Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో పేర్ల‌ల్ వరల్డ్స్ ట్రెండ్!

టాలీవుడ్ దర్శక నిర్మాతలు వందల, వేల కోట్లు ఖర్చు పెట్టి వెండి తెరపై సరికొత్త ప్రపంచాలను ఆవిష్కరించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

By:  Srikanth Kontham   |   25 Aug 2026 8:00 PM IST
టాలీవుడ్ లో  పేర్ల‌ల్ వరల్డ్స్ ట్రెండ్!
X

టాలీవుడ్ దర్శక నిర్మాతలు వందల, వేల కోట్లు ఖర్చు పెట్టి వెండి తెరపై సరికొత్త ప్రపంచాలను ఆవిష్కరించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రేక్షకుల ఊహకందని కాన్సెప్ట్‌లతో పారలల్ వరల్డ్స్ (సమాంతర ప్రపంచాలు) సినిమాలను తెరకెక్కిస్తూ విజువల్ వండర్లను సృష్టిస్తున్నారు. తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తున్న సరికొత్త ట్రెండ్ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద హాట్ టాపిక్‌గా మారుతోంది.

ఈ కోవలోనే `రాకా` సినిమా కథ ఊహకు కూడా అందనంత పెద్దదిగా ఉండబోతుందనే టాక్ సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి ముంబైలో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్‌లో భారీ జంతువులు, ఒక అద్భుతమైన పెద్ద ప్రపంచాన్ని దర్శకుడు అట్లీ క్రియేట్ చేస్తున్నట్లు సమాచారం. కేవలం యాక్షన్ ఎంటర్‌టై నర్‌గానే కాకుండా ప్రేక్షకులను ఓ కొత్త లోకంలోకి తీసుకువెళ్లేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు.

మరోవైపు టాలీవుడ్‌లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న `వారణాసి` చిత్రం ఖండాలు, కాలాలు దాటేసి ప్రయాణించే విభిన్నమైన కథతో రానుంది. రామాయణంలోని పవిత్రమైన ఇతిహాస కథను నేటి ఆధునిక వారణాసి నగరంతో ముడిపెట్టి ఊహకి అందని విధంగా డైరెక్టర్ డిజైన్ చేస్తున్నారు. కాల ప్రయాణం .. పురాణాల మిశ్రమంతో రాబోతున్న సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచడం ఖాయం.

ఇక సైన్స్ ఫిక్షన్ -పురాణాల నేపథ్యంలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన `కల్కి` చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న `క‌ల్కి 2` కోసం సెంబాల అనే కొత్త ప్రపంచాన్ని దర్శక నిర్మాతలు కళ్ళ ముందుకు తీసుకొస్తున్నారు. భవిష్యత్తు కాలపు సాంకేతికతను, పౌరాణిక అంశాలను అద్భుతంగా మిళితం చేస్తూ సృష్టించిన సమాంతర ప్రపంచం సినిమాకే హైలైట్‌గా నిలవనుంది.

ఇదే రీతిలో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన `సలార్` చిత్రానికి కొనసాగింపుగా రాబోతున్న `సలార్ 2` లోనూ ఖాన్సార్ అనే పారలల్ వరల్డ్ కంటిన్యూ కానుంది. మొదటి భాగంలో పరిచయం చేసిన క్రూరమైన సామ్రాజ్యపు అంతర్గత రాజకీయాలు, పవర్ పాలిటిక్స్ , పాత్రల మధ్య సంఘర్షణలను రెండో భాగంలో మరింత లోతుగా భారీ స్థాయిలో చూపించ‌బోతున్నారు.

అలాగే మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న `విశ్వంభర` చిత్రంలో ఏకంగా 14 లోకాల కాన్సెప్ట్ ఇమిడి ఉంది. ప్రమాదంలో చిక్కుకున్న హీరోయిన్‌ను రక్షించడానికి హీరో ఏకంగా 14 లోకాలను దాటేసి వెళ్లే సరికొత్త సాహసోపేత కథ ఇది. ఇలా టాలీవుడ్‌లో వస్తున్న భారీ చిత్రాలన్నీ తెలుగు చలనచిత్ర పరిశ్రమను మరో స్థాయికి తీసుకెళ్లే సరికొత్త ప్రపంచాల సృష్టికి బాటలు వేస్తున్నాయి.