టాలీవుడ్ బాక్సాఫీస్ పరిస్థితి - 1000 కోట్ల కలలు నిజమయ్యేనా?
అయితే టాలీవుడ్ సత్తా కేవలం ఒక్కో ఏడాది ప్రదర్శనలతో అంచనా వేయలేమని ట్రేడ్ నిపుణులు నమ్ముతున్నారు.
By: Srikanth Kontham | 21 Aug 2026 11:00 PM ISTప్రస్తుతం పాన్-ఇండియా, పాన్-వరల్డ్ అంటూ వందల కోట్ల భారీ బడ్జెట్లతో సినిమాలు తెరకెక్కుతున్నాయి. అయితే ఆ స్థాయికి తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ మాత్రం ప్రతిసారీ కనిపించడం లేదనే చర్చ జరుగుతోంది. గతం లో `ఆర్ఆర్ఆర్ (1200 కోట్లు), `కల్కి 2898 ఏడీ` (1200 కోట్లకు పైగా), `పుష్ప 2` ( 1800 కోట్లు) వంటి చిత్రాలు రికార్డులను సృష్టించినా? ఆ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ కొంతమేర తడబడుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో విడుదలైన కొన్ని భారీ అంచనాల ప్రాజెక్ట్‌లు బాక్సాఫీస్ వద్ద ఆశించిన రేంజ్‌లో రాణించలేకపోయాయి అన్నది అంతే వాస్తవం.
`గేమ్ చేంజర్`, `వార్ 2`, `రాజాసాబ్`, `పెద్ది` వంటి క్రేజీ సినిమాలు మేకర్స్ పెట్టుకున్న అంచనాలను, ఆడియన్స్ ఆశలను అందుకోవడంలో కొంత నిరాశపరిచాయి. దీంతో టాలీవుడ్ మేకర్స్ మరోసారి కథల ఎంపికపై, కంటెంట్ డెలివరీ విధానంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ కనిపిస్తోంది. `ధురంధర్` సింగిల్ లాంగ్వేజ్‌లోనే భారీ వసూళ్లను సాధించి సరికొత్త ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేసింది. బలమైన కంటెంట్, గ్రిప్పింగ్ నెరేషన్ ఉంటే ప్రాంతీయ భాషలో విడుదలైన సినిమా ఏకంగా 1400 కోట్ల నుంచి1800 కోట్ల మార్క్‌ను టచ్ చేయగలిగిందని ధురంధర్ నిరూపించింది.
ఇది టాలీవుడ్ ట్రేడ్ వర్గాలకు కూడా బలమైన పాఠంగా మారింది. పాన్-ఇండియా అప్పీల్ కోసం కేవలం భారీ తారాగణం, గ్రాఫిక్స్ మాత్రమే సరిపోవని, ప్రేక్షకులను కట్టిపడేసే బలమైన భావోద్వేగాలు, సరికొత్త కథాకథనాలు ఉండాలని ఇటీవలి ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం బడ్జెట్ హంగుల కంటే కంటెంట్ తాలూకు లోతు గురించే నేటి ప్రేక్షకులు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. పెద్ద హీరోల ఇమేజ్‌ను మించి, స్క్రీన్ ప్లే మ్యాజిక్ వర్కౌట్ అయితేనే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే టాలీవుడ్ సత్తా కేవలం ఒక్కో ఏడాది ప్రదర్శనలతో అంచనా వేయలేమని ట్రేడ్ నిపుణులు నమ్ముతున్నారు. ఇక్కడ దర్శక,నిర్మాతలు గతంలో గ్లోబల్ స్థాయిలో తెలుగు సినిమా సత్తా ఏంటో చాటిచెప్పారు. ప్రస్తుత చిన్నపాటి ప్రతికూల పరిస్థితులు, మార్కెట్ లోతుపాట్లను బేరీజు వేసుకుంటూ రాబోయే ప్రాజెక్ట్‌ల విషయంలో మరింత పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్తే గెలుపు నల్లేరు మీద నడకలా మారుతుందని విశ్వశిస్తున్నారు.
