ఎవరి కుంపటి వారిదే..అందుకే మంచి చేయలేకపోతున్నాం!
తెలుగు చలన చిత్ర పరిశ్రమ తీరును ఉద్దేశించి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
By: Srikanth Kontham | 14 Aug 2025 10:21 PM ISTతెలుగు చలన చిత్ర పరిశ్రమ తీరును ఉద్దేశించి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేసారు. జాతీయ అవార్డుకు ఎంపికైన వారిని సత్కరించకపోవడంపై అరవింద్ అసహనం వ్యక్తం చేసారు. తెలుగు పరిశ్రమలో ఎవరి కుంపటి వారిదేనని సైమా బృందం నిర్వహించిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేసారు. జాతీయ పురస్కారాల్లో తెలుగు సినిమాకు ఏడు అవార్డులు వచ్చాయి. సైమా స్పందించి అవార్డు విజేతలను సత్కరించింది. ఇది ఎంతో అభినందనీయమన్నారు.
జాతీయ అవార్డులు వచ్చినా మన పరిశ్రమ స్పందించలేదన్నారు.` జాతీయ అవార్డులను ఓ పండుగలా జరుపుకోవాలి. ఇక్కడ అలా జరగడం లేదు. ఎవరి కుంపటి వారిదే అన్నట్లు కనిపిస్తుందన్నారు. అందుకే మంచి పనులు చేయలేకపోతు న్నామన్నారు. దీంతో ఇప్పుడీ వ్యాఖ్యలు పరిశ్రమ సహా నెట్టింట వైరల్ గా మారాయి. అరవింద్ ఎవర్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసారంటూ నెట్టింట డిబేట్ కు తెర తీసింది.
రెండేళ్ల క్రితం `పుష్ప` చిత్రానికిగానూ అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వరించిన సంగతి తెలిసిందే. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న తొలి నటుడు అర్జున్ కావడం విశేషం. అప్పటి వరకూ ఏ తెలుగు నటుడికి జాతీయ ఉత్తమ నటుడి గుర్తింపు దక్కలేదు. తొలిసారి బన్నీకి రావడంతో అభి మానులు సహా అల్లు ఫ్యామిలీ సంతోషం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా వేదికగా ఇండస్ట్రీ లో కొంత మంది నుంచి రెస్పాన్స్ వచ్చింది.
అదే సమయంలో పది కేటగిరిలో మరిన్ని జాతీయ అవార్డుల వరించాయి. కానీ చిత్ర పరిశ్రమ నుంచి ఎలాంటి సత్కారం దక్కలేదు. అలాగే 2023 ఏడాదికిగాను ఇటీవలే 71వ జాతీయ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా `భగవంత్ కేసరి` నిలిచింది. మొత్తంగా తెలుగు సినిమాకు ఏడు అవార్డుల వరించాయి. `బలగం` సినిమాలోని పాటకి కాసర్ల శ్యామ్ ఉత్తమ లిరిసిస్ట్ అవార్డు రాగా, `బేబీ` చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే, `హనుమాన్` చిత్రానికి ఉత్తమ యాని మేషన్ - విజువల్ ఎఫెక్ట్స్ లో అవార్డులు దక్కాయి. ప్రతిష్టాత్మక జాతీయ అవార్డుల వరించినా సొంత పరిశ్రమ నుంచి సరైన సత్కారం దక్కక్కపోవడంతో అరవింద్ ఇలా వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతోంది.
