Begin typing your search above and press return to search.

జపాన్ లో బాలీవుడ్ పరిస్థితి ఏంటి?

జపాన్ చలనచిత్ర మార్కెట్‌లో భారతీయ సినిమాల ప్రయాణం దశాబ్దాలుగా ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది.

By:  Srikanth Kontham   |   13 July 2026 3:30 PM IST
జపాన్ లో బాలీవుడ్ పరిస్థితి ఏంటి?
X

జపాన్ చలనచిత్ర మార్కెట్‌లో భారతీయ సినిమాల ప్రయాణం దశాబ్దాలుగా ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. గతంలో కొన్ని బాలీవుడ్ సినిమాలు అక్కడ పరిమితమైన గుర్తింపును పొందినప్పటికీ ఇటీవలి కాలంలో టాలీవుడ్ సృష్టించిన ప్రభంజనం జపాన్ బాక్సాఫీస్ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసింది. భారీ యాక్షన్ సన్నివేశాలు, బలమైన భావోద్వేగాలు , వినూత్నమైన కథన శైలి టాలీవుడ్ సినిమాలను జపాన్ ప్రేక్షకుల మనసులకు చేరువ చేశాయి.

జపాన్‌లో `ముత్తు` సినిమాతో మొదలైన భారతీయ సినిమా ప్రస్థానం `బాహుబలి` సిరీస్ రాకతో సరికొత్త మలుపు తిరిగింది. రాజమౌళి దర్శకత్వ ప్రతిభ, ప్రభాస్ వంటి స్టార్ల మేనరిజం జపనీస్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. `బాహుబలి: ది కన్క్లూజన్` అక్కడ వంద రోజులకు పైగా ఆడింది. దీంతో టాలీవుడ్ స్థాయిని అంతర్జాతీయ స్థాయిలో నిల బెట్టింది. అటుపై రిలీజ్ అయిన `ఆర్ఆర్ ఆర్ సాధించిన విజయం భారతీయ సినిమా జపాన్ వంటి సంప్రదాయవాద మార్కెట్‌లో కూడా ఎలా పాతుకుపోగలదో? నిరూపించింది.

బాలీవుడ్ సినిమాలు ఎక్కువగా ప్రవాస భారతీయులను.. పరిమిత వర్గాలను ఆకర్షించడంలోనే సరిపె ట్టుకుంటుండగా టాలీవుడ్ చిత్రాలు స్థానిక జపనీస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ముందుంటున్నాయి. దీనికి ప్రధాన కారణం టాలీవుడ్ చిత్రాల్లో ఉండే మసాలా అంశాలు, గొప్ప విజువల్ ఎఫెక్ట్స్ , పాత్రల మధ్య ఉండే బలమైన సంఘర్షణ. జపనీస్ ప్రేక్షకులు ఎక్కువగా కంటెంట్ ఆధారిత సినిమాలను ఇష్టపడతారు. టాలీవుడ్ ఆ అవసరాలను తమదైన శైలిలో అందిస్తోంది.

ప్రస్తుతం జపాన్ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రత్యేకమైన ఐకాన్ లుగా మారిపోయారన్న‌ది కాద‌న‌లేని నిజం. సోషల్ మీడియా వేదికగా జ‌ప‌నీస్ చూపిస్తోన్న ఆదరణ, హైదరాబాద్‌ వరకు వచ్చి సినిమా థియేటర్ల వద్ద సందడి చేయడం వంటి అంశాలు టాలీవుడ్ సినిమాల పట్ల ఉన్న క్రేజ్‌కు నిదర్శనం. భవిష్యత్తులో రాబోయే భారీ ప్రాజెక్టుల విషయంలో కూడా జపాన్ బాక్సాఫీస్ నుంచి భారీ వసూళ్లను ఆశిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

బాలీవుడ్ సినిమాలు తరచుగా సామాజిక అంశాల చుట్టూ తిరుగుతుంటే? టాలీవుడ్ అద్భుతమైన కావ్యాలను, పౌరాణిక స్ఫూర్తిని, అత్యున్నత స్థాయి యాక్షన్ డ్రామాలను అందిస్తోంది. ఈ వ్యత్యాసమే జపాన్ మార్కెట్‌లో టాలీవుడ్‌కు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. స్థానిక పంపిణీదారులు సైతం తెలుగు సినిమాలను విడుదల చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో తెలుగు సినిమా జ‌పాన్ మార్కెట్ ఏ స్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు.

జపాన్ మార్కెట్‌లో బాలీవుడ్ పరిమిత వర్గానికి పరిమితం అయితే? టాలీవుడ్ మాత్రం కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఈ దూరం ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే తెలుగు చిత్రపరిశ్రమ సాంకేతిక ప్రమాణాలను, కథా, కథనాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మార్చుకుంటూ ముందుకు వెళ్తోంది. ఈ మార్పు రాబోయే రోజుల్లో భారతీయ సినిమాను ప్రపంచ సినిమా పటంలో అగ్రస్థానంలో నిలబెడుతుందన్న‌ది అంతే వాస్త‌వం.