నడి రోడ్డుపై నిలబెట్టి కొడతామని సుమలత మాస్టర్ హెచ్చరిక.. ఫెడరేషన్‌పైనా ఫైర్!
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (TFIEF) - డాన్సర్స్ అసోసియేషన్ మధ్య రాజుకున్న వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది.
By: Sivaji Kontham | 31 Aug 2026 10:52 PM ISTతెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (TFIEF) - డాన్సర్స్ అసోసియేషన్ మధ్య రాజుకున్న వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. తమ అసోసియేషన్‌పై ఫెడరేషన్ సహాయ నిరాకరణ ప్రకటించడంపై డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత (జానీ మాస్టర్ సతీమణి) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ చట్టపరమైన రూల్ ప్రకారం నోటీసులు కూడా ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఫెడరేషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని... నిన్న నిర్వహించిన అడ్హాక్ కమిటీ మీటింగ్ ఎంతమాత్రం చెల్లదని తేల్చి చెప్పారు.
గతంలో అవినీతికి పాల్పడి అసోసియేషన్ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తులతో అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేయడంపై సుమలత మండిపడ్డారు. తప్పు చేసిన వారికి ఫెడరేషన్ మద్దతు ఇవ్వడం విడ్డూరంగా ఉందని.. ఇలాంటి అక్రమ కమిటీలకు చట్టపరంగా (లీగల్‌గా) ఎలాంటి గుర్తింపు లేదా అధికారాలు ఉండవని స్పష్టం చేశారు. తమ పాలకవర్గం ప్రజాస్వామ్యబద్ధంగా... ఎలక్షన్ ఆఫీసర్ సమక్షంలో ఓటింగ్ ద్వారా ఎన్నికైందని.. నియమ నిబంధనల ప్రకారమే సభలు, నిర్ణయాలు జరుగుతున్నాయని సమర్థించుకున్నారు.
ఈ సందర్భంగా అసోసియేషన్‌లో లొసుగులు సృష్టించే వారికి సుమలత మాస్ వార్నింగ్ ఇచ్చారు. దాదాపు 35 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన తమ యూనియన్‌ను ముక్కరాజు మాస్టర్ ఎంతో కష్టపడి నిర్మించారని గుర్తుచేశారు. ఎవరో ఫ్రాడ్ చేసిన వ్యక్తులు వచ్చి యూనియన్‌ను రెండు ముక్కలుగా విడదీయాలని కుట్రలు పన్నితే ఊరుకునేది లేదని.. అలాంటి వారిని ``నడిరోడ్డుపై నిలబెట్టి కొడతాం`` అంటూ ఘాటుగా హెచ్చరించారు. గూడుపుఠాణీ రాజకీయాలు చేస్తూ యూనియన్ విచ్ఛిన్నానికి పాల్పడేవారు ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలని తీవ్ర స్థాయిలో నిలదీశారు.
ఈ సమస్య కేవలం డాన్సర్స్ అసోసియేషన్‌తోనే ముగిసిపోదని... ఫెడరేషన్ పరిధిలోని మిగతా 23 క్రాఫ్ట్ అసోసియేషన్లకు కూడా భవిష్యత్తులో ఇలాంటి భంగపాటు తప్పదని సుమలత ఆందోళన వ్యక్తం చేశారు. అవసరమైతే తాము కూడా సమాంతరంగా నాలుగు కొత్త యూనియన్లను ఏర్పాటు చేసుకుని ఫెడరేషన్‌కే సహాయ నిరాకరణ చేయగలమని స్పష్టం చేశారు. తమ హక్కుల సాధన కోసం ఎంతటి న్యాయపోరాటానికైనా సిద్ధమని.. ఈ అన్యాయాన్ని చట్టబద్ధంగా ఎండగడతామని సుమలత ఘంటాపథంగా పేర్కొన్నారు.
ఫెడరేషన్ ఏకపక్ష వైఖరిని నిరసిస్తున్నాము:
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ , డాన్సర్స్ అసోసియేషన్ నడుమ నెలకొన్న వివాదంలో ఫెడరేషన్ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఫెడరేషన్‌లోని కొందరు వ్యక్తులు తమకు నచ్చినట్లు నడుచుకుంటూ.. ``మీరు నాకు ఓటు వేయలేదు`` అనే వ్యక్తిగత కక్షలతో నిర్ణయాలు తీసుకుంటున్నారని డాన్సర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా సభ్యులు ఎన్నుకున్న నాయకులను అంగీకరించకుండా.. ప్రశ్నించే వారిపై అక్రమంగా సహాయ నిరాకరణ విధించడం అత్యంత శోచనీయమని పేర్కొన్నారు. గతంలో మాదిరిగా తలొగ్గి ఉండకుండా తమ హక్కుల కోసం నిలబడటమే ఫెడరేషన్ నాయకుల అభద్రతా భావానికి ముఖ్య కారణమని సుమలత మద్ధతుదారులు విమర్శించారు.
సమస్యలను పక్కన పెట్టి అసోసియేషన్ స్వయంప్రతిపత్తిని దెబ్బతీసేందుకు ఫెడరేషన్ ప్రయత్నిస్తుండటంతో.. డాన్సర్స్ అసోసియేషన్ చట్టబద్ధమైన మార్గాన్ని ఎంచుకుంది. ఫెడరేషన్ ద్వారా కాకుండా నేరుగా ప్రభుత్వ కార్మిక శాఖ (లేబర్ డిపార్ట్‌మెంట్) అధికారులతో సంప్రదింపులు జరిపి... వారి పర్యవేక్షణలోనే పారదర్శకంగా ఎన్నికలు జరిపించేందుకు అవసరమైన అనుమతులు, షెడ్యూల్‌ను కూడా సాధించుకుందని, చిత్ర పరిశ్రమలోని నిర్మాతలకు ఎటువంటి భంగం కలగకూడదని... వారి క్షేమమే కార్మికులకు ఉపాధినిస్తుందని స్పష్టం చేసిన అసోసియేషన్ నేతలు, తమపై జరుగుతున్న అన్యాయాలపై ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ఉద్ఘాటించారు.
