కొత్త కాన్సెప్ట్‌లతో వస్తున్న యంగ్ హీరోలు!
స్టార్‌డమ్ ... ఒకే తరహా ఇమేజ్ మీదనే ఆధారపడకుండా కథాంశాల పరంగా సరికొత్త ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులకు భిన్నమైన థియేట్రికల్ అనుభూతిని అందించడానికి సిద్ధమవుతున్నారు.
By: Srikanth Kontham | 16 Jun 2026 5:00 AM ISTప్రస్తుతం టాలీవుడ్ లో మునుపెన్నడూ లేనంత పోటీ నెలకొంది. పాత చింతకాయ పచ్చడి లాంటి రొటీన్ కమర్షియల్ ఫార్ములా కథలను ప్రేక్షకులు తిరస్కరిస్తుండటంతో ఇండస్ట్రీలో ఉనికిని చాటుకోవడానికి హీరోలు సరికొత్త పంథాను ఎంచుకుంటున్నారు. స్టార్‌డమ్ ... ఒకే తరహా ఇమేజ్ మీదనే ఆధారపడకుండా కథాంశాల పరంగా సరికొత్త ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులకు భిన్నమైన థియేట్రికల్ అనుభూతిని అందించడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు కథానాయకులు వినూత్నమైన జోనర్లను ఎంచుకుంటూ ట్రేడ్‌లో హాట్ టాపిక్‌గా మారారు.
ట్యాలెంటెడ్ నటుడు సత్యదేవ్ వైవిధ్యమైన పాత్రలతో ఎప్పటికప్పుడు ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన వెంకటేష్ మహా దర్శకత్వంలో `రావు బహదూర్` అనే చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ కు చెందిన ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తుండటం విశేషం. ఇండస్ట్రీ వర్గాల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ వినూత్న చిత్రం జూలై 3న థియేటర్లలో విడుదల కానుంది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ టాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయోగాలతో దూసుకు పోతున్నారు. నటనకే పరిమితం కాకుండా.. కథల ఎంపికలోనూ, మేకింగ్‌లోనూ రిస్క్ తీసుకోవడానికి ఆయన వెనకాడరు.
ఈ క్రమంలోనే విశ్వక్ స్వీయా దర్శకత్వంలో `కల్ట్` అనే సరికొత్త సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనితో పాటు పూర్తి రాజకీయ నేపథ్యంతో నడిచే `లెగసీ` అనే మరో ఆసక్తికరమైన చిత్రంలోనూ నటిస్తున్నారు. యాక్షన్ హీరోగా తనదైన ముద్ర వేసిన గోపీచంద్ సైతం ఈసారి రెగ్యులర్ కమర్షియల్ జోనర్ నుండి బయటకు వచ్చి భారీ చారిత్రక ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. జాతీయ అవార్డు గ్రహీత, `ఘాజీ` ఫేమ్ సంకల్ప రెడ్డి దర్శకత్వంలో 'భరతవర్ష' అనే పీరియాడిక్ చిత్రంలో నటిస్తున్నారు. 7వ శతాబ్దపు నాటి చారిత్రక కథాంశంతో రూపుదిట్టుకుంటున్న ఈ సినిమా గోపీచంద్ కెరీర్‌లోనే అత్యంత విభిన్నమైన ..ప్రతిష్టాత్మక చిత్రంగా తెరకెక్కుతోంది.
యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సిద్ధు జొన్నలగడ్డ కూడా సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` వంటి సూపర్ హిట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ను అందించిన దర్శకుడు స్వరూప్ ఆర్‌జె కాంబినేషన్‌లో సిద్ధు ఓ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నారు. విభిన్నమైన డిటెక్టివ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రం సిద్ధు మార్కు వినోదంతో పాటు ఉత్కంఠభరితమైన కథాంశంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.
మునుపటితో పోలిస్తే టాలీవుడ్ హీరోల ఆలోచనా విధానంలో వస్తున్న ఈ మార్పు పరిశ్రమ ఎదుగుదలకు ఎంతో శుభపరిణామం. రొటీన్ మాస్ మసాలా చిత్రాల కంటే కంటెంట్ ఉన్న సినిమాలకే ప్రేక్షకులు పట్టం కడుతున్న తరుణంలో సత్యదేవ్, విశ్వక్సేన్, గోపీచంద్, సిద్ధు జొన్నలగడ్డ వంటి హీరోలు విభిన్నమైన కాన్సెప్ట్‌లను ఎంచుకుంటూ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రశంసనీయం. ఈ సరికొత్త చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాలను నమోదు చేస్తాయో చూడాలి.
