Begin typing your search above and press return to search.

బడ్జెట్ ఆధారిత బిజినెస్ ఫార్ములా టాలీవుడ్‌లో సాధ్యమేనా?

ఈ బడ్జెట్ ఆధారిత వ్యాపార సూత్రం వల్ల ట్రేడ్ వర్గాలకు భారీ లాభాలు దక్కుతుండటంతో ఇప్పుడు ఈ ప్రాక్టికల్ ఫార్ములా టాలీవుడ్‌లో కూడా సాధ్యమేనా అనే చర్చ జోరుగా సాగుతోంది.

By:  Srikanth Kontham   |   27 May 2026 7:00 AM IST
బడ్జెట్ ఆధారిత బిజినెస్ ఫార్ములా టాలీవుడ్‌లో సాధ్యమేనా?
X

సినిమా నిర్మాణ వ్యయం -మార్కెట్ ధరలు నానాటికీ పెరిగిపోతున్న తరుణంలో బాక్సాఫీస్ వద్ద బయ్యర్లు , డిస్ట్రిబ్యూటర్లను సురక్షిత జోన్‌లో ఉంచేందుకు పొరుగు పరిశ్రమలు సరికొత్త బిజినెస్ స్ట్రాటజీలను అమలు చేస్తున్నాయి. మాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమలు హీరోల స్టార్ ఇమేజ్ ..గత రికార్డులను మాత్రమే ప్రామాణికంగా తీసుకోకుండా? సినిమాకు అయిన వాస్తవ బడ్జెట్‌ను బట్టి థియేట్రికల్ హక్కుల ధరలను నిర్ణయిస్తున్నాయి. ఈ బడ్జెట్ ఆధారిత వ్యాపార సూత్రం వల్ల ట్రేడ్ వర్గాలకు భారీ లాభాలు దక్కుతుండటంతో ఇప్పుడు ఈ ప్రాక్టికల్ ఫార్ములా టాలీవుడ్‌లో కూడా సాధ్యమేనా అనే చర్చ జోరుగా సాగుతోంది.

తమిళ చిత్ర పరిశ్రమలో ఇటీవల చోటుచేసుకున్న‌ వ్యాపార మార్పులకు స్టార్ హీరో సూర్య నటించిన `కరుప్పు` మంచి ఉదాహరణగా నిలిచింది. సూర్య వంటి భారీ మార్కెట్ ఉన్న హీరో సినిమా అయినా? మేకర్స్ బిజినెస్ రేట్లను పెంచకుండా 70 కోట్ల రూపాయల రీజనబుల్ ధరకే థియేట్రికల్ హక్కులను విక్రయించారు. ఫలితంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విడుదలైన నాలుగు రోజుల్లోనే బయ్యర్లకు పూర్తి పెట్టుబడిని రికవరీ చేసి క్లీన్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఓవర్ ప్రైసింగ్ అనే పదం లేకుండా సినిమా బడ్జెట్‌కు తగినట్లు వ్యాపారం చేయడం వల్లే ఇది సాధ్యమైంది.

ఇక మలయాళ పరిశ్రమ అయితే ఈ విషయంలో మరో అడుగు ముందడుగు వేసి ట్రేడ్ వర్గాలను విస్మయపరిచింది. మోహన్‌లాల్ `దృశ్యం 3` చిత్రానికి కోట్లల్లో బిజినెస్ చేసే అవకాశం ఉన్నా? అక్కడి నిర్మాతలు బడ్జెట్ పరిమితులను దృష్టిలో ఉంచుకుని థియేట్రికల్ హక్కులను 28 కోట్లకే అమ్మారు. ఈ అద్భుతమైన వ్యూహం వల్ల సినిమా విడుదలైన రెండో రోజుకే లాభాల బాట పట్టింది. ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి ఏకంగా 140 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం కురిపించింది.

దీనికి భిన్నంగా టాలీవుడ్ మార్కెట్ సమీకరణాలు పూర్తిగా హై-స్టేక్స్ - హీరో-సెంట్రిక్ ఇమేజ్‌పైనే నడుస్తుంటాయి. తెలుగులో సినిమా బిజినెస్ అనేది బడ్జెట్ కంటే కూడా హీరో-డైరెక్టర్ కాంబినేషన్ క్రేజ్, మునుపటి సినిమాల రికార్డుల ఆధారంగా ఆకాశాన్నంటే రేట్లకు అమ్ముడవుతుంటుంది. దీంతో సినిమాకు పాజిటివ్ టాక్ వ‌చ్చినా? విక్రయించిన భారీ టార్గెట్ల వల్ల బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాధించడం గగనమైపోతుంది. ఒక్క ఫ్లాప్ వస్తే చాలు బయ్యర్లు కోలుకోలేని విధంగా నష్టపోయే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుంది.

ఈ నేపథ్యంలో తమిళ, మలయాళ ఇండస్ట్రీల తరహా ప్రాక్టికల్ బడ్జెట్ ఫార్ములాను టాలీవుడ్ నిర్మాతలు ధైర్యంగా అమలు చేయగలరా? అంటే కొన్ని ప్రాథమిక సవాళ్లు ఎదురవుతాయి. తెలుగు సినిమాల్లో హీరోల రెమ్యునరేషన్లు, భారీ యాక్షన్ ఎపిసోడ్లు, గ్రాండియర్ మేకింగ్ స్టైల్ వల్ల బడ్జెట్లు సహజంగానే ఎక్కువగా ఉంటాయి. అయినా? థియేట్రికల్ బిజినెస్ రేట్లను పరిమితి లోపు ఉంచి నాన్-థియేట్రికల్ (ఓటీటీ, శాటిలైట్, ఆడియో) హక్కుల ద్వారా లాభాలు వెనకేసుకునే వ్యూహాన్ని పాటిస్తే టాలీవుడ్ ఎగ్జిబిషన్ వ్యవస్థకు పూర్తి రక్షణ దొరుకుతుందనే వాద‌నా లేక‌పోలేదు.

బాక్సాఫీస్ వద్ద ఎప్పుడూ హెల్తీ వాతావరణం ఉండాలంటే? వ్యాపారంలో పారదర్శకత, బడ్జెట్ క్రమశిక్షణ ఎంతో అవసరం. హైప్ మాత్రమే కాకుండా సినిమా మేకింగ్ కాస్ట్‌ను బట్టి థియేట్రికల్ ధరలను నిర్ణయించే పద్ధతిని టాలీవుడ్ అలవర్చుకుంటే పరిశ్రమ మరింత నిలకడగా ఎదుగుతుంది. హీరోలు, నిర్మాతలు , డిస్ట్రిబ్యూటర్లు కలిసికట్టుగా కొత్త బిజినెస్ మోడల్‌ను స్వాగతించినప్పుడే టాలీవుడ్ బాక్సాఫీస్ నమ్మకమైన జోన్ లోకి అడుగుపెట్టగలదు.