Begin typing your search above and press return to search.

తెరవెనుక నుంచి తెరపైకి.. స్టార్ డైరెక్టర్ల భార్యల కొత్త ట్రెండ్

ఇన్నాళ్లుగా తెరవెనుక ఉంటూ, తమ భర్తల సక్సెస్‌లో కీలక పాత్ర పోషించిన కొందరు స్టార్ డైరెక్టర్ల భార్యలు, ఇప్పుడు నేరుగా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు.

By:  M Prashanth   |   25 Oct 2025 10:25 AM IST
తెరవెనుక నుంచి తెరపైకి.. స్టార్ డైరెక్టర్ల భార్యల కొత్త ట్రెండ్
X

టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ఇన్నాళ్లుగా తెరవెనుక ఉంటూ, తమ భర్తల సక్సెస్‌లో కీలక పాత్ర పోషించిన కొందరు స్టార్ డైరెక్టర్ల భార్యలు, ఇప్పుడు నేరుగా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. తమకంటూ సొంత బ్యానర్లు స్థాపించి, సినిమాలను నిర్మిస్తూ ఇండస్ట్రీలో కొత్త పవర్ సెంటర్లుగా మారుతున్నారు. ఈ ట్రెండ్ గతంలో ఉన్నా కూడా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

తబితా సుకుమార్

ఈ లిస్ట్‌లో లేటెస్ట్‌గా చేరిన పేరు తబితా సుకుమార్. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ భార్య అయిన తబితా, తాజాగా 'తబితా సుకుమార్ ఫిల్మ్స్' పేరుతో సొంత ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించారు. ఆమె నిర్మిస్తున్న మొదటి ప్రాజెక్ట్ కూడా చాలా స్పెషల్‌గా ఉండబోతోంది. 2015లో సుకుమార్ రైటింగ్స్‌పై విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'కుమారి 21F' చిత్రానికి సీక్వెల్‌గా 'కుమారి 22F'ను ఆమె నిర్మిస్తున్నారు.

సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లే అందించిన ఆ కల్ట్ యూత్‌ఫుల్ డ్రామాకు ఇది కొనసాగింపు కానుండటంతో ప్రాజెక్ట్‌పై మంచి అంచనాలే ఉన్నాయి. నిజానికి, తబితా నిర్మాతగా మారడం ఇదే మొదటిసారి కాదు. గతంలో రావు రమేష్ నటించిన 'మారుతినగర్ సుబ్రమణ్యం' చిత్రానికి ఆమె ప్రజెంటర్‌గా వ్యవహరించారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య

ఇదే బాటలో నడుస్తున్న మరో స్టార్ డైరెక్టర్ భార్య, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య. ఆమె 'ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్' అనే బ్యానర్‌ను స్థాపించి, ఇప్పటికే పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. అయితే, ఆమె సోలోగా కాకుండా, హారిక హాసిని అనుబంధ సంస్థ అయిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు. 'సార్', 'మ్యాడ్', లేటెస్ట్‌గా వచ్చిన 'మాస్ జాతర' వంటి చిత్రాలకు ఆమె సహ నిర్మాతగా వ్యవహరించారు. కానీ, టబుకు భిన్నంగా, సాయి సౌజన్య మాత్రం ఎప్పుడూ మీడియాకు, పబ్లిసిటీకి దూరంగా ఉంటారు.

నాగ్ అశ్విన్ భార్య ప్రియాంక దత్

ఇక టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ భార్య ప్రియాంక దత్ గురించి అందరికి తెలిసిందే. అయితే, ఆమె కేవలం దర్శకుడి భార్యగానే కాకుండా, ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కుమార్తెగా, వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లలో మొదటి నుంచీ నిర్మాతగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎవడే సుబ్రమణ్యం, మహానటి, జాతిరత్నాలు, సీతారామం వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు ఆమె నిర్మాతగా వ్యవహరించారు. ఆమె ప్రొడక్షన్ బ్యాక్‌గ్రౌండ్ నాగ్ అశ్విన్‌తో పెళ్లికి ముందే ఉంది, కానీ ఈ జనరేషన్‌లో యాక్టివ్ ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్నారు.

ఈ ఇద్దరే కాకుండా, రాజమౌళి భార్య రమా రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్‌గా, స్టైలిస్ట్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కొరటాల శివ భార్య కూడా నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారని అప్పుడప్పుడు వార్తలు వస్తుంటాయి. అయితే, టబు, సాయి సౌజన్య మాత్రం పూర్తిస్థాయి నిర్మాతలుగా యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. ఏది ఏమైనా, ఇండస్ట్రీలో మహిళలు ఇలా కీలక బాధ్యతలు చేపట్టడం అభినందనీయం.