రజనీ-కమల్ కోసం ఆ ఇద్దరు?
సుందర్ సి లాంటి సీనియర్ దర్శకుడు హ్యాండిల్ చేయలేని ప్రాజెక్టును ఇప్పుడు ఇతరులు ఎవరు టేకప్ చేస్తారు? అన్న చర్చ మొదలైంది.
By: Sivaji Kontham | 15 Nov 2025 9:21 AM ISTసూపర్ స్టార్ రజనీకాంత్ - ఉలగనాయగన్ కమల్ హాసన్ జోడీ కలిసి నటిస్తే అది అభిమానులకు పెద్ద పండుగే. ఇలాంటి అరుదైన కాంబినేషన్ కోసం దశాబ్ధాలుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఆ ఇద్దరూ కలిసి నటించే సినిమాకి సుందర్.సి దర్శకత్వం వహిస్తారని అధికారికంగా ప్రకటించారు. కానీ ఏం జరిగిందో ఈ ప్రాజెక్టుకు తాను దర్శకత్వం వహించబోనని అతడు ప్రకటించడం షాకిచ్చింది.
సుందర్ సి లాంటి సీనియర్ దర్శకుడు హ్యాండిల్ చేయలేని ప్రాజెక్టును ఇప్పుడు ఇతరులు ఎవరు టేకప్ చేస్తారు? అన్న చర్చ మొదలైంది. తమిళంలో దిగ్గజాలు అని చెప్పుకోదగ్గ చాలా మంది దర్శకులు ఉన్నారు. అయితే మురుగదాస్, లింగుస్వామి, కే.ఎస్. రవికుమార్ లాంటి పెద్ద తరం దర్శకులు ఇప్పటికే ఫ్లాపులతో రేసులో వెనకబడటంతో ఇప్పుడు అలాంటి వారికి ఈ అవకాశం ఉండకపోవచ్చు.
అయితే పాన్ ఇండియా ట్రెండ్ లో ఇరుగు పొరుగు భాషల ప్రముఖులతో కలిసి పని చేసేందుకు స్టార్లు వెనకాడటం లేదు. పైగా తమిళ స్టార్లతో పని చేయడానికి తెలుగు దర్శకులకు అభ్యంతరాలు ఉండవు. ధనుష్ కి వెంకీ అట్లూరి సార్ సినిమాతో విజయాన్ని అందించాడు. అంతకుముందే వారిసు రూపంలో విజయ్ లాంటి అగ్ర హీరోకి వంశీ పైడిపల్లి మంచి విజయాన్ని కట్టబెట్టాడు. వీళ్లు మాత్రమే కాదు... త్రివిక్రమ్, కొరటాల లాంటి ప్రతిభావంతులైన దర్శకులు రజనీ- కమల్ లాంటి అసాధారణ కాంబినేషన్ కోసం కథల్ని అందించి నేరుగా రంగంలోకి దిగితే అది వారి స్థాయిని మరింతగా ఎలివేట్ చేయడానికి మార్గాన్ని సుగమం చేయవచ్చు. త్రివిక్రమ్ ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో సినిమా కోసం పని చేస్తున్నాడు. కొరటాల `దేవర పార్ట్ 2` స్క్రిప్టుపై కసరత్తు చేస్తున్నారు. కానీ దర్శకుడిగా ప్రస్తుతం ఇంకా ఏదీ సెట్స్ లో లేదు. కాబట్టి ఈ ఇద్దరికీ చాలా వరకూ ఆస్కారం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఇద్దరు లెజెండరీ హీరోలను డీల్ చేసే రచనా నైపుణ్యం, దర్శకత్వ ప్రతిభ ఈ ఇద్దరికీ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.
మల్టీస్టారర్ ట్రెండ్ లో ఇలాంటి కలయిక చాలా హైప్ ని తెస్తుంది. దేశవిదేశాలలో ఫాలోయింగ్ తో పాటు, మార్కెట్ ఉన్న హీరోలతో కలిసి పని చేయడానికి మన దర్శకులు ఎప్పుడూ ఆసక్తిగా ఉన్నారు. అయితే రజనీకాంత్ మాస్ ఇమేజ్ ని, కమల్ హాసన్ క్లాస్ ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకుని మరో అరుదైన క్లాసిక్ ని తెరకెక్కించే పరిణతి ఇక్కడ చాలా కీలకం. ఇద్దరు లెజెండ్స్ ని డీల్ చేయదగిన స్క్రిప్టును ఎవరు అందిస్తారు? అనేది ముఖ్యం. కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిలింస్ లో ఈ సినిమాని నిర్మించనున్నారు. అయితే టాలీవుడ్ టై - అప్ లతో పని చేసేందుకు కమల్ హాసన్ సిద్ధంగానే ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. లెజెండ్స్ ని డీల్ చేయడానికి టాలీవుడ్ నుంచి ఏ దర్శకుడు ప్రయత్నిస్తారో వేచి చూడాలి.
