Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌ కు గట్టి సవాళ్లు.. ప్రభావం ఎంత?

తెలుగు సినిమా పరిశ్రమకు 2026 సంవత్సరం ఆశించినంతగా కలిసి రావడం లేదని చెప్పాలి.

By:  M Prashanth   |   12 April 2026 4:00 AM IST
టాలీవుడ్‌ కు గట్టి సవాళ్లు.. ప్రభావం ఎంత?
X

తెలుగు సినిమా పరిశ్రమకు 2026 సంవత్సరం ఆశించినంతగా కలిసి రావడం లేదని చెప్పాలి. భారీ అంచనాలతో వచ్చిన పలు పెద్ద చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు సాధించకపోవడం, చిన్న నిర్మాతలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడం, థియేటర్ వ్యవస్థలో మార్పులపై వివాదాలు తలెత్తడం వంటి అంశాలు టాలీవుడ్‌ ను కుదిపేస్తున్నాయి.

మొదటగా.. హై బడ్జెట్ సినిమాల విషయానికి వస్తే, స్టార్ హీరోలతో, అత్యాధునిక సాంకేతికతతో తెరకెక్కించిన సినిమాలు కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. కథలో కొత్తదనం లేకపోవడం, పాత తరహా కమర్షియల్ ఫార్ములాలకే పరిమితమవడం వల్ల ప్రేక్షకులు ఆసక్తి చూపడం తగ్గిందని చెప్పాలి. భారీ ఖర్చులతో తీసిన సినిమాలు కలెక్షన్లు రాబట్టలేకపోవడంతో నిర్మాతలు నష్టాలు చవిచూస్తున్నారు.

ఇక చిన్న సినిమాల పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఓటీటీ విడుదలలపై అమలులో ఉన్న 8 వారాల గ్యాప్ చిన్న నిర్మాతలకు పెద్ద సమస్యగా మారింది. థియేటర్లలో సినిమా పెద్దగా ఆడకపోతే వెంటనే ఓటీటీకి ఇచ్చి కొంత మేరకు నష్టాలను పూడ్చుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ గ్యాప్ కారణంగా ఓటీటీ సంస్థలు కూడా సినిమాలపై ఎక్కువ మొత్తాలు పెట్టడానికి ముందుకు రావడం లేదు.

దీంతో చిన్న సినిమాలు విడుదలకు ముందే ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. మరోవైపు థియేటర్ వ్యవస్థలో పర్సెంటేజ్ వర్సెస్ రెంటల్ విధానంపై వివాదం మరింత తీవ్రతరం అవుతోంది. ఎగ్జిబిటర్లు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలని కోరుతుండగా, నిర్మాతలు మాత్రం అద్దె విధానానికే కట్టుబడి ఉండాలని స్పష్టం చేస్తున్నారు. పెద్ద నిర్మాతలు ఆ విషయంలో కఠిన వైఖరి అవలంబించడం వల్ల థియేటర్ యజమానులు, పంపిణీదారుల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి.

ఇదే పరిస్థితి కొనసాగితే ఎగ్జిబిషన్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అదే సమయంలో కొన్ని సినిమాలు కాన్సెప్ట్ పేరుతో అతి వయొలెన్స్ సన్నివేశాలతో ప్రేక్షకుల ముందుకు రావడం కూడా విమర్శలకు దారి తీస్తోంది. కథకు అవసరమైన స్థాయిని దాటే హింసాత్మక దృశ్యాలు, లాజిక్‌ కు అందని కథాంశాలు ప్రేక్షకులను విసిగిస్తున్నాయి.

ఫలితంగా ఇలాంటి సినిమాలు ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రిజల్ట్ ను ఎదుర్కొంటున్నాయి. మొత్తానికి, కథల ఎంపికలో కొత్తదనం లేకపోవడం, వ్యాపార విధానాల్లో స్పష్టత లేకపోవడం, ఓటీటీ విధానాలు, థియేటర్ వ్యవస్థలో మార్పులు వంటి అంశాలు కలిసి టాలీవుడ్‌ ను ప్రస్తుతం నిరాశ పరిస్థితిలోకి నెట్టాయి. ఆ పరిస్థితులను అధిగమించడానికి నిర్మాతలు, దర్శకులు, ఎగ్జిబిటర్లు కలిసి సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.