Begin typing your search above and press return to search.

మోడ్ర‌న్ సినిమాలో ప‌రుచూరి శైలి పంచ్‌ల‌కు కాలం చెల్లిందా?

ఒకప్పుడు పరుచూరి బ్రదర్స్ వంటి రచయితల భారీ డైలాగులు సినిమాలకు ప్రత్యేక ఆకర్షణగా ఉండేవి. కానీ ఇప్పుడు జెన్ జీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా డైలాగ్ రైటింగ్ మారుతోంది. పంచ్ డైలాగులు, సుదీర్ఘ సంభాషణల కంటే షార్ట్ డైలాగులు, విజువల్స్, ఎలివేషన్లకు దర్శకులు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ప్రత్యేక డైలాగ్ రైటర్ల ప్రాధాన్యత కూడా తగ్గుతోంది.

By:  Sivaji Kontham   |   12 Nov 2026 9:45 AM IST
మోడ్ర‌న్ సినిమాలో ప‌రుచూరి శైలి పంచ్‌ల‌కు కాలం చెల్లిందా?
X

టాలీవుడ్ స్వ‌ర్ణ‌యుగంలో ద‌శాబ్ధాల పాటు మేటి ర‌చ‌యిత‌లుగా ప‌రుచూరి బ్ర‌దర్స్. దిగ్గ‌జ ర‌చ‌యిత‌లు వంద‌లాది చిత్రాల విజ‌యాల్లో కీల‌క పాత్ర‌ను పోషించారు. నేటి అగ్ర హీరోలంద‌రూ ప‌రుచూరి సోద‌రుల మాట‌ల‌కు ఫిదా అయిన‌వారే. అయితే కాలం చాలా మారింది. కాలంతో పాటే మార్పు. డైలాగ్ రైటింగ్ పంథా కూడా పూర్తిగా మారిపోయింది. యువ‌త‌రం అంత‌గా పంచ్ లు, అతిశ‌యోక్తి సంభాష‌ణ‌లు లేదా టూమ‌చ్ సెంటిమెంట్ డైలాగులు వినేందుకు ఆస‌క్తిగా లేదు. బ‌హుశా జెన్ - జి ఆలోచ‌న‌ల‌కు త‌గ్గ‌ట్టుగానే త‌మ బాణీని నేటిత‌రం ద‌ర్శ‌క‌ ర‌చ‌యిత‌లు సెట్ చేసుకున్నారు.

నిజానికి పరుచూరి బ్రదర్స్, సత్యానంద్ వంటి సీనియ‌ర్ రైటర్లు సినిమాలను ఒక నాటకంలా డ్ర‌మ‌టిగ్గా మలిచేవారు. హీరో- విలన్ మధ్య జరిగే మాటల యుద్ధాలు.. కుటుంబ సెంటిమెంట్ క‌థ‌లు, సుదీర్ఘమైన డైలాగ్ లు అప్ప‌ట్లో సినిమా విజయానికి కార‌ణ‌మ‌య్యేవి...

ప్రస్తుత ట్రెండ్ లో పాన్-ఇండియా సినిమాలొచ్చాక.. భారీ డైలాగ్స్ కంటే విజువల్స్.. స్టైలిష్ ఎలివేషన్స్.. నేపథ్య‌ సంగీతం.. వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మాటల కంటే యాక్షన్ కొరియోగ్రఫీ.. సైలెంట్ ఎక్స్‌ప్రెషన్ల తో మాస్ మూమెంట్స్ పండిస్తున్నారు.

స్టార్ డైరెక్ట‌ర్లు రాజ‌మౌళి, సుకుమార్, ప్ర‌శాంత్ నీల్ వంటి వారు సొంతంగా డైలాగులు రాసుకోవ‌డం వ‌ల్ల కూడా అతిశ‌యోక్తి డైలాగులు వినిపించడం లేదు.. వీరంతా విజువ‌ల్స్.. ఎలివేష‌న్స్ పైనే దృష్టి సారిస్తున్నారు.. ఇది కూడా మోడ్ర‌న్ సినిమాలో కొత్త ట్రెండ్ గా మారింది. ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చే కొత్త డైరెక్ట‌ర్ల‌కు కూడా ఒక‌ప్ప‌టి లాగా పాత ఫార్ములాతో డైలాగులు రాయించే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

