సోలోగా కొట్టాలనుకున్నారు కానీ చేతులెత్తేసారు!
మరి 2025 లో అలాంటి భామలు టాలీవుడ్లో ఎలాంటి సక్సెస్ లు అందుకున్నారు? అంటే ఆ సినిమా ఫలితాలు ఏమాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు.
By: Srikanth Kontham | 3 Dec 2025 8:00 PM ISTఏ హీరోయిన్ లేడీ ఓరియేంటెడ్ ఛాన్సులు అంత సులభంగా వదులుకోదు. కమర్శియల్ సినిమాలు పది చేసినా? సోలోగా ఒక్క సినిమా తో థియేటర్ కు ఆడియన్స్ ను రప్పించగలిగితే? ఆ గౌరవం..గుర్తింపు వేరే లెవల్లో ఉంటుంది. సరైన కథ పడితే బాక్సాఫీస్ ను రూల్ చేయగల నటీమణులు చాలా మంది ఉన్నారు. అయితే అవకాశాలే అరుదుగా వస్తుంటాయి. మరి 2025 లో అలాంటి భామలు టాలీవుడ్లో ఎలాంటి సక్సెస్ లు అందుకున్నారు? అంటే ఆ సినిమా ఫలితాలు ఏమాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు. రెండేళ్ల క్రితం స్వీటీ అనుష్క `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి`తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.
కానీ ఆ సినిమా యావరేజ్ గా ఆడింది. `అరుంధతి` తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం అనుష్క ఎంతో కాలంగా ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి`తో ఓ ప్రయత్నం చేసింది. కానీ అంచనాలు అందుకోలేదు. దీంతో అమ్మడికి మళ్లీ క్రిష్ లైన్ లోకి వచ్చి 'ఘాటీ' కథ చెప్పాడు. కొన్ని వాస్తవ సంఘటనులు ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ ఏడాది భారీ అంచనాల మధ్యే రిలీజ్ అయింది. కానీ వాటిని అందుకోవడంలో విఫలమైంది. అలాగే `మహానటి` తర్వాత కీర్తి సురేష్ చాలా లేడీ ఓరియేంటెడ్ చిత్రాలు చేసింది.
కానీ ఏది బ్లాక్ బస్టర్ అవ్వలేదు. ఈ మద్యనే `రివాల్వర్ రీటా` అంటూ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాపై అమ్మడు చాలా ఆశలు పెట్టుకుంది. కానీ నిరాశ తప్పలేదు. అంతకు ముందు రిలీజ్ అయిన `రఘుతాత`, `గుడ్ లక్ సఖి`, `మిస్ ఇండియా` చిత్రాలు నిరుత్సాహ పరిచాయి. ఉమెన్ సెంట్రిక్ చిత్రాలతో తానో బ్రాండ్ అవ్వాలనుకుంది. కానీ ఆ రేంజ్ సక్సస్ లు మాత్రం `మహానటి` తర్వాత పడలేదు. ఇంకా మాలీవుడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కూడా ఇటీవలే `పరదా`తో అలరించాలనుకుంది. కానీ ప్రేక్షకులు పెదవి విరిచేసారు.
దీంతో కమర్శియల్ చిత్రాలకు ఇస్తోన్న ప్రాధాన్యత ప్రేక్షకులకు లేడీ ఓరియేంటెడ్ చిత్రాలకు ఇవ్వడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేసింది. అలాగే మిల్కీబ్యూటీ తమన్నా `ఓదెల 2` తో సోలోగా సత్తా చాటాలనుకుంది. సంపత్ నంది నిర్మించిన సినిమా కావడంతో? సంథింగ్ ఉంటుందనే అంచనాలతోనే రిలీజ్ అయింది. కానీ కంటెంట్ ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వలేదు. రెగ్యులర్ చిత్రంగానే ఉందన్న విమర్శ వ్యక్తమైంది. అలా 2025లో రిలీజ్ అయిన లేడీ ఓరియేంటెడ్ లు ప్రతికూల ఫలితాలతోనే సరిపెట్టాల్సి వచ్చింది.
