Begin typing your search above and press return to search.

90 రోజుల రూల్.. వర్కౌట్ అవుతుందా? ఇబ్బందులు తప్పవా?

అయితే కొత్త రూల్ వల్ల కొన్ని పాజిటివ్ మార్పులు కూడా వచ్చే అవకాశముందని కొందరు సినీ విశ్లేషకులు అంటున్నారు.

By:  M Prashanth   |   21 Jan 2026 11:40 PM IST
90 రోజుల రూల్.. వర్కౌట్ అవుతుందా? ఇబ్బందులు తప్పవా?
X

తెలంగాణలో సినిమాల టికెట్ రేట్ల పెంపు, ప్రత్యేక షోల అనుమతులపై హైకోర్టు జారీ చేసిన 90 రోజుల రూల్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌ గా మారింది. సినిమా విడుదలకు కనీసం మూడు నెలల ముందే టికెట్ హైక్‌ కు సంబంధించిన జీవో తీసుకోవాలన్న ఆదేశాలపై నిర్మాతలు, దర్శకులు, డిస్ట్రిబ్యూటర్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ నిబంధన నిజంగా వర్కౌట్ అవుతుందా? లేక పరిశ్రమకు కొత్త తలనొప్పులే తెస్తుందా? అన్న ప్రశ్న చుట్టూ చర్చ కొనసాగుతోంది.

ఇప్పటివరకు టాలీవుడ్‌ లో సినిమా విడుదల తేదీలు చాలా సార్లు చివరి నిమిషంలో ఖరారయ్యేవి. షూటింగ్ ఆలస్యం కావడం, పాటల చిత్రీకరణ వాయిదా పడటం, వీఎఫ్‌ ఎక్స్ పనులు పూర్తి కాకపోవడం, రెండు మూడు రోజుల ముందు వరకు కూడా రీ–రికార్డింగ్ జరగడం వంటి పరిస్థితులు ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మూడు నెలల ముందే టికెట్ రేట్ల పెంపు జీవో తీసుకోవడం ఎంతవరకు సాధ్యమన్నదే నిర్మాతలకు పెద్ద డౌట్.

మూడు నెలల ముందే జీవో తీసుకుని, ఆ తర్వాత ఏదైనా కారణంతో సినిమా వాయిదా పడితే పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న తెరపైకి వచ్చింది. ఒకసారి జీవో తీసుకున్న తర్వాత విడుదల తేదీ మారితే, మళ్లీ కొత్త జీవో కోసం మరో మూడు నెలలు వేచి చూడాలా? లేక పాత జీవోనే ఉపయోగించుకోవచ్చా? అనే స్పష్టత లేకపోవడం మేకర్స్‌ ను ఆందోళనకు గురిచేస్తోంది. నిర్మాతలపై ఆర్థిక ఒత్తిడి మరింత పెరిగే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు.

అయితే కొత్త రూల్ వల్ల కొన్ని పాజిటివ్ మార్పులు కూడా వచ్చే అవకాశముందని కొందరు సినీ విశ్లేషకులు అంటున్నారు. విడుదల తేదీలపై మూడు నుంచి నాలుగు నెలల ముందే స్పష్టత వస్తే, క్లాష్‌ లు తగ్గుతాయని, స్క్రీన్ల కోసం చివరి నిమిషంలో గొడవలు, ఒప్పందాల కోసం పరుగులు తీయాల్సిన అవసరం ఉండదని అభిప్రాయపడుతున్నారు. ప్రొడక్షన్ ప్లానింగ్ సరిగ్గా ఉంటుందని చెబుతున్నారు.

కానీ ఆ నిబంధనను అమలు చేయడం అంత సులువు కాదన్నదే ఎక్కువ మంది నిర్మాతల అభిప్రాయం. చాలా సినిమాలు మూడు నెలల ముందుకు వచ్చేసరికి షూటింగ్ మధ్యలోనే ఉంటాయని, అప్పటికి బడ్జెట్ ఫైనల్ కాకపోవడం వల్ల టికెట్ రేట్ల పెంపు ఎంత అవసరమో చెప్పలేని పరిస్థితి ఉంటుందని అంటున్నారు. ఒకవేళ జీవో వచ్చిన తర్వాత బడ్జెట్ పెరిగితే సమస్యలు తప్పవని చెబుతున్నారు. మరికొందరైతే రేట్ల పెంపు మీద ఆధారపడటం మానేసి, సినిమాల బడ్జెట్లు తగ్గించుకోవడమే మంచిదని సూచిస్తున్నారు.

మొత్తానికి 90 రోజుల రూల్ శుభపరిణామాలు తెస్తుందా? లేక కొత్త సమస్యలకు దారి తీస్తుందా? అన్నది ఇప్పుడు చెప్పడం కష్టమే. కానీ అమల్లోకి వస్తే, సినిమా విడుదల విధానంలో పెద్ద మార్పులు రావడం ఖాయమని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. మరి ఆ మార్పులను పరిశ్రమ ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి.