సంక్రాంతి తర్వాత సీన్ మొత్తం రివర్స్!
ఈ ఏడాది కూడా సంక్రాంతి బరిలో నిలిచిన పెద్ద చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. థియేటర్లన్నీ ప్రేక్షకుల సందడితో, ఈలలు, గోలలతో కళకళలాడాయి.
By: Srikanth Kontham | 18 April 2026 9:00 PM ISTటాలీవుడ్ కు సంక్రాంతి సీజన్ పెద్ద ఊరటనిస్తుంది. ఈ ఏడాది కూడా సంక్రాంతి బరిలో నిలిచిన పెద్ద చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. థియేటర్లన్నీ ప్రేక్షకుల సందడితో, ఈలలు, గోలలతో కళకళలాడాయి. ట్రేడ్ సైతం ఈ ఏడాది టాలీవుడ్‌కు అద్భుతమైన లాంచింగ్ దొరికిందని సంతోషం వ్యక్తం చేసింది. అయితే పండుగ వెలుగులు ముగిసిన అనంతరం పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. సంక్రాంతి తర్వాత విడుదలైన ఏ సినిమా కూడా ప్రేక్షకులను థియేటర్ల వైపు రప్పించడంలో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.
సంక్రాంతి తర్వాత బాక్సాఫీస్ డీలా పడటానికి ప్రధాన కారణం సరైన సినిమా రిలీజ్ లు లేకపోవడం. సాధారణంగా స్టార్ హీరోల చిత్రాలు రిలీజ్ కు ఉన్నప్పుడే థియేటర్ల వద్ద హడావిడి కనిపిస్తుంది. పండుగ తర్వాత విడుదలైన చిత్రాలన్నీ దాదాపు చిన్న - మీడియం బడ్జెట్ సినిమాలు కావడంతో వాటికి ఓపెనింగ్స్ రావడం కష్టంగా మారింది. ప్రేక్షకులు కూడా కేవలం పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలకే పరిమితమవుతున్నారు తప్ప ప్రతి వారం థియేటర్లకు వెళ్లాలనే ఆసక్తి చూపించడం లేదు. భారీ టికెట్ ధరలు కూడా బాక్సాఫీస్ కుదిపేస్తున్న మరో ముఖ్య అంశం.
మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకపోవడంతో కుటుంబం మొత్తం థియేటర్‌కు వెళ్లి సినిమా చూడటం అనేది భారీ ఖర్చుతో కూడుకున్న పనిగా మారింది. దీనికి తోడు క్యాంటీన్ ఖర్చులు కూడా అదనపు భారం అవుతున్నాయి. చిన్న సినిమాలకు కూడా అదే స్థాయి ధరలు ఉండటం వల్ల, ప్రేక్షకులు ఆ చిత్రాలను థియేటర్లలో చూడటం కంటే ఓటిటి లో వచ్చే వరకు వేచి చూడటమే మేలని భావిస్తున్నారు.
ఓటిటి ప్రభావం కూడా మందగమనానికి బలమైన కారణం. థియేటర్లలో విడుదలైన కొన్ని వారాలకే సినిమాలు డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్‌లో అందుబాటులోకి వస్తున్నాయి.
దీంతో సినిమాపై విపరీతమైన క్రేజ్ ఉంటే తప్ప ప్రేక్షకులు బయటకు రావడం లేదు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఇంటి వద్దే తమకు నచ్చిన సమయంలో సినిమాలు చూడటానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ధోరణి వల్ల థియేటర్ల యజమానులు, ఎగ్జిబిటర్లు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. కంటెంట్ పరంగా కూడా సంక్రాంతి తర్వాత వచ్చిన సినిమాల్లో వైవిధ్యం లోపించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ అవి థియేటర్ లో కూర్చుని చూసే స్థాయి అనుభూతిని కలిగించలేకపోయాయి. సోషల్ మీడియా హైప్ , ప్రమోషన్లతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ప్రేక్షకుడు ఇప్పుడు చాలా క్లారిటీతో ఉన్నాడు. కంటెంట్ అద్భుతంగా ఉంటేనే టికెట్ కొంటున్నాడు.
రాబోయే సమ్మర్ షెడ్యూల్ వరకు బాక్సాఫీస్ వద్ద ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎండల తీవ్రత పెరగడం, పరీక్షల సీజన్ కావడం కూడా సినిమాల వసూళ్లపై ప్రభావం చూపు తున్నాయి. మళ్ళీ పెద్ద సినిమాలు విడుదలయ్యే వరకు థియేటర్లు వెలవెలబోక తప్పదనిపిస్తోంది. టికెట్ ధరల తగ్గింపు , ఆకర్షణీయమైన కంటెంట్ ఉంటే తప్ప రివర్స్ సీన్ నుండి టాలీవుడ్ బయటపడటం అంత సులభం కాదు.
