Begin typing your search above and press return to search.

మార్చి కూడా ఊరించి ఉసూరుమనిపించిందా?

మార్చి కూడా ఊరించి ఉసూరుమనిపించిందా? ప్రస్తుతం టాలీవుడ్‌ లో ఇదే చర్చ హాట్ టాపిక్‌ గా మారింది

By:  M Prashanth   |   30 March 2026 6:00 AM IST
మార్చి కూడా ఊరించి ఉసూరుమనిపించిందా?
X

మార్చి కూడా ఊరించి ఉసూరుమనిపించిందా? ప్రస్తుతం టాలీవుడ్‌ లో ఇదే చర్చ హాట్ టాపిక్‌ గా మారింది. 2026 స్టార్టింగ్ లో సంక్రాంతి కానుకగా విడుదలైన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుని ఇండస్ట్రీకి ఊపు తీసుకొచ్చాయి. ఆ సినిమాల ప్రభావంతో జనవరి నెల మొత్తం థియేటర్లలో సందడి కనిపించింది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లలోనూ మంచి ఉత్సాహం నెలకొంది.

అయితే ఆ ఊపు ఎక్కువ కాలం నిలవలేదు. ఫిబ్రవరి నెలలో విడుదలైన సినిమాలు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దీంతో థియేటర్లలో ప్రేక్షకుల రద్దీ తగ్గిపోయింది. కంటెంట్ పరంగా కొత్తదనం లేకపోవడం, పెద్ద సినిమాల లేమి వంటి కారణాలు దీనికి ప్రధాన కారణాలుగా కనిపించాయి. చిన్న సినిమాలు వచ్చినప్పటికీ అవి పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి.

ఇలాంటి పరిస్థితుల్లో మార్చి నెలపై ఇండస్ట్రీ పెద్దగా ఆశలు పెట్టుకుంది. సమ్మర్ సీజన్‌ లో ముందు వచ్చే ఆ నెలలో కనీసం కొన్ని సినిమాలు హిట్ అయ్యి బాక్సాఫీస్‌ కు ఊపు తీసుకొస్తాయని భావించారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం విడుదలతో థియేటర్లకు మళ్లీ ప్రేక్షకులు చేరుతారని అంతా అంచనా వేశారు.

కానీ సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి ఆశించినట్లుగా లేకపోయింది. ఉస్తాద్ భగత్ సింగ్ కు మిక్స్‌డ్ టాక్ రావడంతో కలెక్షన్లు కూడా అంచనాలకు తగ్గట్లుగా రాలేదు. ఓపెనింగ్స్ బాగానే వచ్చినప్పటికీ ఆ తర్వాత స్టేబుల్ గా బాక్సాఫీస్ వద్ద నిలవలేకపోయింది. దీంతో మార్చి నెలలో పెద్ద హిట్‌ గా నిలిచే అవకాశం కూడా ఆ సినిమాతో సాధ్యపడలేదు. ఇక సంక్రాంతి తర్వాత నుంచి ఇప్పటివరకు థియేటర్లలో అదే స్థాయి సందడి కొనసాగించే సినిమా ఒక్కటీ రాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే కంటెంట్ కొరత స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఎగ్జిబిటర్ల పరిస్థితి కూడా ఆందోళనకరంగా మారింది. మరోవైపు బాలీవుడ్ నుంచి వచ్చిన ధురంధర్: ది రివెంజ్ మాత్రం మంచి వసూళ్లు సాధించింది. అయితే అది డబ్బింగ్ వెర్షన్ కావడం గమనార్హం. అంటే స్థానికంగా టాలీవుడ్ సినిమాలు కాకుండా ఇతర భాషా చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

మొత్తంగా చూస్తే.. సంక్రాంతి పండుగ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ ఊపు తగ్గిపోయిందనే చెప్పాలి. ఫిబ్రవరి లాగే మార్చి నెల కూడా ఇండస్ట్రీకి పెద్దగా లాభం చేకూర్చలేకపోయింది. ఇప్పుడు అందరి దృష్టి సమ్మర్ సీజన్‌ పై పడింది. రాబోయే భారీ చిత్రాలపై ఆశలు పెట్టుకున్న ఇండస్ట్రీ.. ఆ సినిమాలు మంచి ఫలితాలు అందించి మళ్లీ బాక్సాఫీస్‌ కు జోష్ తీసుకురావాలని ఎదురుచూస్తోంది. మరేం జరుగుతుందో వేచి చూడాలి.