Begin typing your search above and press return to search.

బుచ్చిబాబు బ‌లాబ‌లాల గురించి మీకెంత తెలుసు?

టాలీవుడ్‌లో ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి మొదటి సినిమాతోనే రికార్డులను తిరగరాసిన దర్శకుల్లో బుచ్చిబాబు సానా ఒక‌రు.

By:  Sivaji Kontham   |   15 Feb 2026 2:00 PM IST
బుచ్చిబాబు బ‌లాబ‌లాల గురించి మీకెంత తెలుసు?
X

టాలీవుడ్‌లో ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి మొదటి సినిమాతోనే రికార్డులను తిరగరాసిన దర్శకుల్లో బుచ్చిబాబు సానా ఒక‌రు. అత‌డి ప్రయాణం అత్యంత స్ఫూర్తిదాయకం. మెగా మేన‌ల్లుడికి `ఉప్పెన` లాంటి రికార్డ్ బ్రేకింగ్ డెబ్యూ ఇచ్చి చాలా ఆశ్చ‌ర్య‌ప‌రిచిన బుచ్చిబాబు, ఆ త‌ర్వాత ఏకంగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నే డైరెక్ట్ చేయ‌డం మ‌రో బిగ్ స‌ర్ ప్రైజ్.

చూడ‌టానికి కాస్త లీన్‌గా ఉన్నా కానీ, అత‌డి బ‌లాబ‌లాలేంటో తెలిస్తే షాక్ తిన‌కుండా ఉండ‌లేరు. అత‌డు ఎమోష‌న్స్ ని పండించ‌డంలో దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు అని తొలి సినిమాతోనే నిరూపించాడు. ప్రేమ కాన్సెప్టును ఒక రేంజులో ర‌క్తి క‌ట్టించే అద్భుత‌మైన అభిరుచి అత‌డికి ఉంద‌ని నిరూప‌ణ అయింది.

బుచ్చిబాబు సినీ నేపథ్యం లేని సాధారణ కుటుంబం నుండి వచ్చారు. ఆయన సోదరి ప్లాస్టిక్ సర్జన్ కావడంతో అత‌డు కూడా చదువులో స్థిరపడాలని కుటుంబం కోరింది. కుటుంబీకుల‌ సంతృప్తి కోసం ఎంబీఏ పూర్తి చేసినా కానీ... అత‌డి చూపులు ఎప్పుడూ సినిమాపైనే. గ్లామ‌ర్ రంగంలో ఏదైనా సాధించాల‌నే క‌సి అత‌డిలో క‌నిపించింది.

కాకినాడలో సుకుమార్ లెక్కల లెక్చరర్‌గా ఉన్నప్పుడే బుచ్చిబాబు ఆయనకు విద్యార్థి. ఆ అనుబంధంతోనే సుకుమార్ వద్ద ఆర్య 2, 100 ప‌ర్సంట్ లవ్, 1-నేనొక్కడినే, రంగస్థలం చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు.

సుకుమార్ మార్క్ ఎమోషన్స్ - డీటెయిలింగ్‌ను బుచ్చిబాబు బాగా ఒంటబట్టించుకున్నారు. అందుకే `ఉప్పెన` కథను సుకుమార్ కి చెప్పినప్పుడు, ఆ క్లైమాక్స్ విని ఆయన షాక్ అయ్యారు. `ఇలాంటి సాహసం ఎవరూ చేయరు` అని అర్థం చేసుకున్న సుక్కూ ఎంక‌రేజ్ చేసారు. బుచ్చిబాబు తన కథపై నమ్మకంతో మొండిగా ముందుకు వెళ్లారు.

సాధారణంగా ప్రేమకథల్లో ఉండే హీరో-విలన్ ఫైట్ కాకుండా, `మగతనం` అంటే భౌతికమైనది కాదు.. అది మనసుకి సంబంధించింది అనే పాయింట్‌తో క్లైమాక్స్ డిజైన్ చేయడం ఉప్పెన‌లో పెద్ద సర్ ప్రైజ్. ఇది ఆడియెన్ కి బిగ్ స‌ర్ ప్రైజ్ ఇచ్చింది. ప‌తాక స‌న్నివేశాన్ని అద్భుతంగా క్లిక్ చేయ‌డంలో ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా గుర్తింపు పొందాడు బుచ్చిబాబు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, కొత్త నటీనటులు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, సీనియ‌ర్ విజయ్ సేతుపతి లాంటి స్టార్‌ను విలన్‌గా ఎంచుకోవడంలోనే అత‌డి టెక్నిక్, అభిరుచి బ‌య‌ట‌ప‌డ్డాయి. మొదటి సినిమాతోనే 100 కోట్ల క్లబ్‌లో చేరిన అతికొద్ది మంది దర్శకుల్లో ఒక‌రిగా రికార్డుల‌కెక్కారు.

అయితే టాలీవుడ్ లో మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్లు కొట్టిన కొర‌టాల శివ‌, అనీల్ రావిపూడి, సందీప్ రెడ్డి వంగా త‌ర‌హాలోనే బుచ్చిబాబులోను ఒక యూనిక్ క్వాలిటీ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. పైన ఉద‌హ‌రించిన ఎవ‌రికీ అత‌డు తీసిపోడు. అయితే త‌న గురువు సుకుమార్ రేంజుకు ఎద‌గాల‌నే అత‌డి త‌ప‌న ఇప్పుడు చ‌ర్చ‌గా మారుతోంది. త‌న రెండో సినిమాకే రామ్ చ‌ర‌ణ్ లాంటి అగ్ర క‌థానాయ‌కుడితో ప‌ని చేస్తున్నాడు. చ‌ర‌ణ్ ని పెద్దిగా ఆవిష్క‌రిస్తున్నాడు. క్రీడా నేప‌థ్య క‌థ‌తో అత‌డు మ‌రోసారి మ్యాజిక్ చేస్తాడ‌ని అంతా భావిస్తున్నారు.

30 ఏప్రిల్ 2026న విడుదల కాబోతున్న పెద్ది చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కూడా ఉప్పెన లాగే ఎమోషన్స్ ని క్యారీ చేస్తుంది. ఇక త‌ను ప‌ని చేస్తున్న రెండో సినిమాకే ఆస్కార్ గ్ర‌హీత ఏ.ఆర్.రెహ‌మాన్ ని, శ్రీ‌దేవి కుమార్తె జాన్వీని బ‌రిలో దించాడంటే బుచ్చిబాబులో ఎంబీయే ట్యాలెంట్ ని అంత తేలిగ్గా చూడ‌లేం. ఈరోజు(15 ఫిబ్ర‌వ‌రి) బుచ్చిబాబు బ‌ర్త్ డే.. అత‌డికి ప్ర‌త్యేకించి శుభాకాంక్ష‌లు.