Begin typing your search above and press return to search.

కొత్త పుంతలు తొక్కుతోన్న అగ్ర దర్శకులు!

టాలీవుడ్ ప్రాంతీయ సరిహద్దులు దాటి ప్రపంచ స్థాయికి చేరింది. ఈ క్రమంలో టాలీవుడ్ అగ్ర దర్శకులు కూడా తమ పాత ముద్రను పక్కన పెట్టి సరికొత్త ప్రయోగాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

By:  Srikanth Kontham   |   16 April 2026 5:00 PM IST
కొత్త పుంతలు తొక్కుతోన్న అగ్ర దర్శకులు!
X

టాలీవుడ్ ప్రాంతీయ సరిహద్దులు దాటి ప్రపంచ స్థాయికి చేరింది. ఈ క్రమంలో టాలీవుడ్ అగ్ర దర్శకులు కూడా తమ పాత ముద్రను పక్కన పెట్టి సరికొత్త ప్రయోగాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఒకప్పుడు ఒకే తరహా జోనర్‌లతో సక్సెస్ అందుకున్న దర్శకులు ఇప్పుడు గ్లోబల్ ఆడియన్స్‌ను మెప్పించాలంటే కొత్త కథలు, విభిన్నమైన జోనర్లు అవసరమని గుర్తించారు. అందుకే అగ్ర దర్శకులంతా రూట్ మార్చి కొత్త ప్రాజెక్టులతో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన దర్శకధీరుడు రాజమౌళి ఇప్పటి వరకు చ‌రిత్ర‌లో సంఘ‌ట‌న‌లు, పురాణ గాథలు, జానపద నేపథ్యం ఉన్న కథలతో మ్యాజిక్ చేశారు.

తదుపరి చిత్రం కోసం పూర్తి స్థాయి గ్లోబల్ కాన్సెప్ట్‌ను ఎంచుకున్నారు. సూప‌ర్ స్టార్ మహేష్ తో చేస్తోన్న వార‌ణాసి ని హాలీవుడ్ స్థాయిలో ఇండియానా జోన్స్ తరహా అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. ఇండియన్ రూటెడ్ స్టోరీస్ నుండి గ్లోబల్ యాక్షన్ జోనర్‌లోకి జక్కన్న అడుగు పెట్టడం అన్న‌ది ఎంతో ఆసక్తికరం. ఒక‌ప్పుడు మాస్ యాక్షన్ - రివెంజ్ డ్రామాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న దర్శకుడు అట్లీ ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి విలక్షణమైన ప్రయత్నం చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న రాకా పారలల్ వరల్డ్స్ (సమాంతర ప్రపంచాలు) అనే ఫాంటసీ కాన్సెప్ట్‌ని తీసుకున్నాడు.

తన రెగ్యులర్ కమర్షియల్ శైలిని పక్కన పెట్టి అట్లీ ఓ ఊహాజనిత ప్రపంచాన్ని సృష్టించాడు. బన్నీ కెరీర్‌లోనే ఇదో భారీ ప్రయోగంగా నిలవనుంది. అలాగే కేజీఎఫ్, సలార్ సినిమాలతో డార్క్ టోన్, భారీ యాక్షన్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో చేస్తోన్న సినిమా కోసం తన స్టైల్ ని ప‌క్క‌న బెట్టాడు. దుమ్ము, ధూళి, రక్తపాతం మాత్రమే కాకుండా ఎన్టీఆర్‌ను ఓ క్లాస్ అండ్ స్టైలిష్ యాక్షన్ హీరోగా చూపించ బోతున్నాడు. హ్యూమన్ ఎమోషన్స్ కు పెద్దపీట వేస్తూనే స్టైలిష్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రాన్ని మలుస్తున్నాడు. నీల్ సినిమాల్లో ఉండే ఆ ముదురు రంగుల ప్రపంచం కాకుండా? ఈసారి ఓ కొత్త విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిం చేలా చూస్తున్నాడు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గా ఫ్యామిలీ డ్రామాలు, క్లాస్ సినిమాలతో మెప్పిస్తారు. కానీ ఆయన తొలిసారిగా మైథలాజికల్ నేపథ్యం ఉన్న భారీ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటాలనుకుంటున్నారు. అలాగే సామాజిక అంశాలపై సినిమాలు తీసే శంకర్ కూడా రూట్ మార్చారు. వేల్పరి నవల ఆధారంగా ఓ పీరియాడిక్ వార్ డ్రామాను ప్లాన్ చేస్తున్నారు. ఇలా దర్శకులు తమ కంఫర్ట్ జోన్ దాటి చారిత్రక, పురాణ నేపథ్యాలను ఎంచుకోవడం ఇంట్రెస్టింగ్. దర్శకులంతా ఇలా కొత్త జోనర్లను అన్వేషించడం వల్ల ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన ట్రెండ్ కనిపిస్తోంది. ఇది బాక్సాఫీస్ వసూళ్లకే కాక‌ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడంలో తోడ్పడుతుంది. స్టార్ హీరోలు కూడా ప్రయోగాలకు సిద్ధమవ్వడం శుభపరిణామం. అగ్ర దర్శకులంతా చేస్తోన్న‌ ప్రయోగాలు సక్సెస్ అయితే? భవిష్యత్తులో మరిన్ని వైవిధ్యమైన కథలు వెండితెరపై ఆవిష్కృతమయ్యే అవకాశం ఉంది.