Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: టాప్ -10 క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులకు డిమాండ్ త‌గ్గిందా?

మొత్తానికి కొత్త ఆర్టిస్టుల‌ పోటీ పెరిగినా సీనియర్ ఆర్టిస్టులు తమకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్ వాల్యూను కాపాడుకుంటూనే మరోవైపు మార్కెట్ వాస్తవాలకు తగినట్లుగా తమ ప్యాకేజీలను మార్చుకుంటున్నారు.

By:  Sivaji Kontham   |   14 Sept 2026 11:50 AM IST
టాప్ స్టోరి: టాప్ -10 క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులకు డిమాండ్ త‌గ్గిందా?
X

టాలీవుడ్‌లో కొత్తతరం నటుల దూకుడుతో పాటు ఇతర భాషల నుంచి వస్తున్న ఆర్టిస్టుల తాకిడి పెరగడంతో ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టుల హవా కొంతవరకు తగ్గుముఖం పట్టింది. తెలుగు తెరపై నిత్యం కనిపించే ప్రకాష్ రాజ్ ఇప్పుడు తన ప్రాజెక్ట్‌ల ఎంపికలో పూర్తిగా సెలెక్టివ్‌గా మారిపోయారు. అలాగే లెజెండరీ నటుడు బ్రహ్మానందం, వరుస విలన్ - క్యారెక్టర్ రోల్స్ చేసిన సునీల్ స్పీడ్ కూడా గతంతో పోలిస్తే చాలా నెమ్మదించింది. బలమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సంపత్ రాజ్ కూడా ఇప్పుడు తెరపై తక్కువగా కనిపిస్తుండగా.. సచిన్ ఖేడేకర్, రోహిణి లాంటి తార‌లైతే టాలీవుడ్‌లో పూర్తిగా కనిపించకుండా పోయారు.

మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈ సీనియర్ నటుల పారితోషికాల విషయంలో చిత్ర పరిశ్రమలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఒకప్పుడు రోజుకు రూ. 3 లక్షల నుండి రూ. 5 లక్షల వరకు భారీగా డిమాండ్ చేసిన ప్రకాష్ రాజ్ ఇప్పుడు సినిమా స్థాయిని బట్టి రోజువారీ పారితోషికాన్ని రూ. 2.5 లక్షల నుండి రూ. 4 లక్షల మధ్యకు సర్దుబాటు చేసుకుంటున్నట్లు సమాచారం. అలాగే ప్రత్యేక పాత్రల కోసం రూ. 2 లక్షల నుండి రూ. 3 లక్షల వరకు తీసుకున్న బ్రహ్మానందం, సునీల్ లాంటి వారు మార్కెట్ డిమాండ్‌ను బట్టి తమ ప్యాకేజీని రూ. 1 లక్ష నుండి రూ. 2 లక్షల శ్రేణికి తగ్గించుకుంటూ వస్తున్నారని గుస‌గుస‌లు ఉన్నాయి.

ఇక విలన్ - క్యారెక్టర్ పాత్రలతో మెప్పించిన సంపత్ రాజ్ సైతం గతంతో పోలిస్తే తన పారితోషికాన్ని తగ్గించుకుని రోజుకు రూ. 75 వేల నుండి రూ. 1 లక్ష వరకు తీసుకుంటూ దర్శకనిర్మాతలకు అందుబాటులో ఉంటున్నారు. ఇక టాలీవుడ్‌లో దాదాపు కనిపించకుండా పోయిన సచిన్ ఖేడేకర్ లాంటి నటులు మాత్రం తెలుగు లేదా సౌత్ సినిమాలకు పూర్తిగా దూరమై.. కేవలం భారీ బడ్జెట్ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లకు మాత్రమే పరిమితమవుతూ పాత రేట్లను డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

వారానికి లేదా పది రోజులకు సంబంధించిన ప్యాకేజీల రూపంలో కూడా నిర్మాతలు ఈ సీనియర్ నటులతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. క్రేజ్ తగ్గినా వారి అనుభవం - సీనియారిటీ దృష్ట్యా పెద్ద చిత్రాల మేకర్స్ ఇప్పటికీ వీరికి మంచి ప్యాకేజీలనే ఆఫర్ చేస్తున్నారు. అయితే చిన్న- మధ్యతరహా చిత్రాల విషయానికి వచ్చేసరికి మాత్రం ఈ సీనియర్ ఆర్టిస్టులు కచ్చితంగా పారితోషికాల విషయంలో రాజీపడక తప్పని పరిస్థితి ఏర్పడింది.

మొత్తానికి కొత్త ఆర్టిస్టుల‌ పోటీ పెరిగినా సీనియర్ ఆర్టిస్టులు తమకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్ వాల్యూను కాపాడుకుంటూనే మరోవైపు మార్కెట్ వాస్తవాలకు తగినట్లుగా తమ ప్యాకేజీలను మార్చుకుంటున్నారు. అవకాశాలు తగ్గినా కానీ డిమాండ్ ఉన్న ప్రాజెక్ట్‌లలో తమ ఉనికిని చాటుకుంటూనే.. నిర్మాతల బడ్జెట్ అంచనాలకు తగ్గట్టుగా సర్దుబాటు ధోరణిని ప్రదర్శించడం ప్రస్తుత టాలీవుడ్ వర్గాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. అయితే బ్ర‌హ్మానందం, సునీల్ లాంటి ఆర్టిస్టులు రొటీన్ పాత్ర‌ల‌ను అంగీక‌రించ‌కుండా, త‌మ‌కు న‌చ్చే వాటికోసం ఎదురు చూడ‌టం వ‌ల్ల‌ కూడా వారి స్పీడ్ త‌గ్గింద‌నుకోవ‌డానికి ఒక కార‌ణం. దీనిని వారు ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో ధృవీక‌రించిన విష‌యాన్ని గ‌మ‌నించాలి.

ఇరుముడి న‌టుడికి రోజుకు 40వేలు!

మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన `ఇరుముడి` చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో గంజాయి మత్తులో ఉండే ఒక వైవిధ్యమైన రౌడీ పాత్రలో నటించి క్యారెక్టర్ నటుడు వినయ్ (కొమరం) ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. సినిమాలో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ‌న‌టుడు ప్రస్తుతం తనకు ఉన్న డిమాండ్ దృష్ట్యా రోజుకు రూ. 40 వేల నుండి రూ. 60 వేల వరకు పారితోషకం అందుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో మొత్తం 16 రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్న విన‌య్ కి మంచి గుర్తింపు రావడంతో పాటు తదుపరి సినిమాల్లోనూ అవకాశాలు వస్తున్నాయని.. ఈ విజయంతో తన పారితోషకం కూడా పెరిగిందని తెలుస్తోంది. నేటిత‌రం స్టార్లు వరస అవ‌కాశాల‌తో బిజీ స్టార్లుగా అత్యంత వేగంగా ఎదిగేస్తుండ‌టం గ‌మ‌నిస్తే.. నిజంగా ఈ రంగంలో ఆర్జ‌న‌ ఏ రేంజులో ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు.