హిట్టు కొట్టినా ఖాళీనే.. టాలీవుడ్ డైరెక్టర్ల 'హీరో' కష్టాలు!
సాధారణంగా టాలీవుడ్‌లో హీరోయిన్ల కొరత గురించి చర్చ జరుగుతుంటుంది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.
By: Garuda Media | 14 April 2026 6:00 AM ISTసాధారణంగా టాలీవుడ్‌లో హీరోయిన్ల కొరత గురించి చర్చ జరుగుతుంటుంది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. టాలీవుడ్‌ను మునుపెన్నడూ లేని విధంగా హీరోల కొరత వేధిస్తోంది. చేతిలో హిట్లు ఉన్నా, అగ్ర నిర్మాణ సంస్థలు అడ్వాన్సులు ఇచ్చినా.. కెమెరా ముందుకు తీసుకెళ్లడానికి హీరోలు దొరక్క అగ్ర దర్శకులు సైతం వెయిటింగ్ లిస్టులో పడిపోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం టాలీవుడ్ టైర్-1 నుండి టైర్-3 వరకు ప్రతి హీరో కనీసం రెండు మూడేళ్ల వరకు బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా ప్రాజెక్టులు, భారీ బడ్జెట్ సినిమాలు కావడంతో ఒక్కో సినిమాకు ఏళ్ల కాలం పడుతోంది. దీంతో బోయపాటి శ్రీను లాంటి మాస్ డైరెక్టర్లు కూడా అన్వేషణలో పడ్డారు. 'అఖండ 2' తర్వాత ఆయనకు కావాల్సిన భారీ కటౌట్ దొరకక బాలీవుడ్ హీరోల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. రణబీర్ సింగ్ పేరు వినిపిస్తున్నా, ఏదీ ఇంకా పట్టాలెక్కలేదు.
సక్సెస్ ఉన్నా తప్పని నిరీక్షణ
ఇక 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం కావడంతో, మరో సినిమా చేద్దామనుకున్న హరీష్ శంకర్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. నిర్మాతలు రెడీగా ఉన్నా, ఆయన రాసుకున్న కథకు సరిపడా హీరోలు అందుబాటులో లేరు. అటు కొరటాల శివ పరిస్థితి మరింత గందరగోళంగా ఉంది. 'దేవర 2' కోసం ఎదురుచూడాలా లేక ఈ గ్యాప్‌లో మరో సినిమా చేయాలా అనే సందిగ్ధంలో ఆయన ఉన్నారు. స్టార్ హీరోలందరూ లాక్ అయిపోవడంతో ఆయనకు ఆప్షన్లు కనిపించడం లేదు.
మరోవైపు, ఒక్క పరాజయం దర్శకుల మార్కెట్‌ను ఎంత దెబ్బతీస్తుందో మారుతి, పరశురామ్ వంటి వారిని చూస్తే అర్థమవుతోంది. 'రాజాసాబ్' ఫలితం తర్వాత మారుతితో సినిమా చేసేందుకు యంగ్ హీరోలు కూడా ఆలోచనలో పడ్డారు. అటు పరశురామ్ 'ఫ్యామిలీ స్టార్' తర్వాత దిల్ రాజు బ్యానర్‌లో సినిమా చేయాల్సి ఉన్నా, హీరో ఎవరనేది ఇప్పటికీ సస్పెన్సే. కనీసం ఇతర భాషల హీరోలనైనా దిగుమతి చేసుకుందామంటే అక్కడ కూడా కాల్షీట్లు ఖాళీ లేవు.
కేవలం అగ్ర దర్శకులే కాదు.. సుధీర్ వర్మ, అసిత్ గోళీ, కిషోర్ తిరుమల వంటి టాలెంటెడ్ డైరెక్టర్లు కూడా కథలతో సిద్ధంగా ఉన్నారు. కానీ హీరోల డేట్లు దొరకడమే ఇప్పుడున్న అతిపెద్ద సవాలు. హీరోలు చేసే ప్రయోగాలు, మారుతున్న మార్కెట్ సమీకరణాల వల్ల దర్శకులు తమ కథలకు తగ్గ హీరో కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఈ హీరోల కొరత మరికొన్నాళ్లు కొనసాగితే, టాలీవుడ్ నుండి ఇతర భాషా హీరోల చిత్రాలు మరిన్ని వచ్చే అవకాశం కనిపిస్తోంది.
