టాలీవుడ్ జనరేషన్ గ్యాప్ ఏం చెబుతోంది?
నియర్ హీరోల సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజే వందల కోట్ల ఓపెనింగ్స్ రాబడుతుంటే?
By: Srikanth Kontham | 27 Jun 2026 10:00 AM ISTటాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నేడు ఆసక్తికరమైన జనరేషన్ గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి సీనియర్ మోస్ట్ స్టార్లతో పాటు పవన్ కళ్యాణ్, మహేష్ , ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి టాప్ లీగ్ హీరోల అసాధారణ మాస్ పుల్ ముందు నేటి తరం యంగ్ హీరోలు థియేట్రికల్ మార్కెట్ సాధించడంలో వెనుకబడుతున్నారు. సీనియర్ హీరోల సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజే వందల కోట్ల ఓపెనింగ్స్ రాబడుతుంటే? యంగ్ హీరోలు మాత్రం పాజిటివ్ మౌత్ టాక్ వస్తేనే థియేటర్లలో నిలదొక్కుకోగలుగుతున్నారు. ఈ వ్యత్యాసం వెనుక బలమైన కారణాలు, మారిన మార్కెట్ సమీకరణాలున్నాయి.
యంగ్ హీరోలు వెనుకబడటానికి ప్రధాన కారణం ప్రేక్షకులలో వారి పట్ల రాయల్ బ్లడ్ లాంటి తిరుగులేని బ్రాండ్ లాయల్టీ ఇంకా ఏర్పడకపోవడమే. సీనియర్ - అగ్ర స్టార్ హీరోలు దశాబ్దాల పాటు థియేటర్లలో నిరంతరం కనిపిస్తూ కమర్షియల్ ఫార్ములా చిత్రాల తో రూరల్ మాస్ ఆడియన్స్‌తో బలమైన కనెక్ట్ ఏర్పరచుకున్నారు. కానీ నేటి తరం హీరోలు కెరీర్ ఆరంభం నుంచే ఎక్కువగా అర్బన్, క్లాస్, లవ్ స్టోరీస్ , కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలకే పరిమితం కావడంతో సింగిల్ స్క్రీన్ మాస్ ప్రేక్షకులను తమ వైపు తిప్పుకోలేకపోతున్నారు. దీనివల్ల ఓపెనింగ్ డే రోజున థియేటర్లను నింపే స్టార్ పవర్ వారి మార్కెట్‌లో లోపిస్తోంది.
ఈ తరం హీరోలకు ఓటీటీ విప్లవం కూడా శాపంగా మారింది. ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రేక్షకులు అగ్ర హీరోల లార్జర్-దెన్-లైఫ్ సినిమాలను మాత్రమే థియేటర్లలో చూడటానికి మొగ్గు చూపుతున్నారు. యంగ్ హీరోల మిడ్-రేంజ్ సినిమాలను ఎలాగూ నాలుగు వారాల్లో ఓటీటీలోకి వస్తుంది కదా అని థియేటర్లలో స్కిప్ చేసే ధోరణి పెరిగింది. దీనికి తోడు యంగ్ హీరోలు కథల ఎంపికలో ఎక్కువగా సేఫ్ జోన్ డ్రామాలు ..విదేశీ చిత్రాల స్ఫూర్తితో సాగే అర్బన్ థ్రిల్లర్స్ ఎంచుకుంటున్నారు. ఇవి ఓటీటీ వీక్షకులను మెప్పించినప్పటికీ థియేటర్లలో రిపీట్ ఆడియన్స్‌ను .. ఫ్యామిలీ ఆడియన్స్‌ను భారీ సంఖ్యలో రప్పించలేకపోతున్నాయి.
నేటి యంగ్ హీరోలకు పక్కా సస్టైనబుల్ స్టార్‌డమ్ రావాలంటే జోనర్ల సమతుల్యత చాలా అవసరం. కేవలం క్లాస్ ..మల్టీప్లెక్స్ చిత్రాలకే పరిమితం కాకుండా బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా అచ్చమైన తెలుగు నేటివిటీతో కూడిన మాస్, యాక్షన్ డ్రామాల్లో కొత్త దనం చూసుకోవాలి. కథలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకుంటూనే కథానాయకుడి పాత్రను ఎలివేట్ చేసే బలమైన హీరోయిజం సీన్లు పడేలా దర్శకులతో కలిసి వర్క్ చేయాలి. మాస్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగినప్పుడే మార్కెట్ పరిధి స్థిరంగా పెరుగుతుంది.
సస్టైనబుల్ స్టార్‌డమ్‌కు నిరంతరాయమైన థియేట్రికల్ ఉనికి .. సరైన పబ్లిసిటీ వ్యూహాలు తోడవాలి. ఒక సినిమా సక్సెస్ కాగానే తదుపరి ప్రాజెక్టుల విషయంలో సంవత్సరాల తరబడి గ్యాప్ తీసుకోకుండా ఏడాదికి కనీసం ఒకటి .. రెండు చిత్రాలు థియేటర్లలోకి వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. కేవలం సోషల్ మీడియా ఫాలోయింగ్‌ను చూసి స్టార్‌డమ్ అనుకుంటే పొరపాటే. అది గ్రౌండ్ లెవల్‌లో టికెట్ కౌంటర్ల వద్ద కలెక్షన్లుగా మారినప్పుడే నిజమైన స్టార్‌డమ్ అవుతుంది. ఇమేజ్ బిల్డింగ్‌కు తోడు డిస్ట్రిబ్యూటర్ల నమ్మకాన్ని గెలిచే బిజినెస్ వ్యూహాలు అవలంబిస్తేనే యంగ్ హీరోలు టాలీవుడ్ నెక్స్ట్ జనరేషన్ పిల్లర్లుగా ఎదగగలరన్నది నిజం.
