Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌ లో క్యాస్టింగ్ కౌచ్.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఇటీవల మన శంకర వరప్రసాద్ గారు సినిమా సక్సెస్ మీట్‌ లో మాట్లాడిన చిరంజీవి, సినిమా రంగాన్ని ఒక అద్దంతో పోల్చారు.

By:  M Prashanth   |   31 Jan 2026 10:05 AM IST
టాలీవుడ్‌ లో క్యాస్టింగ్ కౌచ్.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

తెలుగు సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్, వాటికి గాయని చిన్మయి ఇచ్చిన రెస్పాన్స్, తాజాగా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు కలిసి ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేపుతున్నాయి. మహిళల భద్రత, అవకాశాల కోసం ఎదుర్కొనే ఒత్తిళ్లపై సోషల్ మీడియాలో ఫుల్ గా చర్చ కొనసాగుతోంది.

ఇటీవల మన శంకర వరప్రసాద్ గారు సినిమా సక్సెస్ మీట్‌ లో మాట్లాడిన చిరంజీవి, సినిమా రంగాన్ని ఒక అద్దంతో పోల్చారు. మన ప్రవర్తన ఎలా ఉంటే అదే మనకు తిరిగి వస్తుందని అన్నారు. కష్టపడి పనిచేస్తూ ప్రొఫెషనల్‌ గా ఉంటే ఇండస్ట్రీలో ఎవరికైనా అవకాశాలు వస్తాయని వ్యాఖ్యానించారు. సినీ రంగంలో ఎదగాలంటే నిబద్ధత, క్రమశిక్షణ అవసరమని ఆయన సూచించారు.

అయితే ఆ వ్యాఖ్యలపై గాయని చిన్మయి స్పందించారు. ఇండస్ట్రీలో వాస్తవ పరిస్థితులు అంత సులభంగా లేవని ఆమె పేర్కొన్నారు. కమిట్మెంట్ అనే పదం చాలా సందర్భాల్లో వృత్తిపరమైన అర్థం కాకుండా లైంగిక ఒత్తిడిని సూచిస్తోందని ఆరోపించారు. మహిళలు రాజీ పడకపోతే అవకాశాలు రావని అనేక సంఘటనలు తాను చూశానని, విన్నానని సోషల్ మీడియాలో వెల్లడించారు.

గతంతో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించారు. ఓ వీడియో ద్వారా మాట్లాడిన ఆయన, ఇండస్ట్రీలో వేధింపులు లేవని ఎవరూ చెప్పలేరని స్పష్టం చేశారు. వంద శాతం ఇలాంటి ఘటనలు ఉన్నాయని, కానీ అందరూ అలాంటి వారే అనడం సరికాదని అన్నారు.

ప్రతి వ్యవస్థ ఉన్నట్లుగానే సినిమా రంగంలో కూడా కొందరు మహిళలను వస్తువులా చూసే ధోరణి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏడాదికి దాదాపు 200 నుంచి 250 సినిమాలు నిర్మితమవుతున్నాయని, వాటిలో 30 నుంచి 40 సినిమాలు మాత్రమే ఇలాంటి తప్పుదోవలో తీస్తున్నారని తమ్మారెడ్డి పేర్కొన్నారు. కొంతమంది పెద్దలు లైంగిక వాంఛలు కోసం అవకాశాలను ఎరగా వేస్తున్నారనే ఆరోపణలను పూర్తిగా ఖండించలేమని చెప్పారు.

క్యాస్టింగ్ కౌచ్ విషయంలో చిన్మయి చెప్పింది కొంతవరకు నిజమేనని అంగీకరించారు. ఇక గతంలో తెలుగు సినీ పరిశ్రమలో వేధింపులపై ప్రభుత్వం కమిటీ వేసి నివేదిక సిద్ధం చేసిందని, అయితే అది ఇంకా బయటకు ఎందుకు రాలేదనేది తెలియదని చెప్పారు. అది కూడా రెండు నివేదికలు ఉన్నాయని తెలిపారు. ఒకటి ప్రభుత్వం వేసిన కమిటీ, మరొకటి ఉమెన్ వింగ్ తయారు చేసిందని వెల్లడించారు. మొత్తానికి చిరంజీవి వ్యాఖ్యలు, చిన్మయి ఆరోపణలు, తమ్మారెడ్డి స్పందనతో క్యాస్టింగ్ కౌచ్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.