తెలుగు 'బయ్యర్ల' వ్యవస్థ వీక్ అవుతోందా? ఎందుకలా?
కానీ ఇప్పుడు అదే వ్యవస్థ తగ్గిపోతున్నట్లు కనిపిస్తోంది. గతంలో ప్రతి ఏరియాలో పోటీగా బయ్యర్లు ఉండేవారు. పెద్ద సినిమాల కోసం భారీ మొత్తాలు పెట్టి హక్కులు సొంతం చేసుకున్న పరిస్థితి ఉండేది.
By: M Prashanth | 15 April 2026 10:00 PM ISTటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బయ్యర్లు తగ్గుతున్నారా? ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన ప్రశ్న ఇదే. సినిమా నిర్మాణం నుంచి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం వరకు కీలక పాత్ర పోషించే బయ్యర్ల వ్యవస్థ వీక్ అవుతుందన్న సంకేతాలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. దీంతో అంతా విషయం కోసమే డిస్కస్ చేసుకుంటున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతలు సినిమాను పూర్తి చేసే దశలోనే లేదా పూర్తయ్యాక వివిధ ఏరియాల వారీగా పంపిణీ హక్కులు బయ్యర్లకు విక్రయించడం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర, ఈస్ట్, వెస్ట్, కృష్ణ, గుంటూరు, నెల్లూరు వంటి ప్రాంతాలుగా మార్కెట్ ను విభజించి డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ నడుస్తుంది. ఈ వ్యవస్థ ఎన్నో ఏళ్లుగా పరిశ్రమకు గట్టి సపోర్ట్ గా నిలిచింది.
కానీ ఇప్పుడు అదే వ్యవస్థ తగ్గిపోతున్నట్లు కనిపిస్తోంది. గతంలో ప్రతి ఏరియాలో పోటీగా బయ్యర్లు ఉండేవారు. పెద్ద సినిమాల కోసం భారీ మొత్తాలు పెట్టి హక్కులు సొంతం చేసుకున్న పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు చాలా ప్రాంతాల్లో బయ్యర్ల సంఖ్య బాగా తగ్గిపోయిందట. ఉత్తరాంధ్రలోని వైజాగ్ ప్రాంతాన్ని పరిశీలిస్తే, అక్కడ కేవలం ఇద్దరు లేదా ముగ్గురు ప్రధాన బయ్యర్లు మాత్రమే మిగిలినట్టు సమాచారం.
ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాల్లో కూడా పరిస్థితి అంతే. ఒక్కో ప్రాంతంలో ఇద్దరు బయ్యర్లే మార్కెట్ ను కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. కృష్ణ జిల్లాలో బయ్యర్లు ఉన్నప్పటికీ కొత్త సినిమాలు కొనుగోలు చేయడంలో వెనుకంజ వేస్తున్నారు. గుంటూరు, నెల్లూరు ప్రాంతాల్లో కూడా ఒకరిద్దరు బయ్యర్లకే వ్యవస్థ పరిమితమైపోయింది. ఆ పరిస్థితి నిర్మాతలకు ఆందోళన కలిగిస్తోంది.
ఎందుకంటే పోటీ తగ్గిపోతే, సినిమా హక్కుల ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు ఏరియాల వారీగా భారీ బిజినెస్ జరిగేది. ఇప్పుడు మాత్రం బయ్యర్లు పూర్తిగా రిస్క్ తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం బయ్యర్లు ఎక్కువగా అడ్వాన్స్ మోడల్ వైపు మొగ్గు చూపుతున్నారు. పూర్తి మొత్తాన్నిపెట్టి హక్కులు కొనుగోలు చేయడం కంటే, కొంత అడ్వాన్స్ ఇచ్చి రిలీజ్ తర్వాత కలెక్షన్ల ఆధారంగా సెటిల్ చేసుకోవాలనే విధానాన్ని అనుసరిస్తున్నారు.
ఇది నిర్మాతలకు వెంటనే పెద్ద మొత్తంలో రికవరీ కావడాన్ని ప్రభావితం చేస్తోంది. అదే సమయంలో, రెగ్యులర్ బ్యానర్లు లేదా క్రేజ్ ఉన్న నిర్మాతల సినిమాలకే బయ్యర్లు ముందుకు వస్తున్నారట. స్టార్ హీరోలు, పెద్ద దర్శకులు ఉన్న ప్రాజెక్టులు లేదా మార్కెట్ లో పేరు ఉన్న సంస్థల సినిమాలకు మాత్రమే డిమాండ్ కనిపిస్తోంది. చిన్న, మధ్య తరహా సినిమాలకు అయితే బయ్యర్లు దూరంగా ఉండటం గమనార్హం.
ఇటీవలి కాలంలో కొన్ని సినిమాలు భారీ నష్టాలు చవిచూడటం, ఓటీటీ ప్రభావం పెరగడం, ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పులు రావడం వంటి అంశాలు ఆ పరిస్థితికి కారణాలుగా తెలుస్తోంది. మొత్తం మీద చూస్తే.. బయ్యర్ల వ్యవస్థ వీక్ అవుతుందన్న అభిప్రాయం బలపడుతోంది. దానికి సొల్యూషన్ గా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కలిసి కొత్త వ్యూహాలు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పాలి.
