Begin typing your search above and press return to search.

'పెద్ది' రిలీజ్ డైల‌మా: మ‌రో 24 గంట‌ల్లో తాడో పేడో

ఈ గొడవ ఇలాగే కొనసాగితే రిలీజ్ కి రానున్న‌ భారీ చిత్రాల విడుదలపై ప్రభావం పడుతుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

By:  Sivaji Kontham   |   14 May 2026 1:43 PM IST
పెద్ది రిలీజ్ డైల‌మా: మ‌రో 24 గంట‌ల్లో తాడో పేడో
X

టాలీవుడ్ లో ఎగ్జిబిటర్లు - నిర్మాతల మధ్య నెలకొన్న వివాదం ప్రస్తుతం పీక్స్ కు చేరుకుంది. పర్సంటేజీ షేరింగ్ అంశంపై శిరీష్ రెడ్డి, ఏషియన్ నారంగ్ వర్గం ఒకవైపు.. థియేట‌ర్ల అద్దె విధానం వైపు నాగవంశీ, మైత్రి రవిశంకర్ వర్గం ఉండి చేస్తున్న వాదోపవాదాలు ఇండస్ట్రీని వేడెక్కిస్తున్నాయి. ముఖ్యంగా నారంగ్ వ‌ర్సెస్ నాగవంశీ 'వార్ ఆఫ్ వర్డ్స్' సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. ఈ గొడవ ఇలాగే కొనసాగితే రిలీజ్ కి రానున్న‌ భారీ చిత్రాల విడుదలపై ప్రభావం పడుతుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ, నిర్వహణ ఖర్చులు, పర్సంటేజీ విధానంపై ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఎగ్జిబిటర్లు తమ ఇబ్బందులను ఎదురుదాడికి ఆయుధంగా వాడుతుంటే... నిర్మాతలు మాత్రం ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ఇబ్బందిగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు (15 మే) జరగబోయే కీలక చర్చలు పరిశ్రమ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. ఈ చర్చల ద్వారా ఏదో ఒక స్పష్టమైన ఫలితం వస్తుందని.. అటు ఎగ్జిబిటర్లు, ఇటు నిర్మాతలు ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు.

మే 15న జరగనున్న నిర్మాత‌ల అత్యవసర సమావేశం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మీటింగ్ తర్వాతే ఈ వివాదం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ ఈ సమావేశంలో కూడా సయోధ్య కుదరకపోతే పరిస్థితి మరింత జటిలంగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికే విడుదల తేదీలు ప్రకటించిన సినిమాల విషయంలో పంపిణీదారులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.

పరిస్థితి ఇలాగే కొనసాగితే చివరికి ఇండస్ట్రీ పెద్దలు రంగంలోకి దిగక తప్పదని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, సురేష్ బాబు వంటి పెద్దలు ఈ వివాదంలో జోక్యం చేసుకుని `పెద్ది` సినిమా విడుదల లోపు సమస్యను పరిష్కరించే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్. పెద్ద సినిమాల విడుదల సమయంలో ఇండస్ట్రీలో ఇలాంటి అనిశ్చితి నెలకొనడం ఎవరికీ మంచిది కాదని.. త్వరగా సెటిల్మెంట్ జరగాలని అందరూ కోరుకుంటున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్‌లో జరుగుతున్న ఈ `కోల్డ్ వార్` ఎటు దారి తీస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. థియేటర్ యాజమాన్యాలు తమ పట్టు వీడతాయా? లేదా నిర్మాతలు కొంత వెనక్కి తగ్గుతారా? అనేది మరో 24 గంటల్లో తేలిపోనుంది. రేపటి చర్చలే `పెద్ది` సినిమా రిలీజ్ డైల‌మాను క్లియ‌ర్ చేయ‌నున్నాయ‌ని అంచ‌నా. ఈసారి చ‌ర్చ‌ల్లో పంపిణీ వ్యవస్థలోని కొత్త నిబంధనలను ఖరారు చేసే వీలుంద‌ని భావిస్తున్నారు. ఏది ఏమైనా.. పరిశ్రమ హితం కోరి ఇరు వర్గాలు ఒక మెట్టు దిగి రావడమే ప్రస్తుతానికి ఉన్న ఏకైక మార్గంగా కనిపిస్తోంది.