Begin typing your search above and press return to search.

ఎనిమిది వారాల కండీష‌న్ వ‌ర్కౌట్ అవ్వాలంటే ఏం చేయాలి

తెలుగు ప‌రిశ్ర‌మ‌లో థియేట్రికల్ విడుదల, ఓటీటీ స్ట్రీమింగ్‌కు మధ్య ఎనిమిది వారాల వ్యవధి ఉండాలనే ప్రతిపాదన ఎప్పటినుంచో చర్చల్లో ఉంది.

By:  Srikanth Kontham   |   20 Sept 2026 1:00 AM IST
ఎనిమిది వారాల కండీష‌న్ వ‌ర్కౌట్ అవ్వాలంటే ఏం చేయాలి
X

తెలుగు ప‌రిశ్ర‌మ‌లో థియేట్రికల్ విడుదల, ఓటీటీ స్ట్రీమింగ్‌కు మధ్య ఎనిమిది వారాల వ్యవధి ఉండాలనే ప్రతిపాదన ఎప్పటినుంచో చర్చల్లో ఉంది. బాలీవుడ్‌లో ఎనిమిది వారాల నిబంధన పక్కాగా అమలవుతుండటంతో అక్కడ ప్రేక్షకులు థియేటర్లకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే టాలీవుడ్‌లో మాత్రం సినిమా విడుదలైన నాలుగు వారాల్లోనే (లేదా కొన్నిసార్లు అంతకంటే ముందే) ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇక్కడ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఒక్కరే కావడం లేదా వారి మధ్య సత్సంబంధాలు ఉండటంతో, డిజిటల్ రైట్స్ ద్వారా త్వరితగతిన రికవరీ సాధించేందుకు నాలుగు వారాలకే ఒప్పందాలు చేసుకుంటున్నారనే అంశం ప్రధానంగా తెరపైకి వ‌స్తోంది.

టాలీవుడ్ మార్కెట్ నిర్మాణ శైలిలో పెద్ద నిర్మాతలే స్వయంగా డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉండటం ..తమకు నమ్మకమైన నెట్‌వర్క్ ద్వారా సినిమాలను విడుదల చేయడం పరిపాటి. దీంతో థియేటర్లలో కలెక్షన్లు కొద్దిగా తగ్గగానే తమ పెట్టుబడిని సురక్షితంగా వెనక్కి రప్పించుకోవడానికి త్వరపడి ఓటీటీ స్ట్రీమింగ్‌కు మొగ్గు చూపుతున్నారు. థియేటర్ వ్యవస్థ సుదీర్ఘ ప్రయోజనాల కంటే కూడా డిజిటల్ రైట్స్ లాభాలకే ప్రాధాన్యత ఇస్తుండటంతో ఎనిమిది వారాల నిబంధన కాగితాలకే పరిమితమవుతోంది. ఈ అంతర్గత వ్యూహాత్మక వైరుధ్యాన్ని అధిగమించడమే ఇప్పుడు పరిశ్రమ ముందున్న అతిపెద్ద సవాలు.

దీన్ని అధిగమించాలంటే మొదటగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ గిల్డ్ , ఎగ్జిబిటర్ల వ్యవస్థ కలిసి కఠినమైన ఏకీకృత విధానాన్ని రూపొందించాలి. నిర్మాత , డిస్ట్రిబ్యూటర్ ఒక్కరే అయినా? పరిశ్రమలోని అందరికీ ఒకే నిబంధన వర్తించేలా రూల్స్ తయారు చేయాలి. ఎనిమిది వారాల గ్యాప్ నిబంధనను ఉల్లంఘించే చిత్రాలపై పెనాల్టీలు విధించడం లేదా భవిష్యత్ చిత్రాలకు థియేట్రికల్ మద్దతు నిలిపివేత వంటి కఠిన చర్యలు తీసుకునేలా పటిష్టమైన ఒప్పందం జరగాలి. అప్పుడే వ్యక్తిగత వ్యాపార ప్రయోజనాల కంటే పరిశ్రమ శ్రేయస్సుకు ప్రాధాన్యత లభిస్తుంది.

థియేటర్లకు ప్రేక్షకులను మళ్లీ రప్పించేలా టికెట్ ధరల్లో మినహాయింపులు , ఫ్లెక్సిబుల్ రేట్ల విధానాన్ని తీసుకురావాలి. మొదటి వారం లేదా పది రోజుల తర్వాత టికెట్ ధరలను గణనీయంగా తగ్గించడం వల్ల సామాన్య ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చేందుకు ఆసక్తి చూపుతారు. థియేటర్ల ద్వారా సుదీర్ఘ కాలం ఆక్యుపెన్సీ లభిస్తే, నిర్మాతలకు కూడా త్వరపడి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు అమ్మాల్సిన అవసరం ఉండదు. థియేట్రికల్ వసూళ్లు స్థిరంగా సాగినప్పుడు మాత్రమే ఎనిమిది వారాల విండో అనేది నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్‌కు , ఎగ్జిబిటర్‌కు లాభదాయకంగా మారుతుంది.

అలాగే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లతో చేసుకునే ఒప్పందాల శైలిలోనూ మార్పులు రావలసి ఉంది. బడ్జెట్ , బాక్సాఫీస్ ప్రదర్శన ఆధారంగా టైర్డ్ విండో సిస్టమ్ ను అమలు చేయోచ్చు. ఒకవేళ ఏ ఓటీటీ సంస్థ అయినా ఎనిమిది వారాల కంటే ముందే సినిమాను స్ట్రీమింగ్ చేయాలని భావిస్తే? దానికి భారీగా అదనపు ఛార్జీలు విధించేలా కాంట్రాక్టులు డిజైన్ చేయాలి. అలాగే ముందస్తు స్ట్రీమింగ్ వల్ల థియేటర్ యజమానులకు జరిగే నష్టాన్ని భరించేలా నిబంధనలు ఉంటే ఓటీటీ సంస్థలు కూడా ఎనిమిది వారాలు ఆగడానికే ప్రాధాన్యత ఇస్తాయి.

అంతిమంగా టాలీవుడ్‌లో ఎనిమిది వారాల ఓటీటీ నిబంధన వర్కవుట్ అవ్వాలంటే కేవలం ప్రటనలతో సరిపోదు. పరిశ్రమలోని ప్రతి వ్యవస్థా స్వార్థాన్ని పక్కనపెట్టి సహకరించాలి. నిర్మాత-డిస్ట్రిబ్యూటర్ ఒకే గొడుగు కింద ఉన్నప్పటికీ థియేట్రికల్ వ్యవస్థ దెబ్బతింటే భవిష్యత్తులో సినిమా ఉనికికే ప్రమాదమని గుర్తించాలి. అంతా కలిసికట్టుగా నిర్ణయం తీసుకుని పటిష్టమైన ప్రణాళికతో ముందడుగు వేస్తేనే బాలీవుడ్ తరహాలో టాలీవుడ్‌లోనూ ఎనిమిది వారాల రూల్ విజయవంతమై థియేటర్లకు పూర్వ వైభవం సాధ్యమవుతుంది.