టాలీవుడ్ బెజవాడకు.. సంబరాలే సంబరాలు!
తెలుగు చిత్రసీమకు సంబంధించిన చాలా ఈవెంట్లు ఇటీవల హైదరాబాద్ వెలుపల కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 6 Sept 2025 4:27 PM ISTతెలుగు చిత్రసీమకు సంబంధించిన చాలా ఈవెంట్లు ఇటీవల హైదరాబాద్ వెలుపల కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు హైదరాబాద్ లో మాత్రమే జరగాలి అనే రూల్ ఏమీ లేదు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఏ నగరంలో అయినా వేడుక జరిగేందుకు ఆస్కారం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలైన విజయవాడ-అమరావతి, విశాఖపట్నం, తిరుపతి వంటి చోట్ల టాలీవుడ్ కి సంబంధించిన ఈవెంట్ లను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని ఉద్దేశం టాలీవుడ్ కేవలం హైదరాబాద్ కు మాత్రమే పరిమితం కాదు! అని చెప్పడమే.
మునుముందు ఏపీలో మరింతగా భారీ ఈవెంట్ల నిర్వహణకు సన్నాహకాల్లో ఉన్నారని తెలిసింది. అమరావతి రాజధాని నిర్మానం వేగంగా పూర్తవుతున్న సన్నివేశంలో, సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే `విజయవాడ ఉత్సవ్`లో టాలీవుడ్ సంబరాలు మొదలు కానున్నాయని తాజాగా గుసగుస వినిపిస్తోంది. టాలీవుడ్ దిగ్గజ హీరోల సినిమాలకు ప్రచార కార్యక్రమాలను ఈసారి బెజవాడలో పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తుండడంతో ఇది సర్వత్రా ఆసక్తిని పెంచుతోంది. విజయ దశమి ఉత్సవాల్లో చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్ బెజవాడలో సందడి చేయబోతున్నారు. చిరు మన శంకర వర ప్రసాద్ గారు, బాలయ్య అఖండ 2 ఈవెంట్లతో పాటు, పవన్ ఓజీ ఈవెంట్ కూడా భారీ ఎత్తున బెజవాడలో ప్లాన్ చేయడం ఆసక్తిని పెంచుతోంది. ` తెలుసు కదా` టీమ్ సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి కూడా విజయవాడ ఉత్సవ్ లోని ప్రచార కార్యక్రమాల్లో కనిపిస్తారు.
విజయవాడలో వెన్యూ ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? అంటే... తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఘంటసాల సంగీత కళాశాలలో ప్రత్యేక కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నారు. గొల్లపూడి సమీపంలోని పున్నమిఘాట్ వద్ద అద్భుత కార్యక్రమాలను ప్లాన్ చేసారని తెలిసింది. ప్రముఖ సంగీతకారులతో మ్యూజిక్ నైట్స్ బెజవాడకు కొత్త కళను తేనున్నాయి. థమన్ ఇండియన్ ఐడల్ కాప్రిక్ మ్యూజిక్ బ్యాండ్ ర్యాప్ షో కూడా ఈ వేడుకలో ఉంటాయి. విజయవాడ ఉత్సవ్ `ఒక నగరం… ఒక వేడుక` అనే టైటిల్‌తో వైభవంగా జరగనుండగా, లోగోను దుర్గమ్మ బంగారు గోపురం, ప్రకాశం బ్యారేజీ ఫోటోలతో రూపొందించారు. దసరా పండగ ఈసారి బెజవాడలో అత్యంత వైభవంగా ప్లాన్ చేస్తుండడం స్టార్ స్టడెడ్ ఈవెంట్లుగా మలుస్తుండడంతో ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
