ఆ రెండు విషయాల్లో స్టార్ హీరోల అభిప్రాయం ఏంటి?
ఈ రెండు పరస్పర విరుద్ధ వ్యాఖ్యల మధ్య నలిగిపోతున్న స్టార్ హీరోలు అంతర్గతంగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారనేది అంతే వాసత్వం.
By: Srikanth Kontham | 10 Sept 2026 5:00 AM ISTటాలీవుడ్ లో బాక్సాఫీస్ ఫేక్ కలెక్షన్ల వివాదం మళ్ళీ చర్చనీయాంశంగా మారుతోంది. ఒకవైపు ప్రణయ్ రెడ్డి వంటి నిర్మాతలు ఫేక్ నంబర్లు చూపించడం వల్ల హీరోలు, దర్శకుల నిజమైన మార్కెట్ వ్యాల్యూ పడిపోతుందని, కంటెంట్ బాగుంటే ఆ సినిమానే మాట్లాడుతుందని హెచ్చరించారు. మరోవైపు మైత్రీ నవీన్ ఎర్నేని, నాగవంశీ వంటి నిర్మాతలు ఫ్యాన్స్ వార్స్, క్రేజ్ కాపాడుకోవడానికే కొన్నిసార్లు అలాంటి పోస్టర్లు వేయాల్సి వస్తోందని, అసలైన లెక్కలు కేవలం నిర్మాతకే తెలుస్తాయని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఈ రెండు విభిన్న అభిప్రాయాల మధ్య అసలు పరిశ్రమను నడిపించే స్టార్ హీరోలు ఈ అంశంపై ఏమనుకుంటున్నారనేది ఆసక్తికరంగా మారింది.
ప్రణయ్ రెడ్డి వ్యాఖ్యలతో కొంత మంది స్టార్ హీరోలు సూత్రప్రాయంగా ఏకీభవిస్తున్నట్లు వినిపిస్తోంది. పోస్టర్లపై వేసే కృత్రిమ అంకెల వల్ల తాత్కాలికంగా ఫ్యాన్స్‌ను సంతృప్తిపరచవచ్చేమో గానీ లాంగ్ రన్‌లో అది తమ మార్కెట్ వ్యాల్యూను, నమ్మకత్వాన్ని దెబ్బతీస్తుందని హీరోలు గ్రహిస్తున్నారు. తమ తదుపరి సినిమాల రెమ్యూనరేషన్, థియేట్రికల్ బిజినెస్ రేట్లు ఫేక్ నంబర్ల ఆధారంగా పెరిగితే ఆ తర్వాత వచ్చే సినిమాలు ఆ బిజినెస్ రికవరీ చేయలేక డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతారు. ఆ నింద చివరికి హీరోపైనే పడుతుందని.. నిజమైన కలెక్షన్లతో క్రెడిబిలిటీ కాపాడుకోవడమే నటుడిగా సురక్షితమని పలువురు స్టార్స్ భావిస్తున్నారుట.
నవీన్ ఎర్నేని, నాగవంశీ వ్యాఖ్యల్లోని వాస్తవాన్ని కూడా చాలా మంది స్టార్ హీరోలు కాదనలేకపోతున్నారు. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఫ్యాన్ బేస్ అనేది హీరో మార్కెట్ పొజిషన్‌ను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. మొదటి రోజు కలెక్షన్లు లేదా ఫుల్ రన్ పోస్టర్లు రాకపోతే సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ట్రోలింగ్‌కు గురవ్వడం, అధిపత్య పోరులో వెనుకబడిపోవడం వంటి ప్రాక్టికల్ ఒత్తిళ్లు ఉంటాయి. స్టార్‌డమ్‌ను నిలబెట్టడానికి, ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపడానికి నిర్మాతలు చేసే మార్కెటింగ్ స్టంట్స్ లేదా కలెక్షన్ల హడావుడిని అనివార్యమైన వ్యాపార వ్యూహంగా కొందరు హీరోలు మౌనంగా సమర్థిస్తుంటారు.
ఈ రెండు పరస్పర విరుద్ధ వ్యాఖ్యల మధ్య నలిగిపోతున్న స్టార్ హీరోలు అంతర్గతంగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారనేది అంతే వాసత్వం. ట్రాకర్లు, సోషల్ మీడియా హెచ్చరికల వల్ల తమ సినిమాపై నెగెటివిటీ రాకూడదని ఆరాటపడతారు. మరోవైపు కలెక్షన్ల పోస్టర్లు వేయకపోతే సినిమా ఆడేసిందని లేదా ప్లాప్ అయిందని ప్రచారం జరుగుతుందేమోనన్న భయం వెంటాడుతుంది. అయితే ఈ కలెక్షన్ల పోస్టర్ల వివాదంలోకి నేరుగా వేలు పెట్టి నిర్మాతలు .. ఫ్యాన్స్‌ను నొప్పించడం కంటే ఈ విషయంలో తామేమి మాట్లాడకుండా తటస్థంగా ఉండటమే శ్రేయస్కరమని మెజారిటీ స్టార్స్ భావిస్తుంటారు.
అయితే ఇటీవల కాలంలో టాలీవుడ్ టాప్ స్టార్ల ఆలోచనా విధానంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. కలెక్షన్ల పోస్టర్ల కంటే సినిమా కంటెంట్, పాజిటివ్ టాక్, సుదీర్ఘమైన థియేట్రికల్ రన్ మాత్రమే నిజమైన విజయాన్ని అందిస్తాయని వారు నమ్ముతున్నారు. `ఆర్ఆర్ఆర్`, `బాహుబలి`, `పుష్ప` వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది కేవలం మైలేజ్ పోస్టర్ల వల్ల కాదు. కథలో ఉన్న బలం వల్లేనని గుర్తు చేసుకుంటున్నారు. అందుకే రూపాయి కలెక్షన్ కూడా పోస్టర్ రూపంలో వేయాల్సిన అవసరం లేకుండా కంటెంట్‌కే ప్రాధాన్యత ఇవ్వాలని కొందరు యంగ్ అండ్ టాప్ హీరోలు మేకర్స్‌కు స్పష్టం చేస్తున్నారు.
అంతిమంగా ఫేక్ కలెక్షన్ల సంస్కృతి పరిశ్రమ ఆరోగ్యానికి మంచిది కాదనే ప్రణయ్ రెడ్డి అభిప్రాయానికి కొందరు హీరోల నుండి పూర్తి మద్దతు ఉన్నా? మార్కెట్ పోటీ , ఫ్యాన్ ప్రెజర్ దృష్ట్యా నిర్మాతలు చెప్పిన ప్రాక్టికల్ అడ్డంకులను కూడా చాలా మంది హీరోలు కాదనలేకపోతున్నారు. ఏదేమైనా? అంకెలు .. పోస్టర్ల మాయాజాలం కంటే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే నిజమైన స్టఫ్ స్క్రీన్ మీద ఉన్నప్పుడే నటుడి మార్కెట్ వ్యాల్యూ సురక్షితంగా ఉంటుందనేది స్టార్ హీరోలు అంతిమంగా నమ్ముతున్న అసలైన నిగ్గుతేలిన సత్యం. అందులో ఎలాంటి సందేహం లేదు.
