Begin typing your search above and press return to search.

మూవీ సెట్స్ లో టిఫిన్ మెనూ తగ్గుతుందా? కారణమేంటి?

మిడిల్ ఈస్ట్‌ లో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావం.. టాలీవుడ్ ఇండస్ట్రీలోని షూటింగ్ సెట్లపై కూడా పడుతుందన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

By:  M Prashanth   |   11 March 2026 5:25 PM IST
మూవీ సెట్స్ లో టిఫిన్ మెనూ తగ్గుతుందా? కారణమేంటి?
X

మిడిల్ ఈస్ట్‌ లో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావం.. టాలీవుడ్ ఇండస్ట్రీలోని షూటింగ్ సెట్లపై కూడా పడుతుందన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా షూటింగ్ స్పాట్లలో అందించే మార్నింగ్ టిఫిన్స్ విషయంలో మార్పులు వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

సాధారణంగా సినిమా షూటింగ్స్ లో పనిచేసే సిబ్బంది ఉదయాన్నే సెట్లకు చేరుకుంటారు. లైట్‌ మ్యాన్స్, సెట్ బాయ్స్, స్పాట్ బాయ్స్, జూనియర్ ఆర్టిస్టులు, అసిస్టెంట్ డైరెక్టర్లు, టెక్నీషియన్లు, నటులు, దర్శకులు, నిర్మాతలు సహా చాలా మంది ఉదయం 7-8 గంటల మధ్యలో స్పాట్ కు వస్తుంటారు. అలా త్వరగా రావడానికి వర్క్స్ తోపాటు షూటింగ్ స్పాట్లలో బ్రేక్‌ ఫాస్ట్ కారణమని టాక్.

తెలుగు సినిమా షూటింగ్స్ లో బ్రేక్ ఫాస్ట్ విషయంలో మంచి ఏర్పాట్లు ఉండటం కామన్. చాలా చోట్ల పెద్ద మెనూతో బ్రేక్‌ ఫాస్ట్ అందిస్తారు. అందులో ఇడ్లీలు, సెట్ దోసెలు, ఉతప్పం, మైసూర్ బోండా, పెసరట్టు- ఉప్మా, సాంబార్‌ ఇడ్లీలు, వడలు సహా అనేక వంటకాలు ఉంటాయి. ఒక్కోసారి 6-8 రకాలు అందుబాటులో ఉంటాయి. దీంతో సెట్లో ఉన్న సిబ్బంది చాలా మంది ఒకేసారి మూడు నాలుగు రకాల వంటకాలు తింటూ రోజును స్టార్ట్ చేస్తారు.

ఆ ఏర్పాట్లను ఫుడ్ సప్లై కాంట్రాక్టర్లు నిర్వహిస్తుంటారు. పెద్ద యూనిట్లలో అయితే రోజూ వందల మందికి బ్రేక్‌ ఫాస్ట్ సిద్ధం చేయాల్సి వస్తుంది. అందుకే భారీగా గ్యాస్ సిలిండర్లు ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే మిడిల్ ఈస్ట్ లో యుద్ధ పరిస్థితులు ఏర్పడటంతో గ్యాస్ సరఫరాపై ప్రభావం పడుతుందని టాక్ వినిపిస్తోంది. దీంతో ఎల్పీజీ సిలిండర్ల కొరత ఏర్పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

కొన్నిచోట్ల ఇప్పటికే గ్యాస్ ధరలు పెరిగినట్లు సమాచారం. దీంతో ఫుడ్ కాంట్రాక్టర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. అవసరమైన గ్యాస్ అందుబాటులో లేకపోతే బ్లాక్ మార్కెట్‌ లో కొనాల్సిన పరిస్థితి వస్తుందని సమాచారం. కానీ ఆ విధంగా కొనడం ఖర్చుతో కూడుకున్నది. దీంతో సెట్లలో అందించే బ్రేక్‌ ఫాస్ట్ మెనూ తగ్గించే ఆలోచనలో కొంతమంది ఫుడ్ కాంట్రాక్టర్లు ఉన్నట్లు టాక్.

ఇప్పటివరకు ఉన్నట్లు అనేక రకాల వంటకాలు తయారు చేయడం కష్టమవుతుందని, గ్యాస్ వినియోగం తగ్గించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నట్లు సమాచారం. అందువల్ల కొన్ని చోట్ల రెండు లేదా మూడు రకాల ఐటెమ్స్ కే పరిమితం చేసే అవకాశం ఉందని వినికిడి. అయితే ఆ పరిస్థితి ఎంత కాలం పాటు కొనసాగుతుందో ఇంకా క్లారిటీ లేదు. గ్యాస్ సప్లై మళ్లీ మామూలు స్థితికి వస్తే పాత రోజులలాగే బ్రేక్‌ ఫాస్ట్ ఏర్పాట్లు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం సెట్స్ లో బ్రేక్ ఫాస్ట్ మెనూలో కొన్ని మార్పులు రావడం తప్పదేమో.