ప్రేక్షకులే మారారా.. లేక దర్శకుల ఫోకస్ తప్పిందా?.. కామెడీ సినిమాలపై పెద్ద ప్రశ్న!
ఒకప్పుడు థియేటర్లలో అడుగుపెడితే చాలు.. కడుపుబ్బా నవ్వుకుని, హాయిగా రిలాక్స్ అయి బయటకు వచ్చేవారం.
By: Madhu Reddy | 19 May 2026 5:00 PM ISTఒకప్పుడు థియేటర్లలో అడుగుపెడితే చాలు.. కడుపుబ్బా నవ్వుకుని, హాయిగా రిలాక్స్ అయి బయటకు వచ్చేవారం. కానీ ఈ మధ్య కాలంలో థియేటర్లలో పూర్తి స్థాయి కామెడీ సినిమాలు వెతకాల్సి వస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ మేకర్స్ అందరూ యాక్షన్, సస్పెన్స్, భారీ బడ్జెట్ సినిమాలపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో థియేటర్లలో నవ్వులు కరువయ్యాయనేది సినిమా లవర్స్ మాట. అసలు మన సినిమాల్లో కామెడీ ఎందుకు తగ్గిపోయింది? ప్రేక్షకులు మారిపోయారా లేక దర్శకులే నవ్వించడం మర్చిపోయారా?
అప్పటి గోల్డెన్ డేస్ వేరు:
ఒకప్పుడు టాలీవుడ్‌లో కామెడీ సినిమాల హవా నడిచేది. నువ్వు నాకు నచ్చావ్, నువ్వు లేక నేను లేను, మల్లేశ్వరి, వెంకీ, దుబాయ్ శీను,సంతోషం, అతడు లాంటి సినిమాలు ఇప్పటికీ టీవీల్లో వస్తే చానల్ మార్చకుండా చూస్తాం. ఆ సినిమాల్లో కథతో పాటు మొదట్నుంచి చివరి వరకు కామెడీ పండించేవాళ్లు. థియేటర్లన్నీ నవ్వులతో మార్మోగిపోయేవి. అప్పట్లో కేవలం నవ్వుకోవడానికే జనాలు ఎగబడి థియేటర్లకు వెళ్లేవాళ్లు.
పాన్ ఇండియా మోజులో పడ్డారా?:
ప్రస్తుతం టాలీవుడ్ దర్శకుల ఫోకస్ మొత్తం 'పాన్ ఇండియా' సినిమాలపైనే ఉంది. వందల కోట్ల బడ్జెట్, భారీ యాక్షన్ సీన్లు, గ్రాఫిక్స్, ఎలివేషన్లకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాలో బలమైన కామెడీ ట్రాక్‌లను సెట్ చేయడం దర్శకులు తగ్గించేశారు. ఇక పెద్ద హీరోల సినిమాల్లో కూడా కథకు తగ్గట్టుగా అక్కడక్కడా చిన్నపాటి హాస్యాన్ని మాత్రమే జోడిస్తున్నారు తప్ప.. ఫుల్ లెంగ్త్ కామెడీ ఉండట్లేదు.
పది నిమిషాల కామెడీ మాత్రమేనా?:
ఇప్పుడు థియేటర్లలో వస్తున్న చాలా సినిమాల్లో కామెడీ అని ప్రచారం చేస్తున్నప్పటికీ.. తీరా లోపలికి వెళ్తే సీన్ రివర్స్ అవుతోంది. సినిమాలో ఎక్కడో ఒక పది, పదిహేను నిమిషాలు తప్ప సినిమా మొత్తం నవ్వించే సీన్లు ఉండటం లేదు. ఇక దీంతో ఫ్యూర్ కామెడీ సినిమా చూద్దామని థియేటర్లకు వెళ్లే ప్రేక్షకుడికి నిరాశే ఎదురవుతోంది.
ఓటీటీల వైపు చిన్న సినిమాలు:
మరోవైపు కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకునే చిన్న, తక్కువ బడ్జెట్ కామెడీ సినిమాలు ఇప్పుడు థియేటర్లకు రావడం బాగా తగ్గాయి. ఒకవేళ వచ్చినా వాటిని జనాలు థియేటర్లలో చూడటానికి పెద్దగా ఇష్టపడట్లేదు. ఇలాంటి నవ్వుల సినిమాలన్నీ నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలోనే రిలీజ్ అవుతున్నాయి. ప్రేక్షకులు కూడా వీటిని ఇంట్లో కూర్చుని మొబైల్స్ లేదా టీవీల్లోనే చూసేస్తున్నారు.
ప్రేక్షకుల అభిరుచి మారిందా?:
ప్రేక్షకులు కూడా ఇంతకుముందులాగా థియేటర్లలో భారీగా కామెడీని ఆశించట్లేదు అనే వాదన కూడా ఒకటుంది. టికెట్ రేట్లు పెరిగిపోవడంతో.. భారీ విజువల్స్, యాక్షన్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉంటేనే థియేటర్లకు వెళ్తామని చాలామంది ఫిక్స్ అయిపోతున్నారు. ఇక నవ్వుకోవడానికి రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, ఓటీటీలు ఉన్నాయి కదా అనే మైండ్‌సెట్‌కు ఆడియన్స్ వచ్చేసినట్టు కనిపిస్తోంది.
ఏది ఏమైనా, వందల కోట్ల యాక్షన్ సినిమాలు ఎన్ని వచ్చినా.. థియేటర్లలో అందరితో కలిసి నవ్వడంలో ఉండే మజాయే వేరు. కేవలం యాక్షన్, సస్పెన్స్ మాత్రమే కాకుండా.. భవిష్యత్తులో మన దర్శకులు మళ్లీ ఓల్డ్ మూవీస్ లాంటి అవుట్ అండ్ అవుట్ క్లీన్ కామెడీ సినిమాలను థియేటర్లలోకి తెస్తారని ఆశిద్దాం..
