Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌లో పోస్టర్ నెంబర్ల రాజకీయం!

ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రేక్షకులు చురుగ్గా ఉంటున్నారు. ఏ సినిమా నిజంగా బాగుంది.. ఏ సినిమా కలెక్షన్స్ ఫేక్ అనే విషయాలను సోషల్ మీడియా వేదికగా ఇట్టే ప‌సిగ‌డుతున్నారు.

By:  Srikanth Kontham   |   29 July 2026 1:03 PM IST
టాలీవుడ్‌లో పోస్టర్ నెంబర్ల రాజకీయం!
X

టాలీవుడ్‌లో విజయాన్ని లెక్కగట్టే విధానంపై నిరంత‌రం చర్చ జరుగుతూనే ఉంది. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే పోస్టర్లపై కోట్లు కొల్లగొట్టినట్లు నెంబర్లు వేసుకోవడం ఇండస్ట్రీలో సంప్రదా యంగా మారింది. అయితే ఈ ఫేక్ కలెక్షన్స్ .. నెంబర్ల గోల గురించి ఈ మ‌ధ్య కాలంలో సెల‌బ్రిటీలు చాలా ఓపెన్‌గా స్పందిస్తున్నారు. సినిమాల సక్సెస్ విషయంలో పోస్టర్లపై నంబర్లు వేసుకోవడం, బాక్సాఫీస్ లెక్కలను అతిగా ప్రదర్శించడం పట్ల వస్తున్న విమర్శలపై ప్రముఖులు తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు.

ఈ కోవలోనే `లవ్ స్టోరీ` సక్సెస్ మీట్‌లో అక్కినేని నాగచైతన్య చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. సినిమా విజయం అనేది కేవలం పోస్టర్లపై వేసుకునే నెంబర్ల మీదో లేదా కోట్ల కలెక్షన్‌ల ప్రకటనల మీదో ఆధారపడి ఉండకూడదన్నారు. ప్రేక్షకులకు సినిమా నచ్చిందా? లేదా? థియేటర్లలో నిజమైన ఆదరణ లభిస్తోందా అనేదే అసలైన విజయానికి కొలమానమని అభిప్రాయపడ్డారు. పబ్లిసిటీ కోసం నెంబర్లను పెంచి చూపడం కంటే.. కంటెంట్‌పై దృష్టి పెట్టడమే ముఖ్యమనే చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాలను ఆలోచించేలా చేస్తున్నాయ‌న్న‌ది వాస్త‌వం.

నాగచైతన్య బాటలోనే కింగ్ నాగార్జున కూడా కలెక్షన్స్ .. మేకింగ్ ప్లానింగ్స్ గురించి అత్యంత వాస్తవిక దృక్పథంతో మాట్లాడారు. ఇండస్ట్రీలో కొంత కాలంగా నడుస్తున్న పోస్టర్ నెంబర్ల ట్రెండ్‌ను ఆయన పరోక్షంగా తప్పుపట్టారు. ఏ సినిమాకైనా అసలైన తీర్పు ప్రేక్షకులు ఇస్తారని, అనవసరమైన నెంబర్లతో జనాలను నమ్మించడం కంటే నాణ్యమైన సినిమాను అందించడమే నిర్మాతలకు, హీరోలకు శాశ్వత పేరు తెచ్చిపెడుతుందని నాగార్జున అభిప్రాయ‌ప‌డ్డారు. సీనియర్ హీరో అయిన నాగ్ ఈ అంశంపై మాట్లాడటం ఇండస్ట్రీలో ప్రాధాన్యత సంతరిం చుకుంది.

నిజానికి నిర్మాతలు , పీఆర్ టీమ్‌లు సినిమాను పెద్ద హిట్‌గా చూపించడానికి కొన్నిసార్లు బాక్సాఫీస్ నెంబర్లను అతిగా ప్రచారం చేస్తుంటాయి. దీనివల్ల కొన్నిసార్లు నిజంగా ఆడుతున్న సినిమాలకు కూడా నష్టం జరుగుతుంది. అలాగే ప్రేక్షకుల్లో నమ్మకం సడలిపోతుంది. కలెక్షన్స్ లెక్కలు నిజాయితీగా లేకపోతే లాంగ్ రన్‌లో ఆ సినిమా ఇమేజ్ దెబ్బతింటుందని ట్రేడ్ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. సెలబ్రిటీలు స్వయంగా ఈ విషయాలపై గళం విప్పుతుండటం వల్ల భవిష్యత్తులో పోస్టర్ నెంబర్ల హడావుడి తగ్గే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రేక్షకులు చురుగ్గా ఉంటున్నారు. ఏ సినిమా నిజంగా బాగుంది.. ఏ సినిమా కలెక్షన్స్ ఫేక్ అనే విషయాలను సోషల్ మీడియా వేదికగా ఇట్టే ప‌సిగ‌డుతున్నారు. పోస్టర్ నెంబర్లను చూసి ప్రేక్షకులు థియేటర్లకు రారనే వాస్తవాన్ని మేకర్స్ గ్రహిస్తున్నారు. కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్‌గా కలెక్షన్స్ వస్తాయని, దానికి ప్రత్యేకంగా నెంబర్లను అంటించాల్సిన అవసరం లేదని స్టార్స్ చేస్తున్న కామెంట్స్ పరిశ్రమలో ఆరోగ్యకరమైన మార్పునకు సంకేతంగా నిలుస్తున్నాయి.

చివ‌రిగా సినిమాల సక్సెస్ పోస్టర్ల మీదో లేదా నెంబర్ల మీదో ఆధారపడి ఉండకూడదనే టాలీవుడ్ స్టార్స్ అభిప్రాయం ఎంతో స్వాగతించదగిన పరిణామం. అనూహ్యమైన నెంబర్ల ప్రకటనల కంటే పారదర్శకత , నాణ్యమైన కంటెంట్ ఉండటమే చిత్ర పరిశ్రమ దీర్ఘకాలిక ఆరోగ్యానికి ముఖ్యం. రాబోయే రోజుల్లో ఈ ట్రెండ్ పూర్తిగా మారి నిజాయితీతో కూడిన విజయాలకే ఇండస్ట్రీలో పెద్దపీట వేయాల‌ని అంతా ఆశీస్తున్నారు.