ఈవెంట్లకే రూ.కోట్లలో ఖర్చవుతుందా? ఇలా అయితే కష్టమేనా?
టాలీవుడ్ లో సినిమా ప్రమోషన్ల ఖర్చులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి.
By: M Prashanth | 12 April 2026 5:00 AM ISTటాలీవుడ్ లో సినిమా ప్రమోషన్ల ఖర్చులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఫైవ్ స్టార్ హోటళ్లలో నిర్వహించే ఈవెంట్లు నిర్మాతలపై గట్టి భారం మోపుతున్నాయి. ఒకప్పుడు సినిమా సక్సెస్ మీట్లు, ప్రెస్ మీట్లు సాధారణంగా ప్రసాద్ ల్యాబ్స్ వంటి ప్రదేశాల్లో సాదాసీదాగా నిర్వహించేవారు. అప్పుడు మొత్తం ఖర్చు రూ.75 వేల నుంచి రూ.1 లక్ష మధ్యలో ఉండేది.
ప్రసాద్ ల్యాబ్స్ లో రెండు గంటల కార్యక్రమానికి రూ.25- 35 వేల వరకు మాత్రమే చార్జీలు ఉండేవి. మిగతా ఖర్చులు డెకరేషన్, యాంకర్ రెమ్యునరేషన్, చిన్నపాటి ఏర్పాట్లతో పరిమితమయ్యేవి. దీంతో నిర్మాతలకు ఆర్థిక భారం తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం పెద్ద ఎత్తున ఈవెంట్లు నిర్వహించాలంటే ఎక్కువగా ఫైవ్‌స్టార్ హోటళ్లను ఆశ్రయిస్తున్నారు.
పార్క్ హయత్ హైదరాబాద్ వంటి స్టార్ హోటళ్లలో జరిగే కార్యక్రమాలకు భారీ ఖర్చు అవుతోంది. ఒకే ఒక్క ఈవెంట్ నిర్వహించడానికి సుమారు రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు ఖర్చు అవుతోంది.ఆ ఖర్చులో అద్దె, సౌండ్, లైటింగ్, స్టేజ్ డెకరేషన్, సీటింగ్ ఏర్పాటు, యాంకర్, ఇతర ప్రదర్శనల కోసం చెల్లింపులు, అలాగే అతిథుల కోసం వందమంది వరకు ఫుడ్ ఖర్చులు కూడా ఉంటాయి.
దీంతో ఒక ఈవెంట్ కే లక్షల్లో ఖర్చు అవుతోంది. అంతేకాదు, ఇప్పుడు సినిమా విడుదలకు ముందు 3 నుంచి 4 ప్రెస్ మీట్లు, విడుదల తర్వాత 3 నుంచి 4 విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం సాధారణంగా మారింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సినిమా ఫలితం ఎలా ఉన్నా హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఈవెంట్లను మాత్రం భారీ స్థాయిలోనే చేస్తున్నారు.
అలా మొత్తం ఈవెంట్ల ఖర్చు కలిపి రూ.75 లక్షల నుంచి రూ.1 కోటి వరకు చేరుతోంది. చిన్న, మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలకు ఇది పెద్ద భారంగా మారుతోంది. ముఖ్యంగా రూ.5 కోట్లు నుంచి 10 కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమాలకు ఖర్చులు మరింత భారంగా మారుతున్నాయి. ఇక థియేటర్లలో కూడా ఈవెంట్లు నిర్వహిస్తే ఖర్చులు తగ్గడం లేదు. అక్కడ కూడా సౌండ్, లైటింగ్, ఇతర ఏర్పాట్ల కారణంగా భారీ మొత్తాలు వెచ్చించాల్సి వస్తోంది.
దీంతో నిర్మాతలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈవెంట్లు అవసరం అయినప్పటికీ, ఖర్చులను నియంత్రించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా చిన్న సినిమాల నిర్మాతలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో, తక్కువ ఖర్చుతో ప్రమోషన్లు చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. ఏదేమైనా ఫైవ్ స్టార్ ఈవెంట్ల ట్రెండ్ నిర్మాతలపై అదనపు భారం మోపుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే చిన్న బడ్జెట్ సినిమాల నిర్మాణంపై ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పాలి.
