Begin typing your search above and press return to search.

కథ, ప్లాన్, ప్రమోషన్స్.. శేష్, నవీన్, సిద్ధు లెక్కే వేరు!

కథ, స్క్రీన్‌ ప్లే, పాత్రల డిజైన్, డైలాగ్స్ సహా అన్నింటిలోనూ హీరోల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందన్న మాట ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

By:  M Prashanth   |   22 Jan 2026 1:53 PM IST
కథ, ప్లాన్, ప్రమోషన్స్.. శేష్, నవీన్, సిద్ధు లెక్కే వేరు!
X

టాలీవుడ్‌ లో కథల ఎంపిక నుంచి స్క్రిప్ట్ తయారీ వరకు, షూటింగ్ నుంచి ప్రమోషన్స్ వరకు.. సినిమా మొత్తం మీద పూర్తి పట్టు సాధించే హీరోలు పెరుగుతున్నారని చర్చ జరుగుతోంది. ఆ కోవలో ముందుగా గుర్తొచ్చే పేర్లు అడివి శేష్, నవీన్ పోలిశెట్టి, సిద్దు జొన్నలగడ్డ. వారు నటించిన పలు సినిమాలు ఇప్పటికే హిట్స్ గా నిలవగా, వాటిని మొత్తం హీరోలు ముందుండి నడిపించినట్లు కనిపిస్తుంది.

కథ, స్క్రీన్‌ ప్లే, పాత్రల డిజైన్, డైలాగ్స్ సహా అన్నింటిలోనూ హీరోల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందన్న మాట ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అంతే కాదు అడవి శేష్, నవీన్ పోలిశెట్టి, సిద్దు జొన్నలగడ్డ కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. తమకు నచ్చిన కథలను మాత్రమే ఎంపిక చేసుకుంటారు. కేవలం హీరోగా నటించడం మాత్రమే కాదు. స్క్రిప్ట్ తయారీలోనూ దగ్గరుండి పని చేస్తారు.

రచయితలతో కలిసి కూర్చొని సన్నివేశాలు మార్చడం, డైలాగ్స్ మెరుగుపరచడం, కథకు కొత్త టచ్ ఇవ్వడం… ఇలా ఫైనల్ స్క్రిప్ట్ వరకు తమ వంతు పాత్ర పోషిస్తారని వినికిడి. అంతే కాదు మేకింగ్ సమయంలో కూడా అడుగు అడుగునా పర్యవేక్షణ చేస్తారని టాక్. సీన్ ఎలా రావాలి, ఎడిట్ ఎలా ఉండాలి, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ ఎలా వినిపించాలి… అన్న విషయాల్లో కూడా సూచనలు ఇస్తుంటారట.

అందుకే వీళ్ల సినిమాలు హీరో సెంట్రిక్ గా కనిపిస్తాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఆ ముగ్గురు హీరోల మధ్య ప్రధాన తేడా.. నిర్మాతలతో వ్యవహరించే విధానంలోనే కనిపిస్తోందని తెలుస్తోంది. అడవి శేష్ నిర్మాతలకు చాలా ఫ్రెండ్లీగా ఉంటారని టాలీవుడ్‌ లో పేరు. బడ్జెట్ కంట్రోల్, ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అవసరమైతే మార్పులకు ఓపెన్‌ గా ఉంటారట.

సిద్దు జొన్నలగడ్డ నిర్మాణ వ్యవహారాల్లో పెద్దగా జోక్యం చేసుకోరని వినికిడి. బడ్జెట్, ఖర్చులు అన్నీ నిర్మాతలకే వదిలేస్తారు. కానీ సినిమా క్వాలిటీ విషయంలో మాత్రం రాజీ పడరట. నవీన్ పోలిశెట్టి వ్యవహారం మాత్రం కాస్త భిన్నం. నిర్మాణ వ్యయం ఎంతైనా సరే… కథ, స్క్రిప్ట్, మేకింగ్ విషయంలో తాను అనుకున్నదే జరగాలన్న దృఢమైన నిర్ణయంతో ఉంటారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.

ఇక ప్రమోషన్స్ విషయంలో అడవి శేష్, నవీన్ పోలిశెట్టి మరో అడుగు ముందుకేస్తారు. సినిమా షూటింగ్‌ తో ఆగిపోకుండా, ప్రమోషన్స్ పై పూర్తి దృష్టి పెడతారు. ట్రైలర్ రిలీజ్, ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా ప్రమోషన్స్ అన్నింటికీ ముందే ప్లాన్ తయారు చేసుకుంటారు. సిద్ధు మాత్రం కొంచెం భిన్నంగా ఉండి ప్రమోషన్స్ బాధ్యతను ఎక్కువగా టీమ్‌ కే వదిలేస్తారు. క్వాలిటీ చెక్ వరకు మాత్రమే పరిమితమవుతారు. ఏదేమైనా టాలీవుడ్ ఇండస్ట్రీలో నవీన్, సిద్ధు, శేష్ లెక్కే వేరు అని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.