Begin typing your search above and press return to search.

టాలీవుడ్ బాకీ.. అఖండ తీరుస్తుందా?

ఒకప్పుడంటే ఇండియాలో బాలీవుడ్డే నంబర్ వన్ ఇండస్ట్రీ. కానీ ‘బాహుబలి’ తర్వాత కథ మారిపోయింది. టాలీవుడ్.. బాలీవుడ్‌నే కాక మిగతా ఇండస్ట్రీలన్నింటినీ వెనక్కి నెట్టి టాప్‌లోకి వెళ్లిపోయింది

By:  Garuda Media   |   9 Oct 2025 2:00 AM IST
టాలీవుడ్ బాకీ.. అఖండ తీరుస్తుందా?
X

ఒకప్పుడంటే ఇండియాలో బాలీవుడ్డే నంబర్ వన్ ఇండస్ట్రీ. కానీ ‘బాహుబలి’ తర్వాత కథ మారిపోయింది. టాలీవుడ్.. బాలీవుడ్‌నే కాక మిగతా ఇండస్ట్రీలన్నింటినీ వెనక్కి నెట్టి టాప్‌లోకి వెళ్లిపోయింది. ‘బాహుబలి: ది కంక్లూజన్’, ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’, ‘కల్కి’, ‘సలార్’, ‘పుష్ప-2’ లాంటి లాంటి భారీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్లతో మరే ఇండస్ట్రీ అందుకోలేని స్థాయికి వెళ్లిపోయింది. గత పదేళ్ల జాబితా తీస్తే నంబర్ వన్ గ్రాసర్ టాలీవుడ్ నుంచి వచ్చిన సంవత్సరాలు చాలానే కనిపిస్తాయి. గత ఏడాది కూడా ‘పుష్ప-2’తో టాలీవుడ్‌దే రికార్డు అయింది. ఐతే 2025లో మాత్రం టాలీవుడ్ వెనుకబడిపోయింది. ఈ ఏడాది మిగతా టాప్ ఇండస్ట్రీల నుంచి ఐదొందల కోట్లకు తక్కువ కాకుండా వసూళ్లు రాబట్టిన సినిమాలున్నాయి.

ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్ రికార్డు బాలీవుడ్ పేరిటే ఉంది. ‘చావా’ సినిమాతో రికార్డు బాలీవుడ్ సొంతమైంది. ఆ చిత్రం రూ.790 కోట్ల దాకా వసూళ్లు రాబట్టింది. ‘సైయారా’ రూపంలో నంబర్-2 స్థానం కూడా బాలీవుడ్‌దే. ఆ సినిమా రూ.600 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. ఇక శాండిల్ వుడ్‌కు ‘కాంతార: చాప్టర్-1’తో భారీ విజయమే దక్కింది. ఈ సినిమా ఇప్పటికే రూ.400 కోట్లు కొల్లగొట్టింది. ఈజీగా ఇంకో రూ.200 కోట్ల వసూళ్లు వచ్చే అవకాశముంది. అంటే శాండిల్‌వుడ్‌ కూడా రూ.500 కోట్ల మార్కును దాటబోతున్నట్లే. ఇక కోలీవుడ్ కొన్నేళ్ల నుంచి నంబర్ల రేసులో వెనకబడ్డప్పటికీ.. ‘కూలీ’ రూపంలో ఆ ఇండస్ట్రీకి కూడా రూ.500 కోట్ల ఘనత దక్కింది. మిక్స్డ్ టాక్‌తోనే ఆ సినిమా ఆ మార్కును అందుకుంది. కానీ టాలీవుడ్ మాత్రం ఇప్పటిదాకా 2025లో రూ.500 కోట్ల మార్కును టచ్ చేయలేదు. ‘ఓజీ’ రూ.350 కోట్ల మార్కు దిశగా అడుగులు వేస్తోంది. రూ.300 కోట్లతో ‘సంక్రాంతికి వస్తున్నాం’ రెండో స్థానంలో ఉంది. ‘రాజా సాబ్’ ఈ ఏడాదే వచ్చేట్లయితే రూ.500 కోట్ల ఘనతే కాదు.. హైయెస్ట్ గ్రాసర్ రికార్డు కూడా సొంతమయ్యేదేమో. కానీ అది జనవరికి వాయిదా పడింది. దీంతో ఇక ఆశలన్నీ ‘అఖండ-2’ మీదే ఉన్నాయి. ఆ సినిమా అంచనాలను అందుకుంటే, పాన్ ఇండియా మ్యాజిక్ వర్కవుట్ అయితే రూ.500 కోట్ల ఘనత సొంతమవుతుందేమో చూడాలి.