Begin typing your search above and press return to search.

హీరోల బిజీ షెడ్యూల్స్.. డైరెక్టర్ల స్ట్రాటజీని మార్చేశాయా?

ఈ మార్పుకు కేవలం హీరోల డేట్స్ మాత్రమే కారణం కాదు. గత కొన్నేళ్లుగా ఒక సినిమా రిజ‌ల్ట్ డైరెక్ట‌ర్ నెక్ట్స్ ఛాన్సుల‌పై డైరెక్ట్ ఇంపాక్ట్ చూపుతోంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   21 July 2026 10:00 PM IST
హీరోల బిజీ షెడ్యూల్స్.. డైరెక్టర్ల స్ట్రాటజీని మార్చేశాయా?
X

ఇటీవల టాలీవుడ్‌లో డైరెక్ట‌ర్ల పని తీరు గమనిస్తే ఒక ఆసక్తికరమైన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు ఒక కథను పూర్తిగా రెడీ చేసి, ఆ కథకు సరిపోయే హీరోతోనే సినిమా చేయాలనే విధానం ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. స్టార్ హీరోలతో పాటు మిడ్ రేంజ్ హీరోలు కూడా నెలల తరబడి ముందుగానే కమిట్‌మెంట్లతో బిజీగా ఉండటం వల్ల, డైరెక్ట‌ర్లు ఒకే కథపై ఆధారపడే పరిస్థితి తగ్గుతోంది. దానికి బదులుగా రెండు లేదా మూడు కథలను ఒకేసారి రెడీగా ఉంచే మల్టిపుల్ స్క్రిప్ట్ స్ట్రాటజీ టాలీవుడ్‌లో వేగంగా పెరుగుతోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ మార్పుకు కేవలం హీరోల డేట్స్ మాత్రమే కారణం కాదు. గత కొన్నేళ్లుగా ఒక సినిమా రిజ‌ల్ట్ డైరెక్ట‌ర్ నెక్ట్స్ ఛాన్సుల‌పై డైరెక్ట్ ఇంపాక్ట్ చూపుతోంది. ముఖ్యంగా ఆశించిన ఫలితం రాకపోతే, కొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించడం అంత సులభం కావ‌డం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకే కథతో నెలల తరబడి వేచి ఉండటం కంటే, విభిన్న జానర్లలో ఒకటి కంటే ఎక్కువ కథలను రెడీ చేసుకోవడం డైరెక్ట‌ర్ల‌కు సురక్షితమైన మార్గంగా మారుతోంది.

మరోవైపు, మిడ్ రేంజ్ హీరోల క్యాలెండర్లు కూడా ఇప్పుడు గతంతో పోలిస్తే చాలా బిజీగా మారాయి. ఓటీటీ మార్కెట్ విస్తరణ, పాన్ ఇండియా అవకాశాలు, వరుస సినిమాల కమిట్‌మెంట్లు కలిసి వారి షెడ్యూల్స్‌ను ముందుగానే నింపేస్తున్నాయి. దీంతో ఒక హీరో అందుబాటులో లేకపోతే మరో హీరోకు సరిపోయే కథను వెంటనే వినిపించేలా డైరెక్ట‌ర్లు ముందస్తు ప్లానింగ్ తో వ్యవహరిస్తున్నారు. ఒకే కథను వేర్వేరు హీరోలకు సరిపోయేలా మార్చడం కంటే, ప్రతి హీరో ఇమేజ్‌కు తగ్గ స్పెష‌ల్ కథలను రెడీగా ఉంచే ధోర‌ణి ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది.

ఇది కేవలం కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లే వ్యూహం మాత్రమే కాదు, మార్కెట్‌కు అనుగుణంగా వేగంగా స్పందించే బిజినెస్ మోడల్ కూడా. నిర్మాణ సంస్థలు సైతం ఆలస్యం కాకుండా ప్రాజెక్టులు మొద‌లుపెట్టాల‌ని కోరుకుంటున్న నేపథ్యంలో, డైరెక్ట‌ర్లు ముందుగానే ప్రత్యామ్నాయ కథలను రెడీ చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఫలితంగా టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక దర్శకుడు- ఒక కథ అనే సాంప్రదాయ విధానానికి బదులుగా ఒక దర్శకుడు- ఎన్నో కథలు అనే కొత్త వర్కింగ్ స్టైల్ రూపుదిద్దుకుంటోంది. మారుతున్న మార్కెట్, బిజీ షెడ్యూల్స్, రిజ‌ల్ట్ ప్రెజర్ కలిసి ఈ మల్టిపుల్ స్క్రిప్ట్ కల్చర్‌ను మరింత బలోపేతం చేస్తున్నాయని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.