Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌లో బాల‌ల సినిమాల‌కు ప్రాధాన్య‌త త‌గ్గిందా?

తెలుగు చలనచిత్ర పరిశ్రమ (టాలీవుడ్) చరిత్రలో బాలల చిత్రాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది.

By:  Sivaji Kontham   |   24 July 2026 9:14 AM IST
టాలీవుడ్‌లో బాల‌ల సినిమాల‌కు ప్రాధాన్య‌త త‌గ్గిందా?
X

తెలుగు చలనచిత్ర పరిశ్రమ (టాలీవుడ్) చరిత్రలో బాలల చిత్రాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే జాతీయ చలనచిత్ర పురస్కారాల స్థాయిలో `ఉత్తమ బాలల చిత్రం` విభాగంలో అవార్డు దక్కించుకోవడం అనేది చాలా అరుదుగా జరిగే అద్భుతం. దశాబ్దాల టాలీవుడ్ చరిత్రలో చాలా తక్కువ సినిమాలు మాత్రమే ఈ అత్యున్నత జాతీయ గౌరవాన్ని అందుకుని చరిత్ర పుటల్లో నిలిచాయి.

గత రెండు దశాబ్దాల కాలాన్ని పరిశీలిస్తే..టాలీవుడ్‌లో బాలల చిత్రాల నిర్మాణం పెరిగినా జాతీయ స్థాయిలో ఉత్తమ బాలల చిత్రంగా నిలవడం సవాలుగా మారింది. సినిమా చరిత్రలోనే కొన్ని దశాబ్దాల వ్యవధిలో వేళ్లమీద లెక్కపెట్టదగిన చిత్రాలకు మాత్రమే ఈ ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. ఈ నేపథ్యాన్ని గమనిస్తే... జాతీయ స్థాయిలో ప్రతిభను చాటుకోవడం ఎంత కష్టమో అర్థమవుతుంది.

గతంలో గుణశేఖర్ దర్శకత్వంలో అంద‌రూ చిన్నారులతో తెరకెక్కించిన `బాల రామాయణం` చిత్రం జాతీయ స్థాయిలో `ఉత్తమ బాలల చిత్రం`గా అవార్డును గెలుచుకుని సంచలనం సృష్టించింది. ఆ తర్వాత సుదీర్ఘ కాలం పాటు టాలీవుడ్‌కు ఈ విభాగంలో జాతీయ అవార్డు దక్కలేదు. సరిగ్గా 30 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్లీ `35 - చిన్న కథ కాదు` చిత్రానికి ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ అవార్డు రావడం నిజంగా మామూలు విషయం కాదు.

ఇంతటి ఘనత‌ను సాధించిన `35 - చిన్న కథ కాదు` సినిమా వెనుక నిర్మాతలు సృజన, సిద్ధార్థ్‌ల కృషి ఎంతో ఉంది. వీరు అత్యంత వైవిధ్యమైన ఆలోచనలు ఉన్న నిర్మాతలు. ఒక వైవిధ్యమైన, చిన్న పిల్లల కథాంశంతో కూడిన సినిమాను నమ్మి.. దానికి నిర్మాణ రూపం ఇవ్వాలంటే ఎంతో ధైర్యం కావాలి. వారి నమ్మకానికి, ధైర్యానికి ప్రతిఫలంగానే ఈరోజు ఈ జాతీయ పురస్కారం దక్కింది.

ఈ జాతీయ అవార్డు సాధించిన ఉత్సాహంంతోనే `చిన్న కథ కాదు` అనే ఊతపదం ఈరోజు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ఇది కేవలం ఒక సినిమా సాధించిన విజయం మాత్రమే కాదు... మొత్తం తెలుగు చలనచిత్ర పరిశ్రమకే దక్కిన గొప్ప గౌరవం. చిన్న సినిమాలకు, వైవిధ్యమైన కథాంశాలకు ఈ అవార్డు కొత్త ఊపిరి పోసిందనడంలో సందేహం లేదు.

పాన్ ఇండియా రేసులో పిల్లలకు చోటేది?

ప్రస్తుతం మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు రూ. 100 కోట్లు, రూ. 500 కోట్ల క్లబ్‌లు.. మాస్ ఎలిమెంట్స్.. యాక్షన్ సీక్వెన్సెస్, గ్లోబల్ మార్కెట్ వెనుకే పడుతున్నారు. పిల్లల సినిమాలకు కమర్షియల్‌గా పెద్దగా వసూళ్లు రావు అనే అపోహ లేదా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడకపోవడం కూడా ఈ విభాగంపై శ్ర‌ద్ధ పెట్ట‌క‌పోవ‌డానికి ప్రధాన కారణం. గ్రావిటీకి అందని స్టంట్లు.. భారీ విజువల్ ఎఫెక్ట్స్ మాత్రమే థియేటర్లకు జనాన్ని రప్పిస్తాయనే భావన పెరిగిపోయింది. అయితే పాన్ ఇండియా వెల్లువ‌లో కొట్టుకుపోకుండా.. ఏడాదికి క‌నీసం అర‌డ‌జ‌ను చిత్రాలు అయినా బాల‌ల‌పై తెర‌కెక్కితే అవార్డుల‌లోను విక‌సించే అవ‌కాశం ఉంటుంద‌ని కొంద‌రు విశ్లేష‌కులు సూచిస్తున్నారు.

స్పెషల్ ఫండింగ్ అవ‌స‌రం:

ప్రభుత్వం లేదా చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీలు ఔత్సాహిక నిర్మాత‌ల‌కు ప్రోత్సాహకాలు అందించడం.. అలాగే ప్రస్తుతం ఉన్న ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లు చిన్న బడ్జెట్ బాలల చిత్రాలను ఆదరిస్తే తప్ప టాలీవుడ్‌లో ఈ కేటగిరీకి మళ్లీ పూర్వ వైభవం రావడం కష్టం. పాన్ ఇండియా వలయంలో పడి మన సొంత కథలను..ముఖ్యంగా భ‌విష్య‌త్ తరానికి (పిల్లలకు) కావలసిన స్వచ్ఛమైన సినిమాటిక్ అనుభవాన్ని అందించడంలో టాలీవుడ్ మ‌రింత దృష్టి సారించాల్సి ఉంది.