ఇటీవ‌లి కాలంలో విజువ‌ల్ బ్యూటీపై ఉన్న ఫోక‌స్ అన‌వ‌స‌ర అతిశ‌యోక్తి సీన్ల‌పై లేనే లేదు. అందుకే బ‌హుశా రైటింగ్ శైలి మారింద‌ని అనుకోవ‌చ్చు. ఒక‌ప్పుడు ఇండ‌స్ట్రీలో అర‌డ‌జ‌ను మంది ఫేమ‌స్ ర‌చ‌యిత‌లు ఉండేవారు. ఇప్పుడు ప్ర‌తి కాంపౌండ్ లో స్పెషలిస్టు రైట‌ర్లు ఉన్నారు. టాలీవుడ్ ఇటీవ‌ల చాలా ప‌రివ‌ర్త‌న చెందింద‌న‌డానికి ఇది ఒక సంకేతం.

ఒక‌ప్పుడు నిర్మాత ప్రత్యేకంగా డైలాగ్ రైటర్లను లేదా స్క్రీన్ ప్లే రైటర్లను నియమించు కునేవారు. దర్శకుడితో కలిసి రైటర్లు ప్రత్యేకంగా పనిచేసేవారు. కానీ నేడు అంద‌రూ ర‌చ‌యిత‌లే. ఎవ‌రికి వారు సొంతంగా న‌వ‌త‌రం ర‌చ‌యిత‌ల‌తో టీమ్ లు ఏర్పాటు చేసుకుని ర‌చ‌న‌లు చేయ‌డం ప్రారంభించారు. త‌మ అభిరుచికి త‌గ్గ‌ట్టుగానే ద‌ర్శ‌క‌ నిర్మాత‌లు స్క్రిప్టుల్ని రాయించు కుంటున్నారు. ఒక‌ప్ప‌టిలాగా విడివిడిగా `డైలాగ్ రైటర్`గా పనిచేసే సంస్కృతి చాలా వరకు తగ్గిపోయింది.

గ‌తంలో డైలాగ్ రైట‌ర్ కి ప్ర‌త్యేక గుర్తింపు ఉండేది. కాస్త క‌ఠిన‌మైన ప‌దాల‌తో.. బరువైన తెలుగు పదజాలంతో సాగే నాటకీయమైన సంభాష‌ణ‌లు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఈలలు వేయించేవి. కానీ ప్రస్తుతం సోషల్ మీడియా రీల్స్, మీమ్స్ ట్రెండ్‌కు తగినట్లుగా డైలాగ్స్ చాలా షార్ట్‌గా.. క్రిస్ప్‌గా.. ఇన్‌స్టంట్ ఇంపాక్ట్ ఇచ్చేలా ఉంటున్నాయి. దీనివల్ల మాస్ ఎలివేషన్స్ త్వరగా రీచ్ అయినా కానీ.. పాత సినిమాల్లో ఉన్నంత డెప్త్ తో భావోద్వేగాలు కొన్నిసార్లు మిస్ అవుతున్నాయనే వాద‌న కూడా ఉంది. కానీ మునుప‌టిలా అన‌వ‌స‌ర‌మైన అతిశయోక్తి డైలాగుల‌కు నేటి జెన్ జి ప‌డిపోవ‌డం లేదు. అందుకే డీసెంట్ డైలాగ్స్ తోనే ర‌చ‌యిత‌లు ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప్ర‌ఖ్యాత హాలీవుడ్ ర‌చ‌యిత డిఫైన్ చేసిన‌ట్టు.. ``ఎంత త‌క్కువ డైలాగ్స్ ఉంటే అంత గొప్ప విజువ‌ల్ ట్రీట్ సినిమాలో ఉన్న‌ట్టు``.. ఇప్పుడు అదే త‌ర‌హా మేకింగ్ కోసం యువ‌త‌రం క్రియేట‌ర్లు త‌హ‌త‌హ‌లాడ‌టం గొప్ప మ‌లుపు.