చిన్న సినిమాలే కాదు..బడా ప్రాజెక్ట్‌లకూ తప్పని తిప్పలు!
సాధారణంగా చిన్న సినిమాలు మొదలైన తర్వాత వాటిని పూర్తి చేసి థియేటర్లలోకి తీసుకురావడానికి చిన్న నిర్మాతలకు తల ప్రాణం తోకకొస్తుంది.
By: Srikanth Kontham | 16 Oct 2026 4:00 AM ISTసాధారణంగా చిన్న సినిమాలు మొదలైన తర్వాత వాటిని పూర్తి చేసి థియేటర్లలోకి తీసుకురావడానికి చిన్న నిర్మాతలకు తల ప్రాణం తోకకొస్తుంది. ఫైనాన్షియల్ సమస్యలు, పబ్లిసిటీ ఇబ్బందులు వంటి కారణాలతో చిన్న చిత్రాలు నిర్మాణం దశలోనే ఆగిపోవడం లేదా పూర్తయినా రిలీజ్ నోచుకోకపోవడం ఇండస్ట్రీలో తరచూ కనిపిస్తుంది. అయితే కాలం మారుతున్న టాలీవుడ్‌ను శాసించే అగ్ర నిర్మాణ సంస్థలు కూడా ఇదే రకమైన సవాళ్లను, తీవ్రమైన జాప్యాన్ని ఎదుర్కొంటున్నాయనే విషయం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
ప్రస్తుతం టాలీవుడ్లో ప్రఖ్యాత బ్యానర్లు నిర్మిస్తున్న కొన్ని భారీ ..క్రేజీ ప్రాజెక్ట్‌ల పరిస్థితి చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా యూవీ క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సోషియో-ఫాంటసీ చిత్రం `విశ్వంభర` నుంచి మొదలుపెడితే... బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న `టైసన్ నాయుడు` చిత్రాన్ని 14 రీల్స్ సంస్థ నిర్మిస్తోంది. అలాగే నిఖిల్ హీరోగా భారీ బడ్జెట్‌తో టాగూరు మధు సమర్పణలో పిక్సల్ స్టూడియోస్ నిర్మిస్తున్న `స్వయంభూ`, అల్లరి నరేష్ నటిస్తున్న `ఆల్కాహాల్`, టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న `మేజిక్` వంటి చిత్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇవే కాదు ఇలాంటి చిత్రాలు ఇంకా చాలా ఉన్నాయి.
ఈ ప్రాజెక్ట్లన్నిటినీ పరిశీలిస్తే ఇవి సెట్స్‌కి వెళ్లి సంవత్సరాలు గడుస్తున్నా? ఇప్పటివరకు విడుదల తేదీలపై ఎలాంటి క్లారిటీ రాలేదు. షూటింగ్‌లు ఎక్కడ ఆగిపోయాయి? అసలు తెరవెనుక ఏం జరుగుతోంది? ఫైనాన్షియల్ ఇబ్బందులా లేక పోస్ట్-ప్రొడక్షన్ వీఎఫ్ఎక్స్ పనుల జాప్యమా అనేదానిపై మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. బడా ప్రొడక్షన్ హౌసెస్ చేతిలో భారీ బడ్జెట్లు, అగ్ర హీరోలు ఉన్నా? ఇలాంటి భారీ ప్రాజెక్ట్‌లు సైతం కాలయాపన చేస్తుండటం పరిశ్రమలో ఆందోళన కలిగిస్తోంది.
పెద్ద బ్యానర్లకు క్యాపిటల్ సమస్యలు లేకపోయినా? నేటి ట్రెండ్‌కు తగినట్లుగా కంటెంట్‌ను మలచడం, బడ్జెట్ హద్దులు దాటిపోవడం .. పర్ఫెక్ట్ అవుట్‌పుట్ కోసం దర్శకులు ఎక్కువ సమయం తీసుకోవడం వంటివి ఈ జాప్యానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. ఒక సినిమాను అనుకున్న టైమ్‌లో పూర్తి చేసి ఆడియన్స్ ముందుకు తీసు కురావడం ఎంత కష్టమో? ఈ బడా ప్రాజెక్ట్‌ల అనుభవాలు మరోసారి నిరూపిస్తున్నాయి. చిన్న నిర్మాతలకే కాదు. అగ్ర నిర్మాణ సంస్థలకు కూడా రిలీజ్ కత్తిమీద సాములా మారుతోంది.
ఈ చిత్రాలు సెట్స్ మీదకి వెళ్లి చాలా కాలం కావడంతో అభిమానుల్లో కూడా ఆందోళన నెలకొంది. సరైన సమయంలో అప్డేట్స్ రాకపోవడం వల్ల హైప్ తగ్గే ప్రమాదం ఉందని ట్రేడ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా? అగ్ర నిర్మాణ సంస్థలు ప్రతిష్టాత్మకంగా భావించి తెరకెక్కిస్తున్న సినిమాలు ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది.
