2026 మిడ్లోనూ వాయిదాల వెనుక ఊసేలేదు!
పాన్ ఇండియా స్థాయిలో పోటీ తీవ్రంగా ఉన్న తరుణంలో డేట్స్ విషయంలో మేకర్స్ ఆచితూచి అడుగులు వేయడం సహజమే అయినా?
By: Srikanth Kontham | 24 July 2026 11:43 PM ISTటాలీవుడ్‌లో ప్రతిష్టాత్మక చిత్రాల విడుదల తేదీల విషయంలో నెలకొన్న అనిశ్చితి రోజురోజుకు పెరుగుతోంది. 2026 మిడ్ లోకి వచ్చేసినా? పలు భారీ బడ్జెట్ సినిమాల రిలీజ్ డేట్లపై మేకర్స్ నుండి స్పష్టత కరువైంది. వరుస పరాజయాలు, భారీ వీఎఫ్ఎక్స్ పనులు అంచనాలను అందుకోవాలనే కసి కారణంగా నిర్మాతలు ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఫలితంగా షూటింగ్‌లు పూర్తవుతున్నా? లేదా? తుది దశకు చేరుకున్నా సరైన విడుదల తేదీని ప్రకటించడంలో దర్శక, నిర్మాతలు ఇంకా మీమాంసలో కొనసాగుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం `విశ్వంభర` ముందు వరుసలో ఉంది. మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా గ్రాఫిక్స్ పనులకు అత్యంత ప్రాధాన్యత ఉండటంతో అనుకున్న తేదీకి వస్తుందా ? లేదా? అనే దానిపై సందిగ్ధత కొనసాగుతోంది. అలాగే యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నటిస్తోన్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా `స్వయంభూ` పరిస్థితి కూడా ఇలాగే ఉంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి మొదటి భాగం రిలీజ్ పై ఊహాగానాలు గట్టిగా వినిపి స్తున్నప్పటికీ అధికారిక ప్రకటన వెలువడకపోవడం అభిమానులను నిరాశపరుస్తోంది.
మరోవైపు నాగచైతన్య నటిస్తోన్న అడ్వెంచర్ థ్రిల్లర్ `వృషకర్మ`..సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న `సంబరాల ఏటిగట్టు` చిత్రాలు సైతం ఇదే కోవలోకి వస్తున్నాయి. ఈ సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ .. విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఆశించిన దానికంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు సమాచారం. తొందరపడి సినిమాను విడుదల చేసి నాణ్యత విషయంలో రాజీపడే కంటే పర్ఫెక్ట్ అవుట్‌పుట్ వచ్చిన తర్వాతే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకులు భావిస్తున్నారు. అయితే ఈ సుదీర్ఘ మౌనం వల్ల బాక్సాఫీస్ వద్ద సరైన ప్లానింగ్ లేకపోవడం ట్రేడ్ వర్గాలను కలవరపెడుతోంది.
పాన్ ఇండియా స్థాయిలో పోటీ తీవ్రంగా ఉన్న తరుణంలో డేట్స్ విషయంలో మేకర్స్ ఆచితూచి అడుగులు వేయడం సహజమే అయినా? సరైన సమాచారం లేకపోవడం ప్రేక్షకుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇతర ఇండస్ట్రీలు ముందుగానే తమ సినిమాల విడుదల తేదీలను లాక్ చేసుకుంటున్న సమయంలో టాలీవుడ్ మేకర్స్ చివరి నిమిషం వరకు సస్పెన్స్ కొనసాగించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దసరా పండుగ సీజన్ అయినా ? ఈ చిత్రాలకు సరైన మోక్షాన్ని ప్రసాదిస్తాయా లేదా అన్నది చూడాలి.
అయితే ఈ రకమైన అనిశ్చితి ట్రేడ్ వర్గాలను మాత్రమే కాకుండా థియేట్రికల్ ఎగ్జిబిటర్లను కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఏ సమయంలో ఏ సినిమా విడుదలవుతుందనే స్పష్టమైన క్యాలెండర్ లేకపోవడం వల్ల థియేటర్ల ప్లానింగ్ తలకిందులవుతోంది. ఒకే వారంలో భారీ సినిమాలు క్లాష్ అయ్యే ప్రమాదం ఉండటంతో నిర్మాతలు .. డిస్ట్రిబ్యూటర్లు సమన్వయంతో ప్రణాళికాబద్ధమైన రిలీజ్ క్యాలెండర్‌ను రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
