ఈ వేసవికి చెమటలే.. మన హీరోలు ఎవరెక్కడున్నారో తెలుసా?
ఈ వేసవి అంతకంతకు వేడెక్కుతోంది. భానుడి ప్రతాపం 42 డిగ్రీల నుంచి 50డిగ్రీల సెల్సియస్ కి చేరుకుంటుందని భయపెడుతున్నారు.
By: Sivaji Kontham | 10 May 2026 11:24 AM ISTఈ వేసవి అంతకంతకు వేడెక్కుతోంది. భానుడి ప్రతాపం 42 డిగ్రీల నుంచి 50డిగ్రీల సెల్సియస్ కి చేరుకుంటుందని భయపెడుతున్నారు. ఇలాంటి మండు వేసవిలో మన హీరోలంతా భయపడి ఏసీ గదుల్లో దాక్కున్నారని భావిస్తే తప్పులో కాలేసినట్టే! అసలు వీరంతా ఏం చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. మన అగ్ర హీరోలు, యువా స్టార్లు మండే ఎండల్ని సైతం లెక్క చేయక షూటింగులతో బిజీబిజీగా ఉన్నారు.
తాజా సమాచారం మేరకు.. టాలీవుడ్ స్టార్ హీరోలంతా ప్రస్తుతం హైదరాబాద్‌లోనే మకాం వేశారు. భారీ బడ్జెట్ చిత్రాల నుండి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ వరకు అన్నీ నగర పరిధిలోనే చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. తాజా షెడ్యూల్స్ ప్రకారం హైదరాబాద్ ని వీడి వెళ్లకుండా షెడ్యూళ్లను ప్లాన్ చేయడం విస్మయపరుస్తోంది. ఏ హీరో ఎక్కడున్నారు? అన్న వివరాల్లోకి వెళితే...
నందమూరి బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న యాక్షన్ డ్రామా ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని `జన్వాడ`లో చిత్రీకరణ జరుపుకుంటోంది. వీరిద్దరి గత చిత్రం `వీరసింహారెడ్డి`భారీ విజయం సాధించడంతో ఈ కాంబో రెండో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా.. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఒక పవర్‌ఫుల్ పీరియాడిక్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలయ్య శైలి మాస్ యాక్షన్, గోపీచంద్ మార్క్ ఎమోషన్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానున్నాయి.
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత విక్టరీ వెంకటేష్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకి `ఆదర్శ కుటుంబం` అనే స్ట్రైకింగ్ టైటిల్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌లో షూటింగ్ జరుగుతోంది. `నువ్వు నాకు నచ్చావ్`, `మల్లీశ్వరి` వంటి క్లాసిక్ సినిమాల తర్వాత ఈ క్రేజీ జోడీ మళ్లీ మ్యాజిక్ రిపీట్ చేయడానికి సిద్ధమైంది. త్రివిక్రమ్ మార్క్ మాటల తూటాలు... వెంకీ కామెడీ టైమింగ్ కలగలిసిన ఒక స్వచ్ఛమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ కథాంశం ఉండబోతోంది. ఇందులో మీనాక్షి చౌదరి ఒక కీలక పాత్రలో నటిస్తుండగా, ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి.
మరో అగ్ర కథానాయకుడు నాగార్జున కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రం `కింగ్ 100` చిత్రీకరణ ప్రస్తుతం గండిపేటలో సాగుతోంది. నవీన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఒక విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్ అని సమాచారం. అదే సమయంలో రాజమౌళి - మహేష్ బాబుల గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ `వారణాసి` కూడా గండిపేట పరిసరాల్లోనే ప్రత్యేకంగా వేసిన సెట్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. రాజమౌళి మార్క్ గ్రాండియారిటీ .. మహేష్ సరికొత్త మేకోవర్ ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని పెంచుతున్నాయి.
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ వార్ డ్రామా `ఫౌజీ` ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ షెడ్యూల్ జరుపుకుంటోంది. రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంతో సాగే ఈ ప్రేమకథ కోసం అక్కడ భారీ సెట్లు వేశారు. అదేవిధంగా ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ చిత్రం కూడా ఆర్‌ఎఫ్‌సీలోనే హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించుకుంటోంది. ఈ రెండు సినిమాలూ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
స్టార్ హీరోలతో పాటు రవితేజ, నాని, గోపీచంద్, శర్వానంద్ చిత్రాలు కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. రవితేజ తన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌తో అలరించడానికి సిద్ధమవుతుండగా, నాని తన తదుపరి వైవిధ్యమైన చిత్రం షూటింగులో సందడి చేస్తున్నారు. గోపీచంద్ , శర్వానంద్‌లు కూడా తమ తాజా ప్రాజెక్టుల షూటింగ్స్‌ను నగరంలోని వివిధ లొకేషన్లలో శరవేగంగా పూర్తి చేస్తున్నారు. మొత్తానికి టాలీవుడ్ షూటింగ్స్‌తో హైదరాబాద్ ఇప్పుడు కళకళలాడుతోంది.
