Begin typing your search above and press return to search.

నిజాయితీకే ప్రేక్ష‌కాభిమానులు పెద్ద పీట‌!

ఒకప్పుడు సినిమా రంగంలో హీరోలంటే తెరపైనే కాదు. నిజ జీవితంలోనూ ఎంతో ఆర్భాటంగా ఉండేవారు.

By:  Srikanth Kontham   |   11 Oct 2026 2:07 PM IST
నిజాయితీకే ప్రేక్ష‌కాభిమానులు పెద్ద పీట‌!
X

ఒకప్పుడు సినిమా రంగంలో హీరోలంటే తెరపైనే కాదు. నిజ జీవితంలోనూ ఎంతో ఆర్భాటంగా ఉండేవారు. ధ‌న‌వంతులైన హీరోల‌ను ప‌క్క‌న‌బెడితే? త‌మ‌ వద్ద డబ్బు లేదనే విషయం బయటపడితే? ప్రేక్షకులు చిన్నచూపు చూస్తారనే భయంతో కొంత మంది నటులు అసలు నేపథ్యాన్ని దాచిపెట్టేవారు. విలాసవంతమైన జీవనశైలిని ప్రదర్శిస్తూ నిజ జీవితాన్ని తెరమరుగు చేసేవారు. కానీ కాలం మారుతున్న కొద్దీ ప్రేక్షకుల ఆలోచనా విధానంలో పెను మార్పు వచ్చింది. నేటి ఆడియన్స్ కేవలం ఆడంబరాలను చూసి కాదు తెరపై కనిపించే నటుడి నిజాయితీని, వారి కష్టాన్ని బేరీజు వేసుకుని ఆదరిస్తున్నారు.

ప్రస్తుత యువ హీరోలు తమ ఎదుగుదల వెనుక ఉన్న కష్టాన్ని, పడిన ఇబ్బందులను ఏమాత్రం దాచకుండా చాలా ఓపెన్‌గా పంచుకుంటున్నారు. ఇండస్ట్రీకి రాకముందు తాము పడిన ఆర్థిక ఇబ్బందులు, ఆడిషన్స్‌లో ఎదుర్కొన్న అవమానాలు, రైల్వే స్టేషన్లలో గడిపిన రాత్రుల గురించి వేదికలపై నిర్మొహమాటంగా చెబుతున్నారు. తమ గతాన్ని గర్వంగా పంచుకుంటూ నేల విడిచి సాము చేయకుండా ఉంటున్నారు. ఈ తరహా పారదర్శకతే నేటితరం ప్రేక్షకులకు, యువ నటులకు మధ్య బలమైన మానసిక అనుబంధాన్ని ఏర్పరుస్తోంది.

ప్రేక్షకులు కూడా ఈ నిజాయితీని ఎంతో అభినందిస్తున్నారు. `మా లాంటి సామాన్య కుటుంబం నుంచే వచ్చాడు, చాలా కష్టపడి పైకి వచ్చాడు` అనే కన్స్రెన్ ఆడియన్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ఒక నటుడి విజయం వెనుక ఉన్న స్వెట్ అండ్ స్ట్రగుల్ తెలిసినప్పుడు ప్రేక్షకులు ఆ హీరోను కేవలం అభిమాన నటుడిగా మాత్రమే కాకుండా తమలో ఒకడిగా భావిస్తారు. ఆ కష్టాన్ని గుర్తించి సినిమాలను విజయవంతం చేస్తూ వాళ్ల వెన్నంటి నిలుస్తున్నారు.

ఈ మార్పు రావడానికి సోషల్ మీడియా రాక .. ఇంటర్వ్యూల కల్చర్ కూడా ముఖ్య కారణం. సోషల్ మీడియా ద్వారా హీరోలు తమ అభిమానులతో నేరుగా కనెక్ట్ అవుతున్నారు. పీఆర్ బేస్డ్ ఇమేజ్ కంటే రా అండ్ రియల్ క్యారెక్టర్‌కే నేటి యువత కనెక్ట్ అవుతోంది. తమ లోపాలను, వైఫల్యాలను ఒప్పుకోవడానికి వాటిని అధిగమించిన తీరును వివరించడానికి యంగ్ హీరోలు ఏమాత్రం వెనుకాడటం లేదు. ఈ స్వచ్ఛత ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

డబ్బు, పలుకుబడి కంటే ప్రయాణంలో ఎదురైన అనుభవాలే వ్యక్తి అసలైన బలాన్ని ఇస్తాయని నేటి హీరోలు నిరూపిస్తున్నారు. ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా వచ్చి టాలెంట్, హార్డ్‌వర్క్‌తో ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న నటులకు ప్రేక్షకులు గుండెల్లో స్థానం ఇస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్ లేకపోవడాన్ని బలహీనతలా కాకుండా తమ విజయానికి తొలి మెట్టుగా మలుచుకుంటున్న తీరు యువతలో స్పూర్తినింపుతుంది.

అంతిమంగా ఇండస్ట్రీలో ఆర్భాటాలకు కాలం చెల్లింది. వెండి తెరపై ఎంత బాగా నటించారనేదానితో పాటు వాస్త‌వ జీవితంలో ఎంత నిజాయితీగా ఉన్నారనేదే ? నటుల భవిష్యత్తును నిర్ణయిస్తోంది. కష్టపడి ఎదిగిన ప్రతి ఒక్కరినీ ప్రేక్ష‌కులు గుండెల్లో పెట్టుకుని మరీ మోస్తున్నారు. ఈ ట్రెండ్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తోంది. నిజమైన ప్రతిభకు పట్టం కడుతోందన్న‌ది కాద‌న‌లేని నిజం.