Begin typing your search above and press return to search.

సినిమాలకు సోల్ మేట్ గా మారుతున్న చిన్నారులు.. లిస్ట్ పెద్దదే?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం చైల్డ్ ఆర్టిస్ట్‌లు తమ అద్భుతమైన నటన, కామెడీ టైమింగ్, భావోద్వేగాలతో స్టార్ హీరోలతో సమానంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

By:  Madhu Reddy   |   25 Aug 2026 5:00 PM IST
సినిమాలకు సోల్ మేట్ గా మారుతున్న చిన్నారులు.. లిస్ట్ పెద్దదే?
X

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం చైల్డ్ ఆర్టిస్ట్‌లు తమ అద్భుతమైన నటన, కామెడీ టైమింగ్, భావోద్వేగాలతో స్టార్ హీరోలతో సమానంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కేవలం కథలో భాగం అవ్వడమే కాకుండా, సినిమాను మలుపు తిప్పే కీలక పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నారు. ఎమోషన్స్ బలంగా పండాలన్నా, స్క్రీన్‌పై నవ్వులు పూయాలన్నా చిన్నారులే అసలైన ‘సోల్ మేట్’ అని నిరూపిస్తున్న ఈ బుడతల సక్సెస్ జర్నీపై ఓ లుక్ వేద్దాం..

'ఇరుముడి'లో అలరించిన బేబీ నక్షత్ర:

మాస్ మహారాజా రవితేజ నటించిన 'ఇరుముడి' చిత్రంలో 'మణమ్మ' (మణికంఠ) పాత్రలో నటించి బేబీ నక్షత్ర అందరి మనసులను గెలుచుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఈ చిన్నారి టాలెంట్‌ను గుర్తించిన దర్శకుడు శివ నిర్వాణ ఈ పాత్రకు ఎంపిక చేశారు. ప్రస్తుతం 7వ తరగతి చదువుతున్న నక్షత్ర, తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ నటిస్తూ సక్సెస్ మీట్లలో తన మాటలు, డ్యాన్స్‌లతో సోషల్ మీడియాను ఊపేస్తోంది.

'సంక్రాంతికి వస్తున్నాం' బుల్లిరాజు రేవంత్:

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రంలో 'బుల్లిరాజు' పాత్రలో నటించి థియేటర్లలో నవ్వులు పూయించాడు మాస్టర్ రేవంత్ భీమల. ఇక గోదావరి యాసలో ఈ బుడ్డోడు చెప్పిన డైలాగులు, టైమింగ్ సినిమా ఫస్టాఫ్‌కే ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అలాగే 'మన శంకర వర ప్రసాద్' చిత్రంలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

'బింబిసార'లో క్రూరుడిని మార్చిన శ్రీదేవి బంగారం:

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన సోషియో-ఫాంటసీ చిత్రం 'బింబిసార'లో చిన్నారి శ్రీదేవి బంగారం కీలక పాత్ర పోషించింది. క్రూరుడైన రాజు బింబిసారుడి మనసును మార్చే చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఈమె పండించిన సెంటిమెంట్, సినిమా విజయానికి ఎంతగానో తోడ్పడింది. ఈమె ఇప్పటికే పలు సినిమాలు, ధారావాహికల్లో నటించి మెప్పించింది.

'హాయ్ నాన్న' ఎమోషనల్ క్వీన్ కియారా ఖన్నా:

'హాయ్ నాన్న' చిత్రంలో నాని కూతురు 'మహి' పాత్రలో బేబీ కియారా ఖన్నా ఒలికించిన భావోద్వేగాలు ప్రేక్షకులను కంటతడి పెట్టించాయి. తండ్రీకూతుళ్ల అనుబంధం చుట్టూ తిరిగే కథలో ఎలాంటి కృత్రిమత్వం లేకుండా కియారా పండించిన సహజ నటన సినిమాకే ఆత్మగా నిలిచింది. అలాగే 'సరిపోదా శనివారం' వంటి చిత్రాల్లో కార్తీక కృష్ణ కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు

సినిమాలకు ప్లస్ పాయింట్:

సినిమాలో చిన్న పిల్లల పాత్రలు ఉంటే కుటుంబ ప్రేక్షకులు, ముఖ్యంగా పిల్లలు థియేటర్లకు ఎక్కువగా క్యూ కడతారు. చిన్నారులు పండించే అమాయకత్వం, కామెడీ మరియు సెంటిమెంట్ థియేటర్లలో ఈలలు, చప్పట్లు కొట్టిస్తాయి. ఇక కథను నడిపించే శక్తిగా మారుతున్న ఈ బాలనటులను ప్రోత్సహిస్తూ సినిమాలు తెరకెక్కిస్తున్న దర్శకుల ప్రయత్నం నిజంగా అభినందించదగినది.