉంది లేదు! అనేది కూడా వారికి పట్టదు. మంచి రిలేషన్ షిప్ కోసం మాత్రమే అవకాశం ఇస్తే ఎలా ఉంటుందో కూడా చరిత్రలో ప్రూవ్ అయింది.
అలాంటి కొన్ని సందర్భాలను పరిశీలిస్తే, మెగాస్టార్ చిరంజీవి నటించిన 'భోళా శంకర్', విక్టరీ వెంకటేష్ నటించిన 'షాడో' ఫలితాల గురించి తెలిసిందే. ఆ రెండు సందర్భాలలో ఎన్టీఆర్ కి `శక్తి` లాంటి భారీ ఫ్లాప్ ని ఇచ్చిన మెహర్ రమేష్ కి పిలిచి మరీ అవకాశాలిచ్చారు. దాని ఫలితం ఎలా ఉంటుందో కూడా సదరు అగ్ర హీరోలు చవి చూసారు. హీరోలు, నిర్మాతలతో సత్సంబంధాలను కొనసాగించడం, నమ్మిన వ్యక్తిగా ఉండటంలో మెహర్ రమేష్ గొప్పతనం గురించి చాలా చర్చ ఇండస్ట్రీలో ఉంది. వి.వి వినాయక్, శ్రీను వైట్ల లాంటి అగ్ర దర్శకులు ఫ్లాపుల్లో ఉన్నప్పుడు కూడా కొన్ని అవకాశాల్ని అందుకున్నారు. అవి కూడా తిరిగి డిజాస్టర్లుగా మారాయి తప్ప విజయాలు కాలేదు. విజయాలుగా మలచడంలో వారు అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. పరిశ్రమలో చిరంజీవి, రవితేజ లాంటి అగ్ర హీరోలు జయాపజయాలకు భిన్నంగా పైన పేర్కొన్న దర్శకులిద్దరికీ అవకాశాలు కల్పించిన విషయాన్ని మరువకూడదు.
ఇటీవలి కాలంలో మాస్ మహారాజ్ రవితేజ కొందరు ఫ్లాప్ డైరెక్టర్లకు ఎలాంటి సందిగ్ధతలు లేకుండా అవకాశాలు కల్పించారు. జయాపజయాలతో సంబంధం లేకుండా వారితో ఉన్న సత్సంబంధాల కారణంగా అవకాశాల్ని కల్పించారు. ఒకసారి నిరూపించుకుంటే సదరు దర్శకులకు కెరీర్ పరంగా సహాయం చేసినవాడిగా తన పేరు నిలబడేది. కానీ దానిని సదరు దర్శకులు సద్వినియోగం చేసుకోవడంలో దారుణంగా ఫెయిలయ్యారు. వారు ఎవరూ నిరూపించుకోలేదు. రవితేజ నటించిన ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగిల్ ఇవన్నీ ఇదే బాపతు అవకాశాలే. తనకు అత్యంత సన్నిహితులైన వారికి అవకాశాలిచ్చేందుకు రవితేజ వెనకాడరు. కానీ అవి డిజాస్టర్లుగా మారినప్పుడే తప్పును తెలుసుకోగలడు. `మాస్ జాతర` ప్రచార వేదికపై రవితేజ తన తప్పును అంగీకరించారు. తన చివరి సినిమాలతో అభిమానులను నిరాశపరిచానని, విసిగించానని తాజా చిత్రం `మాస్ జాతర`తో అలా జరగదని కూడా ప్రామిస్ చేసారు. తన సినిమాలకు రచయితగా పని చేసిన భాను అనే మరో ప్రతిభావంతుడికి రవితేజ అవకాశం కల్పించారు. అయితే మాస్ జాతరతో అతడు నిరూపించాల్సి ఉంటుంది.
అప్పటికే ఫ్లాపుల్లో ఉన్న పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్ కి విజయ్ దేవరకొండ అవకాశం కల్పించాడు. విజయ్- పూరి కాంబినేషన్ లో వచ్చిన 'లైగర్' ఏ స్థాయి డిజాస్టరో తెలిసిందే. పూరీ ఫ్లాపుల్లో ఉన్నా అతడిలోని కమర్షియల్ డైరెక్టోరియల్ ఎలిమెంట్ తనకు కలిసొస్తుందని దేవరకొండ భావించాడు. కానీ ఆశించినది జరగలేదు. గౌతమ్ తిన్ననూరి కొన్ని సార్లు మాత్రమే మ్యాజిక్ చేస్తున్నా అతడి ప్రతిభను నమ్మి అవకాశం కల్పించాడు దేవరకొండ. విజయ్- గౌతమ్ తిన్ననూరి జోడి కింగ్ డమ్ ఫలితం గురించి తెలిసిందే. ఇలాంటి ఎన్నో ఉదాహరణలు టాలీవుడ్ హిస్టరీలో ఉన్నాయి.
