Begin typing your search above and press return to search.

ఒక్క హీరోతో రెండు పాత్రలు..డ్యూయల్ రోల్‌తో దుమ్మురేపిన సినిమాలు

మన అభిమాన హీరోని వెండితెరపై ఒక్క పాత్రలో చూడటానికే థియేటర్లలో ఫ్యాన్స్‌కు రెండు కళ్లు సరిపోవు.

By:  Madhu Reddy   |   24 May 2026 8:00 PM IST
ఒక్క హీరోతో రెండు పాత్రలు..డ్యూయల్ రోల్‌తో దుమ్మురేపిన సినిమాలు
X

మన అభిమాన హీరోని వెండితెరపై ఒక్క పాత్రలో చూడటానికే థియేటర్లలో ఫ్యాన్స్‌కు రెండు కళ్లు సరిపోవు. అలాంటిది అదే హీరో ఒకే సినిమాలో రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తే ఆ హంగామా మామూలుగా ఉండదు. అందుకే టాలీవుడ్‌లో డ్యూయల్ రోల్ సినిమాలకు ఎప్పుడూ విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అప్పటి సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నుండి ఇప్పటి జనరేషన్ స్టార్ల వరకు డ్యూయల్ రోల్స్‌తో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ఆ క్రేజీ సినిమాల ముచ్చట్లు ఇప్పుడు చూద్దాం..

ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల మార్క్ ద్విపాత్రాభినయం:

తెలుగు సినిమాలో డ్యూయల్ రోల్‌కు ఒక పక్కా సక్సెస్ ఫార్ములా తెచ్చింది సీనియర్ ఎన్టీఆర్ అనే చెప్పాలి. ఇక ఆయన నటించిన సర్దార్ పాపారాయుడు, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి వంటి చిత్రాలలో తండ్రీకొడుకులుగా, విభిన్న శైలి పాత్రల్లో ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉండి బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. అలాగే అక్కినేని నాగేశ్వరరావు సైతం తన ఇద్దరుమిత్రులు, బాపు దర్శకత్వంలో వచ్చిన ‘బుద్ధిమంతుడు’ చిత్రాలలో ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకులను మెప్పించారు.

సూపర్ స్టార్ కృష్ణ ప్రయోగాలు.. బాల నటుడిగా మహేష్:

నటశేఖర కృష్ణ కూడా తన కెరీర్‌లో ఎన్నో ప్రయోగాలు చేశారు. ఆయన ద్విపాత్రాభినయం చేసిన కౌబాయ్ తరహా చిత్రం మహా మోసగాడు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. విశేషం ఏంటంటే, ఆయన కుమారుడు సూపర్ స్టార్ మహేష్ బాబు బాల నటుడిగా ఉన్నప్పుడే తండ్రి కృష్ణ దర్శకత్వంలో కొడుకు దిద్దిన కాపురం, అన్నాతమ్ముడు సినిమాల్లో డ్యూయల్ రోల్స్ పోషించి చిన్నప్పుడే సూపర్ హిట్లు అందుకోవడం విశేషం.

బాక్సాఫీస్ దడదడలాడించిన బాలయ్య, ఎన్టీఆర్:

ఇక ఇప్పటి తరం స్టార్లలో నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ సినిమాలో ఒకవైపు రైతుగా, మరోవైపు అఘోరా (అఖండ)గా రెండు విభిన్న పాత్రల్లో ఊరమాస్ నటనతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ సైతం ‘దేవర’ చిత్రంలో తండ్రి (దేవర), కొడుకు (వర)గా నటించి వందల కోట్ల వసూళ్లు సాధించారు. ఇక అంతకుముందు తారక్ ‘జై లవ కుశ’లో ఏకంగా మూడు విభిన్న పాత్రలు (త్రిపాత్రాభినయం) పోషించి నటుడిగా తన విశ్వరూపం చూపించారు.

రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ మ్యాజిక్:

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కూడా గ్లోబల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గేమ్ చేంజర్’ సినిమాలో డ్యూయల్ రోల్ చేసి అదరగొట్టారు.ఇక రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెట్టిన ఎఫర్ట్స్ మరియు ఆయన నటనకు ప్రేక్షకుల నుండి, అటు అభిమానుల నుండి సూపర్ మార్కులు పడ్డాయి.

ఒకే సినిమాలో ఒకే హీరో రెండు విభిన్న రూపాల్లో కనిపిస్తే వచ్చే కిక్కే వేరు. నటుడిగా హీరోలకు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి, అటు ప్రేక్షకులకు డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ పంచడానికి ఈ డ్యూయల్ రోల్ స్టోరీలు ఎప్పుడూ బెస్ట్ ఛాయిస్. ఇక మరి మున్ముందు మన టాలీవుడ్ స్టార్ హీరోలు ఇలాంటి ద్విపాత్రాభినయాలతో ఇంకెన్ని వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.