Begin typing your search above and press return to search.

వారి ప్రేమాయ‌ణంలోనూ రొమాంటిక్ సినిమాలకు మించిన ట్విస్టులు!

టాలీవుడ్‌లో షూటింగ్ సెట్స్‌లో మొదలైన ప్రేమలు పెళ్లి బంధంగా మారిన జంటలు ఎన్నో ఉన్నాయి. నాగార్జున-అమల, మహేష్ బాబు-నమ్రత, వరుణ్ తేజ్-లావణ్య, విజయ్ దేవరకొండ-రష్మిక, సమంత-రాజ్ నిడిమోరు ఇలా పలువురు సెలబ్రిటీల ప్రేమకథలు అభిమానులను ఆకట్టుకున్నాయి. తెర వెనుక మొదలైన ఈ బంధాలు నిజజీవితంలోనూ అందమైన కథలుగా నిలిచాయి.

By:  Srikanth Kontham   |   20 Nov 2026 11:00 PM IST
వారి ప్రేమాయ‌ణంలోనూ  రొమాంటిక్ సినిమాలకు మించిన ట్విస్టులు!
X

వెండి తెరపై హీరోహీరోయిన్ల మధ్య ప్రేమను చూసి అభిమానులు మురిసిపోతుంటారు. కానీ ఆ కెమెరాల వెనుక నిజంగానే చిగురించిన ప్రేమకథలు అంతకంటే ఎక్కువ ట్విస్టులతో సాగుతుంటాయి. టాలీవుడ్‌లో షూటింగ్ సెట్స్‌లో స్నేహితులుగా మొదలై ఏళ్ల తరబడి బంధాన్ని కాపాడుకుని చివరకు పెళ్లి పీటలెక్కిన జంటలు ఎన్నో ఉన్నాయి.

ఈ ప్రయాణంలో సీనియర్ జంటల కథలు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎనభైల చివర్లో `శివ`, `నిర్ణయం` వంటి సిని మాల్లో న‌టించిన స‌మ‌యంలో నాగార్జున.. అమల మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమ‌గా చిగురించి 1992లో పెళ్లి వరకు వెళ్లింది. మహేష్ - నమ్రతల ప్రేమకథలో అయితే ఐదేళ్ల పాటు సాగిన రహస్య ప్రయాణమే పెద్ద ట్విస్ట్. 2000లో `వంశీ` సెట్స్‌లో కలిసిన జోడీ వయసు వ్యత్యాసంతో ఎదురైన అభ్యంతరాలను దాటుకుని 2005లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

తర్వాతి తరంలోనూ షూటింగ్ స్పాట్‌లో కలిసిన మనసులు పెళ్లి బంధంతో నిలబడ్డాయి. 2017లో `మిస్టర్` సినిమా సమయంలో పరిచయమైన వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఆరేళ్ల పాటు మంచి స్నేహితులమనే నమ్మించారు. చివరకు 2023లో పెద్ద‌ల అంగీకారంతో ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. అటుపై వాయువ్ అనే కుమారుడికి తల్లిదండ్రులయ్యారు. ఇక `గీత గోవిందం`, `డియర్ కామ్రేడ్` చిత్రాలతో అభిమానుల ఫేవరెట్ జోడీగా మారిన విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న సైతం ఏళ్ల తరబడి సాగిన ఊహాగానాలకు తెరదించారు. 2026 ఫిబ్రవరిలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

నటీనటుల మధ్యే కాకుండా నటి-దర్శకుడి మధ్య చిగురించిన బంధంగా సమంత- రాజ్ నిడిమోరుల కథ మరో మలుపు తిరిగింది. `ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2`, `సిటాడెల్: హనీ బన్నీ` వెబ్ సిరీస్‌ల సమయంలో వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. చివరకు డిసెంబర్ లో కోయంబత్తూరులోని యోగా సెంటర్‌లో నిరాడంబరంగా పెళ్లి చేసుకుని ఆశ్చర్యపరిచారు. కొన్ని గంట‌ల క్రిత‌మే స‌మంత పండంటి బాబుకు జ‌న్మ‌నిచ్చింది.

సినిమా కోసం నెలల తరబడి కలిసి పనిచేసే క్రమంలో ఒకరి స్వభావాన్ని మరొకరు దగ్గరగా అర్థం చేసుకునే అవకాశం కలుగుతుంది. బయటి ప్రపంచానికి కో-స్టార్స్‌గా మాత్రమే కనిపిస్తూ లోలోపల బంధాన్ని బ‌ల‌ప‌రుచుకుని జీవిత భాగస్వాములుగా మారిన జంటల ప్రయాణాలు రొమాంటిక్ సినిమా స్క్రిప్ట్‌కు ఏమాత్రం తీసిపోవు అన‌డంలో సందేహం లేదు. ఇక‌పై ఈ జాబితాలో ఇంకెన్ని జోడీలు క‌లుస్తాయో చూడాలి.