దర్శకుల ఇమేజ్ మేకోవర్ & కొత్త ప్రయోగాలు!
టాలీవుడ్‌లో ఒకే తరహా జోనర్లు, ఫార్ములా కథలకు పరిమితం కాకుండా ఇమేజ్ మేకోవర్ సాధిస్తూ వైవిధ్యమైన ప్రయోగాలతో ముందుకు రావడానికి దర్శకులు ఉవ్విళ్లూరుతున్నారు.
By: Srikanth Kontham | 29 Sept 2026 7:00 PM ISTటాలీవుడ్‌లో ఒకే తరహా జోనర్లు, ఫార్ములా కథలకు పరిమితం కాకుండా ఇమేజ్ మేకోవర్ సాధిస్తూ వైవిధ్యమైన ప్రయోగాలతో ముందుకు రావడానికి దర్శకులు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటివరకు నిర్మించుకున్న సేఫ్ జోన్ల నుంచి ధైర్యంగా బయటపడి విభిన్న కథాంశాలను ఎంచుకోవడం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఈ క్రమంలో `హిట్` ఫ్రాంచైజ్ వంటి ఇంటెన్స్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లతో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న దర్శకుడు శైలేష్ కొలను రూట్ పూర్తిగా మార్చారు. వరుస థ్రిల్లర్స్ తర్వాత ఆయన కథాంశాన్ని మార్చి `ఏమో ఏమో ఇది` పేరుతో ఓ క్యూట్ లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్నారు.
రోషన్ మేక హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం తో శైలేష్ కొలను తనలోని సరికొత్త శైలిని, హృదయానికి హత్తుకునే భావోద్వేగాలను పరిచయం చేస్తున్నారు. మరోవైపు `రాజా వారూ రాణి గారూ` వంటి సాఫ్ట్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాతో గుర్తింపు పొందిన దర్శకుడు రవికిరణ్ కోలా కూడా పెద్ద ప్రయోగానికే శ్రీకారం చుట్టారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలసి `రౌడీ జనార్ధన్` అనే ఫుల్ లెంగ్త్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకు చేసిన కథలకు పూర్తి భిన్నంగా, వైలెంట్ అండ్ ఇంటెన్స్ మాస్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటం రవికిరణ్ కోలా మేకింగ్‌లోని కొత్త కోణం హైలైట్ అవుతుంది.
అలాగే `శ్యామ్ సింగ రాయ్` వంటి పీరియాడికల్ విజువల్ డ్రామాతో ప్రశంసలు అందుకున్న దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ మరో బారీ ప్రయోగానికి పూనుకున్నారు. ఆయన విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లోనే `రణబాలి` పేరుతో ప్రీ-ఇండిపెండెన్స్ నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్ పీరియాడిక్ డ్రామాను ఆవిష్కరిస్తున్నారు. చారిత్రక అంశాలు, భావోద్వేగాలు కలబోతగా రూపొందుతున్న చిత్రం ద్వారా రాహుల్ సాంకృత్యన్ తన మేకింగ్ విజన్‌ను మరింత విస్తరిస్తున్నారు.
ఇక `అర్జున్ రెడ్డి`, `యానిమల్` చిత్రాలతో భారతీయ చిత్రసీమను ఆకర్శించిన సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తదుపరి అడుగు కూడా అంతే ఆసక్తికరంగా మారింది. `యానిమల్` అందించిన వైలెంట్ విజయం తర్వాత రెబెల్ స్టార్ ప్రభాస్‌తో `స్పిరిట్` అనే ఇంటెన్స్ పోలీస్ డ్రామా తెరకెక్కిస్తున్నారు. పవర్‌ఫుల్ కాప్ డ్రామాగా రానున్న ఈ చిత్రం సందీప్ విజన్‌ను, ప్రభాస్ మాస్ క్రేజ్‌ను కలిపి సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
టాలీవుడ్ దర్శకులు తమ కంఫర్ట్ జోన్‌ను దాటి, ఇమేజ్ మేకోవర్‌తో సరికొత్త సవాళ్లను స్వీకరిస్తుండటం పరిశ్రమకు ఎంతో ఆరోగ్యకరమైన పరిణామం. థ్రిల్లర్స్ నుంచి లవ్ స్టోరీల వరకు, సాఫ్ట్ డ్రామాల నుంచి హై-వోల్టేజ్ యాక్షన్ల వరకు విభిన్న శైలుల్లో సాగుతున్న ఈ ప్రయోగాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడమే కాకుండా టాలీవుడ్ స్థాయిని మరింత పెంచుతాయని భావించవచ్చు.
