Begin typing your search above and press return to search.

హీరోయిన్ల నిరీక్షణ సక్సెస్ కోసం ఎదురు చూపులు!

ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ అనేది నటీనటుల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ముఖ్యంగా హీరోయిన్ల కెరీర్ గ్రాఫ్ వారు అందుకునే సక్సెస్‌లపైనే ఆధారపడి ఉంటుంది.

By:  Srikanth Kontham   |   6 May 2026 4:00 AM IST
హీరోయిన్ల నిరీక్షణ సక్సెస్ కోసం ఎదురు చూపులు!
X

ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ అనేది నటీనటుల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ముఖ్యంగా హీరోయిన్ల కెరీర్ గ్రాఫ్ వారు అందుకునే సక్సెస్‌లపైనే ఆధారపడి ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో టాలీవుడ్ లో వరుసగా పెద్ద సినిమాలు వాయిదా పడుతుండటంతో హీరోయిన్ల ఆశలపై నీళ్లు చ‌ల్లిన‌ట్లు అవుతుంది. అనుకున్న సమయానికి సినిమాలు విడుదల కాకపోవడంతో? నెక్స్ట్ లెవెల్ కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటున్న ముద్దుగుమ్మలు నిరీక్షణలో ప‌డిపోతున్నారు.

పాన్ ఇండియాలో గుర్తింపు ద‌క్కించుకున్న‌ కియారా అద్వానీ యష్ సరసన `టాక్సిక్`లో న‌టిస్తోంది. ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకుంది అమ్మ‌డు. ఈ సినిమా షూటింగ్ - రిలీజ్ విషయంలో జ‌రుగుతోన్న‌ జాప్యం అమ్మ‌డిని కొంత ఆందోళనకు గురిచేస్తోంది.

ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో తన క్రేజ్ పెంచుకోవాలని భావించిన కియారాకు ఈ వాయిదాతో మరో భారీ హిట్ అందుకోవడానికి సమయం పట్టేలా కనిపిస్తోంది. ఇలాంటి క్రేజీ ప్రాజెక్టులు ఆలస్యమైనప్పుడు ఇతర సినిమాలకు డేట్లు కేటాయించడం కూడా సవాలుగా మారుతోందిట‌. అలాగే అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అమ‌య్మ‌డు నటించిన `దేవర` మంచి విజయం సాధించినా? ప్రస్తుతం రామ్ చరణ్ సరసన న‌టిస్తోన్న `పెద్ది` సినిమాతో మరో భారీ బ్లాక్ బస్టర్ అందుకోవాల‌ని ఆరాటపడుతోంది.

మార్చిలో రిలీజ్ అవ్వాల్సిన సినిమా జూన్ కి షిప్ట్ అవ్వ‌డంతోకొంత నిరాశ‌కు గురైంది. కానీ ప్రొడ‌క్ట్ పై జాన్వీ చాలా నమ్మకంగా ఉంది. `పెద్ది` విజ‌యంతో ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలని ఎంతో ఆశ‌ప‌డుతోంది. ఈ సినిమా సక్సెస్ అమ్మ‌డికి అత్యంత కీలకమైంది కూడా. పెద్ది త‌ర్వాతే కొత్త ప్రాజెక్ట్ విష‌యంలో ఓ నిర్ణ‌యానికి వ‌స్తుంద‌ని స‌మాచారం. టాలీవుడ్‌కి సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే కూడా వాయిదా ప్రభావానికి గురవుతోంది. ఆమె న‌టిస్తోన్న‌ తాజా చిత్రం `లెనిన్` విడుదల జూన్ కు వాయిదా పడింది. వ‌రుస ప్లాప్ ల ప‌రంప‌ర‌లో `లెనిన్` తో హిట్ కొట్టి ప్లాప్ ఇమేజ్ నుంచి ఎంత తొంద‌ర‌గా బ‌య‌ట ప‌డ‌దామ‌న్నా? వాయిదా నిరాశ ప‌రుస్తోంది.

ఇలా సినిమాల వాయిదా ప్రభావం విడుదల తేదీలకే పరిమితం కాదు. ఇది హీరోయిన్ల రెమ్యూనరేషన్ , కొత్త అవకాశాలపై కూడా పడుతుంది. ఒక సినిమా హిట్ అయితే వచ్చే క్రేజ్‌తో కొత్త ప్రాజెక్టులు సైన్ చేసే అవకాశం ఉంటుంది. కానీ సినిమాలు వాయిదా పడినప్పుడు పాత సినిమాల ప్రమోషన్ల కోసమే సమయం కేటాయించాల్సి వస్తుంది. దీంతో వారి కెరీర్ ప్రణాళికలు తలకిందులయ్యే అవకాశం ఉంది. కియారా, జాన్వీ, భాగ్యశ్రీ ఇదే సందిగ్ధం లో ఉన్నారు. చిత్ర పరిశ్రమలో నిరీక్షణ అనేది ఓ భాగం. భారీ బడ్జెట్ సినిమాలు, గ్రాఫిక్స్ పనులు ఇతర కారణాల తో వాయిదాలు సహజమే. అయితే అవి హీరోయిన్ల కెరీర్ వేగాన్ని కొంత తగ్గిస్తాయి. అయినా నాణ్యమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడమే ఉత్త‌మ‌ని భావిస్తార‌న్న‌ది అంతే వాస్త‌వం. జూన్ నెలలో విడుద‌ల‌య్యే ఈ చిత్రాలు భామల నిరీక్షణకు తగిన ప్రతిఫలాన్ని అందిస్తాయ‌ని ఆశీద్దాం