Begin typing your search above and press return to search.

టాలెంట్ ఉంది.. కానీ ఇప్పుడు ఈ ముగ్గురి దారి ఏంటి?

ఒక్క సినిమాతో దర్శకుడి కెరీర్ మారిపోవడం టాలీవుడ్‌లో చాలాసార్లు చూశాం. మొదటి ప్రయత్నంలోనే హిట్ కొడితే స్టార్ హీరోల నుంచి ఆఫర్లు వస్తాయి.

By:  M Prashanth   |   28 Oct 2026 12:06 PM IST
టాలెంట్ ఉంది.. కానీ ఇప్పుడు ఈ ముగ్గురి దారి ఏంటి?
X

ఒక్క సినిమాతో దర్శకుడి కెరీర్ మారిపోవడం టాలీవుడ్‌లో చాలాసార్లు చూశాం. మొదటి ప్రయత్నంలోనే హిట్ కొడితే స్టార్ హీరోల నుంచి ఆఫర్లు వస్తాయి. కానీ ఆ తర్వాత భారీ అంచనాలతో తీసిన సినిమా తేడా కొడితే పరిస్థితి మారిపోతుంది. ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల, బుచ్చిబాబు సానా, ఆదిత్య హాసన్ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. ముగ్గురిలో టాలెంట్ ఉన్నప్పటికీ, ఇటీవల వచ్చిన ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు.

'దసరా'తో శ్రీకాంత్ ఓదెలకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో నానితో మరోసారి 'ది ప్యారడైజ్'ను భారీ స్థాయిలో తెరకెక్కించారు. అయితే సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. మేకింగ్, కొన్ని ఎపిసోడ్స్‌కు ప్రశంసలు దక్కినా కథనంపై విమర్శలు వచ్చాయి. మరోవైపు చిరంజీవితో ప్రకటించిన సినిమా పరిస్థితి కూడా సందిగ్ధంలో పడింది. 'ప్యారడైజ్' ఆలస్యంతో ప్లానింగ్ మారిందని నాని చెప్పారు. మళ్లీ ఎప్పుడు మొదలుపెట్టాలనే విషయంపై ఇంకా మాట్లాడుకోలేదన్నారు. దీంతో ఆ కాంబినేషన్ ముందుకెళ్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

బుచ్చిబాబు పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. 'ఉప్పెన'తో భారీ విజయాన్ని అందుకున్న ఆయనకు రెండో సినిమాకే రామ్ చరణ్ దొరికారు. 'పెద్ది' కోసం ఏళ్ల తరబడి కష్టపడ్డారు. కానీ సినిమా అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయింది. కొన్ని ప్రాంతాల్లో మంచి వసూళ్లు వచ్చినా ఇతర మార్కెట్లలో నిరాశపరిచింది. ఇప్పుడు బుచ్చిబాబు దగ్గర మరో కథ సిద్ధంగా ఉంది. అయితే దానికి హీరో ఎవరో ఇంకా ఫైనల్ కాలేదు.

ఇక ఆదిత్య హాసన్‌కు '90స్' వెబ్ సిరీస్ ఊహించని గుర్తింపు తెచ్చింది. 'లిటిల్ హార్ట్స్' నిర్మాతగా కూడా మంచి విజయం అందుకున్నారు. కానీ దర్శకుడిగా తొలి థియేట్రికల్ ప్రయత్నం 'ఎపిక్' మాత్రం డిజాస్టర్ అయింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్ కూడా సినిమాను కాపాడలేకపోయింది. ముందుగానే ప్రకటించిన 'ఫైనల్ సెమిస్టర్' సీక్వెల్ పరిస్థితి కూడా ప్రశ్నార్థకంగా మారింది.

ఈ ముగ్గురిలో కామన్ పాయింట్ ఏంటంటే, మొదటి విజయంతోనే నిర్మాతల నమ్మకాన్ని సంపాదించుకున్నారు. కానీ తర్వాతి సినిమాల్లో ఆ స్థాయి ఫలితాలను అందుకోలేకపోయారు. శ్రీకాంత్‌కు భారీ మేకింగ్‌పై పట్టు ఉంది. బుచ్చిబాబు ఎమోషనల్ కథలను బాగా తెరకెక్కించగలరు. ఆదిత్యకు మధ్యతరగతి జీవితాలను వినోదాత్మకంగా చూపించగల సామర్థ్యం ఉంది. అయితే ఈ బలాలను మరోసారి బాక్సాఫీస్ దగ్గర నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ముఖ్యంగా శ్రీకాంత్ తర్వాతి సినిమాకు హీరో ఎవరనేది కీలకంగా మారింది. చిరంజీవి ప్రాజెక్ట్ కొనసాగితే మరో భారీ అవకాశం దక్కినట్లే. బుచ్చిబాబు విషయంలో ఎన్టీఆర్‌తో సినిమా ప్రచారం ఉన్నా అధికారిక ప్రకటన రాలేదు. అటు 'ఎపిక్' సీక్వెల్‌పై నిర్ణయం తీసుకునే ముందు నెట్‌ఫ్లిక్స్‌లో ప్రేక్షకుల స్పందన కూడా పరిశీలిస్తామని నిర్మాత నాగవంశీ చెప్పారు. మరి నెక్స్ట్ ట్రాక్ ఎలా ఉంటుందో చూడాలి.