టాలీవుడ్ హీరోల కొత్త గేమ్ ప్లాన్ ఇదే!
ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ లాంటి ప్లాట్‌ఫార్మ్‌లు వచ్చిన తర్వాత కంటెంట్ వినియోగం మాత్రమే కాదు, స్టార్‌ల కెరీర్ స్ట్రాటజీ కూడా పూర్తిగా మారిపోయింది.
By: Sravani Lakshmi Srungarapu | 20 March 2026 3:00 PM ISTటాలీవుడ్‌లో హీరోల కెరీర్ మార్గం ఇప్పుడు ఒక పెద్ద మార్పు దశలోకి ప్రవేశించింది. ఒకప్పుడు సినిమాలకే పరిమితమయ్యే స్టార్‌లు, ఇప్పుడు ఓటిటి, టీవీ, డిజిటల్ ప్లాట్‌ఫాంలను సమాంతరంగా వినియోగించుకుంటూ తమ ప్రస్థానాన్ని విస్తరించుకుంటున్నారు. ఈ మార్పుకు ప్రధాన కారణంగా నిలిచింది ఓటీటీ విప్లవం అనే చెప్పాలి. ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ లాంటి ప్లాట్‌ఫార్మ్‌లు వచ్చిన తర్వాత కంటెంట్ వినియోగం మాత్రమే కాదు, స్టార్‌ల కెరీర్ స్ట్రాటజీ కూడా పూర్తిగా మారిపోయింది.
ది ట్రయేటర్స్ సౌత్ వెర్షన్ కు హోస్ట్ గా తేజ సజ్జ
ఇప్పటి పరిస్థితుల్లో యూత్ హీరోలు ఒకే మీడియంపై ఆధారపడకుండా మల్టీ ప్లాట్‌ఫామ్ ప్రెజెన్స్‌ను నిర్మించుకోవడం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల తేజ సజ్జ ప్రముఖ రియాలిటీ షో ది ట్రయేటర్స్ సౌత్ వెర్షన్‌కు హోస్ట్‌గా ఎంపిక కావడం దీనికి తాజా ఉదాహరణ. ఇదే సమయంలో కిరణ్ అబ్బవరం కూడా వెబ్ సిరీస్‌ల వైపు అడుగులు వేస్తుండగా, అక్కినేని హీరో నాగ చైతన్య ఇప్పటికే దూత అనే వెబ్ సిరీస్‌తో డిజిటల్ ప్రపంచంలో తన ముద్ర వేసి, నెక్ట్స్ సీజన్ కు రెడీ అవుతున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే, టాలీవుడ్ యంగ్ జనరేషన్ హీరోలు స్పష్టమైన ప్లానింగ్‌తో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.
ఒక సినిమాకే ఎంతో టైమ్
ఇది కేవలం ట్రెండ్ ఫాలో అవ్వడమే కాదు, స్మార్ట్ కెరీర్ మేనేజ్‌మెంట్ కూడా. ఒకప్పుడంటే హీరోలు ఏడాదికి ఎన్నో సినిమాలు మార్కెట్‌ను కవర్ చేసేవారు. కానీ ప్రస్తుతం ఒక సినిమా తీయడానికే ఎక్కువ సమయం పడుతుండటంతో, ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలకే పరిమితమవుతున్నారు. ఈ గ్యాప్‌ను ఫిల్ చేయడానికి ఓటీటీ, టీవీ షోలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ఆదాయ పరంగా కూడా మేలే!
ఇక ఆదాయం, ఇమేజ్ పరంగా చూసుకున్నా కూడా ఈ మార్పు హీరోలకు డబుల్ బెనిఫిట్ ఇస్తోంది. ఒకవైపు సినిమాల ద్వారా వచ్చే ఆదాయానికి తోడు, రియాలిటీ షోలు, వెబ్ సిరీస్‌లు, టాక్ షోల ద్వారా అదనపు రెవెన్యూ స్ట్రీమ్స్ ఏర్పడుతున్నాయి. మరోవైపు, ప్రేక్షకులతో మరింత దగ్గరగా కనెక్ట్ అవ్వడానికి వీలు కలుగుతోంది. ముఖ్యంగా టీవీ మరియు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో కనిపించడం వల్ల స్టార్‌లకు రీచ్ పెరుగుతుంది. తద్వారా వారి బ్రాండ్ వ్యాల్యూను ఇది మరింత బలపరుస్తోంది.
మొత్తానికి, టాలీవుడ్ యూత్ హీరోలు తీసుకుంటున్న ఈ మల్టీ ప్లాట్‌ఫామ్ దిశ ఒక తాత్కాలిక ట్రెండ్ కాదు. ఇది ఇండస్ట్రీలో రూపుదిద్దుకుంటున్న కొత్త నార్మల్‌గా చెప్పాలి. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మంది హీరోలు ఈ దారిని ఎంచుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సినిమాతో పాటు డిజిటల్ ప్రెజెన్స్‌ను బలోపేతం చేసుకోవడమే ఇప్పుడు సక్సెస్‌ఫుల్ హీరోల కొత్త మంత్రంగా మారుతోంది.
