వాళ్లలా మనోళ్లకి పెద్ద పీట వేయడం లేదే!
భారతీయ చలనచిత్ర పరిశ్రమ గ్లోబల్ రేంజ్‌కు విస్తరిస్తున్న తరుణంలో వివిధ భాషల నటీనటుల మధ్య పరస్పర సహకారం ఉండాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది.
By: Srikanth Kontham | 25 July 2026 6:00 PM ISTభారతీయ చలనచిత్ర పరిశ్రమ గ్లోబల్ రేంజ్‌కు విస్తరిస్తున్న తరుణంలో వివిధ భాషల నటీనటుల మధ్య పరస్పర సహకారం ఉండాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. అయితే టాలీవుడ్ - బాలీవుడ్ మధ్య నటీనటులకు అవకాశాలు కల్పించే విషయంలో మాత్రం స్పష్టమైన అసమతుల్యత కనిపిస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమ ఇతర భాషల నటులను, ముఖ్యంగా బాలీవుడ్ ఆర్టిస్టులను ఎంతో ఆదరిస్తుంది. వారికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుంది. కానీ ఇందుకు విరుద్ధంగా బాలీవుడ్ మేకర్స్ మాత్రం తెలుగు నటులకు సరైన గుర్తింపు .. ప్రాధాన్యత ఇవ్వడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్నది అంతే వాస్తవం.
తెలుగు తెరపై ప్రధాన పాత్రలు, గ్లామరస్ హీరోయిన్లు మొదలుకుని పవర్‌ఫుల్ విలన్ల వరకు ఏ పాత్రనైనా సరే బాలీవుడ్ నటులకే కట్టబెట్టడం టాలీవుడ్‌లో పరిపాటిగా మారింది. సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ రావాలనే ఉద్దేశంతో తెలుగు దర్శక నిర్మాతలు అక్కడి స్టార్స్‌ను ఎంతో ఆప్యాయంగా ఆహ్వానిస్తుంటారు. వారికి భారీ పారితోషికాలు ఆఫర్ చేస్తారు. కథలో ప్రాధాన్యత ఉన్న పాత్రలను కేటాయిస్తున్నారు. `పుష్ప`, `దేవర`, `ఆర్‌ఆర్‌ఆర్` వంటి ప్రతి పెద్ద ప్రాజెక్ట్‌లోనూ మలయాళ, కన్నడ, బాలీవుడ్ నటీనటులు .. టెక్నీషియన్లు భాగస్వామ్యం కావడం ఇందుకు నిదర్శనం.
అయితే ఇదే ఉదారతను బాలీవుడ్ మాత్రం తెలుగు నటుల విషయంలో ఎప్పుడూ చూపించలేదు. టాలీవుడ్ హీరోలు అక్కడ పాన్ ఇండియా మార్కెట్‌ను క్రియేట్ చేస్తున్నప్పటికీ అక్కడి సినిమాల్లో తెలుగు నటీమణులకు .. సహాయ నటులకు సరైన అవకాశాలు దక్కడం లేదు. ఒకవేళ ఏదైనా పాత్ర ఇచ్చినా? అవి నామమాత్రంగా .. ప్రాధాన్యత లేనివిగా ఉంటున్నాయి. హీరోయిన్ కావాలన్నా? విలన్ పాత్ర కావాలన్నా? బాలీవుడ్ మేకర్స్ ఎప్పుడూ స్థానిక ముంబై నటుల వైపే మొగ్గు చూపుతారు తప్ప టాలెంట్ ఉన్న తెలుగు నటులను పూర్తిగా విస్మరిస్తున్నారు.
ఈ వన్‌వే విధానం వల్ల తెలుగు చిత్ర పరిశ్రమ నష్టపోతుందనే వాదన బలంగా వినిపిస్తోంది. తెలుగు నిర్మాతలు కోట్లు ఖర్చు పెట్టి బాలీవుడ్ నటులను ఇక్కడి సినిమాలకు రప్పిస్తుంటే.. వారు మాత్రం తెలుగు మార్కెట్‌ను వాడుకుంటూనే ఇక్కడి నటులకు తగిన అవకాశాలు కల్పించడం లేదు. ఈ పక్షపాత ధోరణి తెలుగు నటుల ప్రతిభను జాతీయ స్థాయిలో కుదించివేస్తోందని విశ్లేషకులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిభకు భాషతో సంబంధం లేనప్పటికీ వాణిజ్య సమీకరణాల పేరుతో బాలీవుడ్ ఇండస్ట్రీ చూపిస్తున్న వివక్ష మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇకనైనా టాలీవుడ్ మేకర్స్ ఈ విషయంలో స్పష్టమైన విధానాన్ని అనుసరించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇతర ఇండస్ట్రీల వారికి ఇస్తున్న ప్రాధాన్యతలో కొంతైనా తెలుగు నటులకు, స్థానిక టాలెంట్‌కు కేటాయించాలి. అప్పుడే పరస్పర గౌరవం ఏర్పడుతుంది. బాలీవుడ్ చిత్ర పరిశ్రమ కూడా ప్రాంతీయ భేదాలను పక్కన పెట్టి, ప్రతిభ ఉన్న తెలుగు నటులకు తమ సినిమాల్లో సముచిత స్థానం కల్పించాలి. మార్కెట్ విస్తరణ కోసమే కాకుండా నటీనటుల మార్పిడిలో ఆరోగ్యకరమైన సంస్కృతి కొనసాగాలి.
