2026 బాక్సాఫీస్.. చివరి మూడు నెలల్లో ఇలా..
అందులో తెలుగు స్ట్రెయిట్ సినిమాలతో పాటు పెద్ద డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. ఈ మూడు నెలల్లో వచ్చే ఫలితాలే ఏడాది చివరి లెక్కను బాగా మార్చే అవకాశం ఉంది.
By: M Prashanth | 18 Sept 2026 10:30 AM ISTసెప్టెంబర్ 24న ‘ది ప్యారడైజ్’తో టాలీవుడ్‌లో మరో పెద్ద రిలీజ్ రాబోతోంది. అక్కడితో సెప్టెంబర్ ముగిసినా, 2026 బాక్సాఫీస్‌కు ఇంకా మూడు నెలల ఆట మిగిలే ఉంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఇప్పటికే చాలా సినిమాలు డేట్లు పట్టేశాయి. అందులో తెలుగు స్ట్రెయిట్ సినిమాలతో పాటు పెద్ద డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. ఈ మూడు నెలల్లో వచ్చే ఫలితాలే ఏడాది చివరి లెక్కను బాగా మార్చే అవకాశం ఉంది.
అక్టోబర్ మొదటి వారంలో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’, ‘ఆదర్శ కుటుంబం’, ‘సిగ్మా’ లాంటి సినిమాలు వస్తున్నాయి. నెల మధ్యలో మాత్రం పోటీ మరింత పెరుగుతోంది. అక్టోబర్ 15న ‘జైలర్ 2’ తెలుగు వెర్షన్, 16న విజయ్ దేవరకొండ ‘రణబాలి’తో పాటు ‘ఓం చాప్టర్ 1’ ఉన్నాయి. ముఖ్యంగా ‘రణబాలి’పై పెద్ద బిజినెస్ ఉండటంతో అక్టోబర్ లెక్కలో ఆ సినిమా నెంబర్స్ ఎక్కువగా ఉండొచ్చు.
నవంబర్‌లో పరిస్థితి మరోలా ఉంది. 6న రామాయణ పార్ట్ 1, సూర్య సీన్, మహాశక్తి ఒకే తేదీకి వస్తున్నాయి. 20న దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ వస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. నెల చివర్లో రష్మిక ‘మైసా’ కూడా ఉంది. ఒకే నెలలో డబ్బింగ్ సినిమాలు, తెలుగు సినిమాలు కలిసిరావడంతో స్క్రీన్స్ కోసం పోటీ ఎక్కువగా ఉండొచ్చు.
డిసెంబర్‌లో మాత్రం స్టార్ సినిమాల సంఖ్య పెరుగుతోంది. ప్రభాస్ ఫౌజీ డిసెంబర్ 3కు ప్లాన్ చేశారు. నాగచైతన్య వృషకర్మ 4న వస్తోంది. క్రిస్మస్ దగ్గర బాలకృష్ణ దాదా, నాగార్జున కింగ్ 100 డిసెంబర్ 24ను టార్గెట్ చేస్తున్నాయి. అదే సమయంలో షారుఖ్ ఖాన్ ‘కింగ్’ కూడా ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో హిందీ సినిమా నుంచి కూడా పోటీ తప్పదు.
ఇక అక్టోబర్, నవంబర్‌లో చాలా సినిమాలు ఒకదానికొకటి దగ్గరగా వస్తుండగా, డిసెంబర్‌లో పెద్ద హీరోల సినిమాలు తక్కువ గ్యాప్‌లో ఉన్నాయి. ఒక సినిమా మంచి టాక్ తెచ్చుకుంటే తర్వాతి రిలీజ్ వచ్చేలోపు ఎంత వసూలు చేయగలదన్నది చాలా ముఖ్యం. పెద్ద బిజినెస్ చేసిన సినిమాలకు రెండు మూడు వారాలు ఖాళీగా ఉండే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే 2026 చివరి మూడు నెలల్లో బాక్సాఫీస్ వద్ద గేమ్ చాలా డిఫరెంట్ గా ఉండనుంది. కానీ కచ్చితంగా కలెక్షన్స్ తో మాత్రం మళ్ళీ న్యూ రికార్డ్స్ బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు అనిపిస్తోంది.
