పాన్ ఇండియా కాదు గ్లోబల్ మార్కెట్ టార్గెట్.. ఆస్కార్ దిశగా అడుగులు!
ఆ సినిమా భారీ కలెక్షన్స్ వసూలు చేయడమే కాకుండా ఆ హీరోలకి పాన్ ఇండియా మార్కెట్ అందించడంతో చాలామంది ఇప్పటికీ అదే దిశగా అడుగులు వేస్తున్నారు.
By: Madhu Reddy | 5 Sept 2025 12:00 PM ISTఒకప్పుడు ప్రాంతీయంగా సినిమాలు విడుదల చేస్తూ.. ప్రాంతీయ భాషలలో స్టార్స్ గా, సూపర్ స్టార్స్ గా చలామణి అయిన ఎంతోమంది హీరోలు.. ఆ తర్వాత రాజమౌళి పుణ్యమా అని పాన్ ఇండియా హీరోలుగా మారే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రాజమౌళి తన తొలి ప్రయత్నంలో రాణా, ప్రభాస్ వంటి బడా హీరోలతో మల్టీస్టారర్ 'బాహుబలి' మూవీని నిర్మించి.. తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించారు. అంతేకాదు ఆ సినిమాను ఇండియా వైడ్ భాషలలో రిలీజ్ చేసి పాన్ ఇండియా హీరోలుగా తీర్చిదిద్దారు. ఆ సినిమా భారీ కలెక్షన్స్ వసూలు చేయడమే కాకుండా ఆ హీరోలకి పాన్ ఇండియా మార్కెట్ అందించడంతో చాలామంది ఇప్పటికీ అదే దిశగా అడుగులు వేస్తున్నారు.
ఇప్పుడు అదే రాజమౌళి పుణ్యమా అని హీరోలు.. పాన్ ఇండియా కాదు గ్లోబల్ స్టార్ గా మారాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే రాజమౌళి ఎన్టీఆర్ , రామ్ చరణ్ లతో 'ఆర్ఆర్ఆర్' సినిమా చేసి.. ఏకంగా ఆస్కార్ వేదికపై సినిమాను నిలబెట్టారు.అందులో భాగంగానే మిగిలిన దర్శకులు కూడా తామేమి ఇందుకు అతీతం కాదు అని తమ సినిమాలను గ్లోబల్ మార్కెట్లో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన టెక్నీషియన్స్ రంగంలోకి దింపి.. మార్కెట్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఇప్పుడు ప్రత్యేకించి నలుగురు టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా కాదు ఏకంగా గ్లోబల్ మార్కెట్ టార్గెట్ అంటూ ఆస్కార్ అందుకునే దిశగా అడుగులు వేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. మరి ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
ఎస్ఎస్ఎంబి 29: మహేష్ బాబు - రాజమౌళి
బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి.. మహేష్ బాబుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఎస్ఎస్ఎంబి 29. ప్రస్తుతం ఈ వర్కింగ్ టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రం ఈస్ట్ కెన్యాలోని ముసాయిమారా, అంబోసెలి ప్రాంతాలలో చిత్రీకరణ జరుపుకుంటోంది. దాదాపు రూ.1200 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో.. రెండు భాగాలుగా ఈ చిత్రం విడుదల కాబోతోంది. మొత్తం 120 కి పైగా దేశాలలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. పైగా బాక్సాఫీస్ రికార్డులను మాత్రమే కాదు ప్రపంచ దృష్టిని ఆకర్షించడం తో పాటూ ఆస్కార్ లక్ష్యంగా ముందడుగు వేస్తున్నారు.
AA22xA6: అల్లు అర్జున్ - అట్లీ
అల్లు అర్జున్ హీరోగా , అట్లీ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం AA22xA6. ఈ చిత్రానికి అవతార్ వంటి హాలీవుడ్ చిత్రాలకు వీఎఫ్ఎక్స్ అందించిన కంపెనీలతో సినిమాని రూపొందిస్తున్నారు. ప్రపంచ సాంకేతిక నిపుణుల నేతృత్వంలో విస్తృత ఆకర్షణ కోసం నిర్మించిన కథగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ఖచ్చితంగా తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెడుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
స్పిరిట్: ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా
అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న సందీప్ రెడ్డి.. ప్రభాస్ తో కలిసి స్పిరిట్ సినిమా చేస్తున్నారు. యాక్షన్ కి పేరుగాంచిన ఈ చిత్రంలో భారతీయ సినిమాలలో అరుదుగా కనిపించే అతీంద్రియ అంశాల గురించి కూడా చర్చించబోతున్నారట. ముఖ్యంగా ఈ సినిమా ప్రభాస్ ను ప్రపంచస్థాయి నటుడిగా మారుస్తుందని పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
డ్రాగన్: ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్
కేజీఎఫ్ చిత్రాలతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ .. గ్లోబల్ ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్ తో డ్రాగన్ సినిమా చేస్తున్నారు ఈ చిత్రాన్ని కూడా పాన్ వరల్డ్ యాక్షన్ చిత్రంగా రూపొందించబోతున్నారు.
ఈ నాలుగు ప్రాజెక్టులు కూడా భారీ బడ్జెట్ చిత్రాలు మాత్రమే కాదు తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టడానికి వ్యూహాత్మక ఎత్తుగడలను వేస్తున్నాయని చెప్పాలి. పురాణాలు, యాక్షన్, థ్రిల్లర్ , క్రాస్ కల్చరల్ కథలు అయినప్పటికీ అన్నీ కూడా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని ఆస్కార్ దిశగా అడుగులు వేయబోతున్నాయి. మరి ఈ నాలుగు ప్రాజెక్ట్ లలో ఏ సినిమా టాలీవుడ్ ఖ్యాతిని అంతర్జాతీయంగా నిలబెడుతుందో చూడాలి.
